
చిన్న వయసులోనే భారత క్రికెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)పై శ్రీలంక దిగ్గజం కుమార్ సంగక్కర (Kumar Sangakkara) ప్రశంసలు కురిపించాడు. అతడి బ్యాటింగ్ గన్‌షాట్‌లా ఉంటుందంటూ ఈ చిచ్చరపిడుగు ప్రతిభను కొనియాడాడు. కాగా బిహార్‌కు చెందిన పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశీ దేశీ క్రికెట్‌లో సత్తా చాటుతున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్తాన్ రాయల్స్ దృష్టిని ఆకర్షించిన ఈ పిల్లాడిపై.. ఈ ఏడాది మెగా వేలంలో కాసుల వర్షం కురిసింది. రాయల్స్ జట్టు ఏకంగా రూ. 1.1 కోట్లు ఖర్చు చేసి అతడిని కొనుగోలు చేసింది. ఫ్రాంఛైజీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వైభవ్ వమ్ము చేయలేదు.
38 బంతుల్లోనే శతకం
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కేవలం 38 బంతుల్లోనే శతకం సాధించి.. ఈ ఘనత సాధించిన భారత అత్యంత పిన్నవయస్కుడిగా వైభవ్ చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్‌లో మొత్తంగా ఏడు మ్యాచ్‌లు ఆడి 252 పరుగులు చేశాడు. ఇక ప్రస్తుతం భారత అండర్-19 జట్టు తరఫున ఇంగ్లండ్ గడ్డ మీదా వైభవ్ ఇరగదీస్తున్నాడు.
ఈ నేపథ్యంలో రాజస్తాన్ రాయల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ కుమార్ సంగక్కర వైభవ్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘తనొక స్పెషల్ టాలెంట్ అని వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే నిరూపించుకున్నాడు. 2023లో.. ‘ఓ ప్రత్యేకమైన ఆటగాడు ఉన్నాడు. అతడి బ్యాటింగ్ చూడాల్సిందే’ అని రాజస్తాన్ అనలిస్టులకు సందేశం వచ్చింది.
నేనైతే ఆశ్చర్యపోయా..
అప్పుడే మేమే వైభవ్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని భావించాము. తొలిసారి అతడి బ్యాటింగ్‌ను నేరుగా చూసినపుడు నేనైతే ఆశ్చర్యపోయా. వీడియోల్లో చూసినదాని కంటే ప్రత్యక్షంగా చూడటం థ్రిల్లింగ్‌గా అనిపించింది.
ఇక గువాహటిలో అనుకుంటా.. నెట్స్‌లో జోఫ్రా ఆర్చర్‌తో పాటు ఇతర సీమర్లను అతడు ఎదుర్కొన్న తీరు అమోఘం. మంచినీళ్లప్రాయంగా షాట్లు బాదేశాడు. అతడి బ్యాటింగ్ గన్‌షాట్‌లా ఉంటుంది. ప్రతీ బంతిని అతడు ఆడేందుకు ప్రయత్నిస్తాడు’’ అంటూ కుమార్ సంగక్కర ప్రశంసల వర్షం కురిపించాడు.
అదే విధంగా.. ‘‘అతడి బ్యాట్ స్వింగ్ అవుతుంటే చూడముచ్చటగా ఉంటుంది. ముఖ్యంగా వైడ్ అవుట్‌సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా ఈజీగా షాట్లు బాదేస్తాడు. క్రీజు నుంచి కదలడం కూడా అరుదే. షాట్ల ఎంపికలో కచ్చితత్వం ఉంటుంది.
టీ20 బ్యాటర్ ఆడే ప్రతీ షాట్‌ను అతడు ఆడతాడు. అయితే, ఇది ఇంకా ఆరంభం మాత్రమే. అతడు అంచెంలంచెలుగా ఎదుగుతూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నా’’ అని సంగక్కర స్కై స్పోర్ట్స్ షోలో వ్యాఖ్యానించాడు.
చదవండి: అరంగేట్రంలోనే ఆసీస్ బ్యాటర్ విధ్వంసం.. విండీస్ చిత్తు