తెలంగాణలో వీసీల నియామకం అమలు సబబే | SC breather for telangana govt on Vice Chancellor appointments | Sakshi
Sakshi News home page

తెలంగాణలో వీసీల నియామకం అమలు సబబే

Aug 29 2016 4:01 PM | Updated on Sep 2 2018 5:24 PM

తెలంగాణలో యూనివర్శిటీ వైస్ చాన్స్‌లర్ల (వీసీల) నియామకం కేసు విచారణ సుప్రీంకోర్టులో జరిగింది.

న్యూఢిల్లీ : తెలంగాణ ప్రభుత్వం ఎనిమిది విశ్వవిద్యాలయాలకు ఇటీవల నియమించిన ఉపకులపతుల నియామకపు ఉత్తర్వులను సుప్రీం కోర్టు సమర్థించింది. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) రూపొందించిన మార్గదర్శకాలను సవరించుకుని ఉప కులపతులను నియమించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్న తెలంగాణ ప్రభుత్వ వాదనలతో సుప్రీం కోర్టు ఏకీభవించింది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన వీసీల నియామకాలపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన ఉమ్మడి హైకోర్టు ఆ నియామకాలను నిలుపదల చేసిన విషయం తెలిసిందే.

ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్.ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈనేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది, భారత అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ తమిళనాడులోని మదురై విశ్వవిద్యాలయానికి సంబంధించిన వి.కల్యాణీ మదివణ్ణన్ కేసులో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తీర్పు ప్రకారం యూజీసీ మార్గదర్శకాలను సవరించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని వివరించారు. ఛాన్స్‌లర్ల నియామకంలో సైతం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందని వాదించారు.

తెలంగాణ ప్రభుత్వం సెర్చ్ కమిటీ మార్గదర్శకాల్లో ఎలాంటి మార్పు చేయలేదని, ఆయా కమిటీలు చేసిన సిఫారసుల మేరకే ఉపకులపతులను నియమించిందని వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నియామకాలను అమలుచేసుకోవచ్చని పేర్కొంది. అయితే ఛాన్స్‌లర్‌గా ఉండే గవర్నర్ స్థానంలో ఇతరులను ఛాన్స్‌లర్లుగా నియమించుకునే అధికారానికి సంబంధించిన అంశంపై మరికొన్ని విశ్వవిద్యాలయాల స్పందనలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. ఇందుకోసం ప్రతివాది మోహన్‌రావు సహా పలు విశ్వవిద్యాలయాలకు నోటీసులు జారీచేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement