breaking news
Vice-Chancellors
-
వర్సిటీలకు ఊపిరి పోయండి
సాక్షి, హైదరాబాద్: విశ్వ విద్యాలయాల్లో సమస్యలు పరిష్కరించి వాటికి ఊపిరి పోయాలని ఉప కులపతులు ప్రభుత్వాన్ని కోరారు. మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టకపోతే ఉనికికే ప్రమాదమని స్పష్టం చేశారు. ఫ్యాకల్టీ ఖాళీలను భర్తీ చేయకపోతే బోధన ఎలా చేస్తామని ప్రశ్నించారు. బోధనే అరకొరగా ఉంటే ర్యాంకులు ఎలా సాధ్యమంటూ నిస్సహాయత వ్యక్తం చేశారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి నేతృత్వంలో సోమవారం వీసీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు పలు అంశాలను కౌన్సిల్ దృష్టికి తెచ్చారు. బోధన కష్టంగా ఉందిఅన్ని విశ్వవిద్యాలయాల్లోనూ బోధన కష్టంగా ఉంది. 70 శాతానికి పైగా శాశ్వత పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తాత్కాలిక బోధకులతో నెట్టుకొస్తున్నాం. దీనివల్ల నాణ్యత దెబ్బతింటోంది. ప్రాజెక్టులు రావడం కూడా కష్టంగా ఉంది. జాతీయ ర్యాంకుల సాధనలోనూ ఇదే ప్రధాన అడ్డంకిగా మారింది. ఫ్యాకల్టీ కొరత ఉండటం వల్ల ర్యాంకులకు అనుగుణంగా సమాచారం ఇవ్వడం సాధ్యం కావడం లేదు. హేతుబద్ధీకరణకు కమిటీని ఏర్పాటు చేయాలి..’ అని వీసీలు కోరారు. బోధనేతర సిబ్బంది పోస్టుల ఖాళీలను కూడా ప్రస్తావించారు. నిధులు పెంచాలి‘రాష్ట్ర బడ్జెట్ మొత్తంలో విద్యా రంగానికి కనీసం 10 శాతం నిధులు కేటాయించాలి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాల విద్య స్థాయి నుంచే ఏఐ ఆధారిత విద్యా బోధన ఉండాలి. యూనివర్సిటీ స్థాయిలో దీన్ని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళాలి. అయితే దీనికి నిధుల కొరతే అడ్డంకిగా ఉంది..’ అని వీసీలు తెలిపారు. కాగా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చేలా తాను కృషి చేస్తానని బాలకిష్టారెడ్డి హామీ ఇచ్చారు.యూజీ, పీజీలో మార్పులుఅన్ని యూనివర్సిటీల పరిధిలో ఉమ్మడి సిలబస్ తీసుకొచ్చే ప్రక్రియ వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించారు. కొత్తగా రూపకల్పన చేసిన సిలబస్‌ను కూడా అందుబాటులోకి తేవాలని, సిలబస్‌ను కాలేజీలు మొదలవ్వడానికి ముందే విద్యార్థులకు అందించాలని వీసీలను బాలకిష్టారెడ్డి కోరారు. ఆధునిక పోకడలకు అనుగుణంగా యూజీ, పీజీ కోర్సుల్లో మార్పులు చేసినట్టు తెలిపారు.కాగా ఉమ్మడి బోధన ప్రణాళిక అమలుకు కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. యూనివర్సిటీల పరిధిలో ఉన్న కాలేజీల్లో అకడమిక్ ఆడిట్ చేపట్టాలని సమావేశం అభిప్రాయపడింది. ముఖ్యంగా 25 శాతం అడ్మిషన్లు పూర్తవ్వని కాలేజీలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, జీరో అడ్మిషన్లు ఉన్న కాలేజీలకు అనుమతులను సమీక్షించాలని తీర్మానించింది. సమావేశంలో ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం, ఎస్కె మహమూద్, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ పాల్గొన్నారు. -
తెలంగాణలో వీసీల నియామకం అమలు సబబే
న్యూఢిల్లీ : తెలంగాణ ప్రభుత్వం ఎనిమిది విశ్వవిద్యాలయాలకు ఇటీవల నియమించిన ఉపకులపతుల నియామకపు ఉత్తర్వులను సుప్రీం కోర్టు సమర్థించింది. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) రూపొందించిన మార్గదర్శకాలను సవరించుకుని ఉప కులపతులను నియమించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్న తెలంగాణ ప్రభుత్వ వాదనలతో సుప్రీం కోర్టు ఏకీభవించింది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన వీసీల నియామకాలపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన ఉమ్మడి హైకోర్టు ఆ నియామకాలను నిలుపదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్.ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈనేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది, భారత అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ తమిళనాడులోని మదురై విశ్వవిద్యాలయానికి సంబంధించిన వి.కల్యాణీ మదివణ్ణన్ కేసులో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తీర్పు ప్రకారం యూజీసీ మార్గదర్శకాలను సవరించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని వివరించారు. ఛాన్స్లర్ల నియామకంలో సైతం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందని వాదించారు. తెలంగాణ ప్రభుత్వం సెర్చ్ కమిటీ మార్గదర్శకాల్లో ఎలాంటి మార్పు చేయలేదని, ఆయా కమిటీలు చేసిన సిఫారసుల మేరకే ఉపకులపతులను నియమించిందని వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నియామకాలను అమలుచేసుకోవచ్చని పేర్కొంది. అయితే ఛాన్స్‌లర్‌గా ఉండే గవర్నర్ స్థానంలో ఇతరులను ఛాన్స్లర్లుగా నియమించుకునే అధికారానికి సంబంధించిన అంశంపై మరికొన్ని విశ్వవిద్యాలయాల స్పందనలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. ఇందుకోసం ప్రతివాది మోహన్‌రావు సహా పలు విశ్వవిద్యాలయాలకు నోటీసులు జారీచేసింది. -
వీసీ పోస్టులకు నోటిఫికేషన్ జారీ
ప్రొఫెసర్‌గా కనీస సర్వీసు ఐదేళ్లకు కుదింపు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని తొమ్మిది విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న వైస్‌చాన్సలర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉస్మానియా, జేఎన్టీయూహెచ్, కాకతీయ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక, పొట్టి శ్రీరాములు తెలుగు, శాతవాహన, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ యూనివర్సిటీలకు వైస్ చాన్సలర్ల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. వీసీ పోస్టుకు దరఖాస్తు చేసుకునేందుకు ఆచార్యునిగా ఉండాల్సిన కనీస అనుభవ పరిమితి ఇప్పటిదాకా పదేళ్లుండగా దాన్ని ఐదేళ్లకు కుదించారు. అర్హులు నిర్దేశిత నమూనాలో సమగ్ర వివరాలతో బయోడేటాను ధ్రువీకరణ పత్రాలతో సహా జనవరి 8లోగా రిజిస్టర్ పోస్టు ద్వారా సచివాలయంలోని ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి చేరేలా పంపాలి. వీసీ పోస్టుకు దరఖాస్తు చేసుకుందుకు అవసరమైన అర్హతలు, ఇతర వివరాలకు tsche.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.


