అసెంబ్లీ వద్ద స్పృహతప్పి పడిపోయిన మల్లయ్య యాదవ్
కేసీఆర్ ప్రభుత్వ బాటలోనే కాంగ్రెస్ పయనిస్తోందని సర్పంచుల ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్/నాంపల్లి: తమ పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన ప లువురు మాజీ సర్పంచులను పోలీసులు అరెస్ట్ చేశారు. సో మవారం శాసనసభ ప్రాంగణానికి చేరుకునేందుకు ప్రయ త్నించిన వారిని పోలీసులు ఎక్కడికక్కడ నిలువరించారు. తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ, ఇతర సంఘాలు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా పోలీసులకు, సర్పంచులకు మధ్య తోపులాట జరిగింది. సర్పంచులను కట్టడి చేసే క్రమంలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ వ్యవస్థాపకుడు సుర్వి యాదయ్య గౌడ్‌కు స్వల్ప గాయాలు కాగా నల్లగొండ జిల్లా పాకర్లపాడు గ్రామ మాజీ సర్పంచు కేశబోయిన మల్లయ్య యాదవ్ సృహతప్ప పడిపో యారు. జిల్లాల నుంచి హైదరాబాద్‌కు చేరుకునేందుకు ప్రయత్నించిన పలువురు మాజీ సర్పంచ్‌లను ముందుగానే అరెస్ట్‌చేశారు.
శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ప్రయత్నిస్తున్న తమను అరెస్ట్ చేయడం సరికాదని జేఏసీ చైర్మన్ సుర్వి యాదయ్య గౌడ్ పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోక పోగా, కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అదే బాటలో పయనిస్తోందని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, అక్రమ అరెస్టులు, గృహనిర్బంధాలు చేయడం హేయమైన చర్య అని సర్పంచుల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనర్సింహ్మరెడ్డి అన్నారు.


