సమావేశంలో బాలకిష్టారెడ్డితో వీసీలు
ప్రభుత్వానికి వైస్ చాన్స్‌లర్ల విజ్ఞప్తి
సమస్యలు పరిష్కరించకపోతే ఉనికికే ప్రమాదం
ఫ్యాకల్టీ లేకుండా బోధన ఎలా?.. ర్యాంకులెలా వస్తాయి?
విద్యాశాఖకు కనీసం 10% బడ్జెట్ ఉండాలన్న ఉప కులపతులు
సాక్షి, హైదరాబాద్: విశ్వ విద్యాలయాల్లో సమస్యలు పరిష్కరించి వాటికి ఊపిరి పోయాలని ఉప కులపతులు ప్రభుత్వాన్ని కోరారు. మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టకపోతే ఉనికికే ప్రమాదమని స్పష్టం చేశారు. ఫ్యాకల్టీ ఖాళీలను భర్తీ చేయకపోతే బోధన ఎలా చేస్తామని ప్రశ్నించారు. బోధనే అరకొరగా ఉంటే ర్యాంకులు ఎలా సాధ్యమంటూ నిస్సహాయత వ్యక్తం చేశారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి నేతృత్వంలో సోమవారం వీసీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు పలు అంశాలను కౌన్సిల్ దృష్టికి తెచ్చారు.
బోధన కష్టంగా ఉంది
అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ బోధన కష్టంగా ఉంది. 70 శాతానికి పైగా శాశ్వత పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తాత్కాలిక బోధకులతో నెట్టుకొస్తున్నాం. దీనివల్ల నాణ్యత దెబ్బతింటోంది. ప్రాజెక్టులు రావడం కూడా కష్టంగా ఉంది. జాతీయ ర్యాంకుల సాధనలోనూ ఇదే ప్రధాన అడ్డంకిగా మారింది. ఫ్యాకల్టీ కొరత ఉండటం వల్ల ర్యాంకులకు అనుగుణంగా సమాచారం ఇవ్వడం సాధ్యం కావడం లేదు. హేతుబద్ధీకరణకు కమిటీని ఏర్పాటు చేయాలి..’ అని వీసీలు కోరారు. బోధనేతర సిబ్బంది పోస్టుల ఖాళీలను కూడా ప్రస్తావించారు.
నిధులు పెంచాలి
‘రాష్ట్ర బడ్జెట్ మొత్తంలో విద్యా రంగానికి కనీసం 10 శాతం నిధులు కేటాయించాలి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాల విద్య స్థాయి నుంచే ఏఐ ఆధారిత విద్యా బోధన ఉండాలి. యూనివర్సిటీ స్థాయిలో దీన్ని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళాలి. అయితే దీనికి నిధుల కొరతే అడ్డంకిగా ఉంది..’ అని వీసీలు తెలిపారు. కాగా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చేలా తాను కృషి చేస్తానని బాలకిష్టారెడ్డి హామీ ఇచ్చారు.
యూజీ, పీజీలో మార్పులు
అన్ని యూనివర్సిటీల పరిధిలో ఉమ్మడి సిలబస్ తీసుకొచ్చే ప్రక్రియ వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించారు. కొత్తగా రూపకల్పన చేసిన సిలబస్‌ను కూడా అందుబాటులోకి తేవాలని, సిలబస్‌ను కాలేజీలు మొదలవ్వడానికి ముందే విద్యార్థులకు అందించాలని వీసీలను బాలకిష్టారెడ్డి కోరారు. ఆధునిక పోకడలకు అనుగుణంగా యూజీ, పీజీ కోర్సుల్లో మార్పులు చేసినట్టు తెలిపారు.
కాగా ఉమ్మడి బోధన ప్రణాళిక అమలుకు కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. యూనివర్సిటీల పరిధిలో ఉన్న కాలేజీల్లో అకడమిక్ ఆడిట్ చేపట్టాలని సమావేశం అభిప్రాయపడింది. ముఖ్యంగా 25 శాతం అడ్మిషన్లు పూర్తవ్వని కాలేజీలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, జీరో అడ్మిషన్లు ఉన్న కాలేజీలకు అనుమతులను సమీక్షించాలని తీర్మానించింది. సమావేశంలో ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం, ఎస్‌కె మహమూద్, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ పాల్గొన్నారు.


