అసెంబ్లీలో చర్చకు బీఆర్‌ఎస్ కసరత్తు
పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం
తాగునీటి ప్రాజెక్టు అనే దానిపై సమర్థంగా వాదనలు విన్పించాలి
వాస్తవ ఉద్దేశాలను విడమరిచి చెప్పాలి
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్న అధినేత
అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో గులాబీ పార్టీ
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలు పథకంపై అసెంబ్లీ వేదికగా చర్చ జరగనున్న నేపథ్యంలో పార్టీ పరంగా వినిపించాల్సిన వాదనపై బీఆర్‌ఎస్ కసరత్తు చేస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కొత్త అంశాన్ని ప్రభుత్వం తెరమీదకు తెస్తుండటంతో దానిని సమర్థవంతంగా తిప్పి కొట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహానికి పదును పెడుతోంది. సోమవారం సాయంత్రం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డితో పాటు మరికొందరు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నందినగర్ నివాసంలో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావుతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం..పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి వాదన వినిపిస్తుందనే అంశంపై చర్చ జరిగింది. ‘పాలమూరు–రంగారెడ్డి పథకం కింద తాగునీటి కోసం 7.15 టీఎంసీలతో పనులు చేసేందుకు అనుమతి ఇవ్వాలని గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కోరిందని చెప్పేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. కాబట్టి తాగునీటి ప్రాజెక్టుగా పేర్కొనడం వెనుక ఉన్న వాస్తవ ఉద్దేశాలను విడమరిచి చెప్పాలి..’ అని కేసీఆర్ సూచించారు. ప్రభుత్వం ‘పాలమూరు’ను తాగునీటి ప్రాజెక్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే..దాని నేపథ్యాన్ని కూడా బలంగా వినిపించాలని ఆయన ఆదేశించినట్లు తెలిసింది.
అలాగే పాలమూరు ఎత్తిపోతలు పథకం డీపీఆర్, బీఆర్‌ఎస్ హయాంలో సాధించిన అనుమతులు, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలని సూచించినట్లు సమాచారం. కాగా అనుమతుల ప్రక్రియను దృష్టిలో పెట్టుకుని తాగునీటి ప్రాజెక్టు పేరిట పనులు చేపట్టడం సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ అనే వాదన వినిపించేందుకు అవసరమైన సమాచారాన్ని బీఆర్‌ఎస్ నేతలు సేకరిస్తున్నారు.
కేంద్రం వైఖరిని కూడా ప్రశ్నించాలి
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి సహకారం లేకపోవడాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్‌ఎస్.. ఇదే అంశాన్ని అసెంబ్లీలోనూ ప్రస్తావించనుంది. పర్యావరణ అనుమతుల జారీకి కేంద్ర పర్యావరణ శాఖ నిరాకరించిందనే వార్తల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను ఎత్తిచూపాలని కేసీఆర్ ఆదేశించారు. కాగా నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతలు పథకానికి డీపీఆర్ ఇవ్వకుండానే ప్రస్తుత ప్రభుత్వం టెండర్లు పిలవడం, పనులు మొదలు పెట్టడాన్ని ప్రస్తావించి అధికార పక్షాన్ని ఇరకాటంలోకి నెట్టాలనే యోచనలో బీఆర్‌ఎస్ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది.
సర్కారు ప్రకటనను బట్టి కార్యాచరణ
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలు పథకానికి సంబంధించి అసెంబ్లీలో ప్రభుత్వం చేసే ప్రకటన ఆధారంగా తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టాలని కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే మూడు ఉమ్మడి జిల్లాలు మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ పరిధిలో బహిరంగ సభల నిర్వహణకు బీఆర్‌ఎస్ సన్నాహాలు చేస్తోంది. మరోవైపు అసెంబ్లీలో ప్రభుత్వం చేసే ప్రకటనను బట్టి అవసరమైతే సుప్రీంకోర్టులోనూ పార్టీ పరంగా కేసు దాఖలు చేయాలని ఆ పార్టీ యోచిస్తున్నట్లు తెలిసింది. కృష్ణా నదిపై ఏపీ చేపడుతున్న ప్రాజెక్టులు, అనుమతులు, నదీ జలాల్లో తెలంగాణ వాటా, ట్రిబ్యునళ్ల తీర్పులు తదితరాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి క్రోడీకరించాలని బీఆర్‌ఎస్ అధినేత ఆదేశించినట్లు తెలిసింది.


