IND vs ENG 2nd Test: వైభవ్‌ సూర్యవంశీని పిలిపించిన బీసీసీఐ! | BCCI Rushes Vaibhav Suryavanshi to Edgbaston After Heroics Against Eng U19 | Sakshi
Sakshi News home page

IND vs ENG 2nd Test: వైభవ్‌ సూర్యవంశీని పిలిపించిన బీసీసీఐ!

Jul 4 2025 12:58 PM | Updated on Jul 4 2025 1:41 PM

BCCI Rushes Vaibhav Suryavanshi to Edgbaston After Heroics Against Eng U19

ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో టీమిండియా అదరగొడుతోంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన గిల్‌ సేన.. మొదటి ఇన్నింగ్స్‌లో 587 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) భారీ ద్విశతకం (269)తో చెలరేగగా.. రవీంద్ర జడేజా (Ravindra Jadeja- 89), యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal- 87) అర్ధ శతకాలతో రాణించారు.

 510 పరుగుల ఆధిక్యం
వీరికి తోడుగా వాషింగ్టన్‌ సుందర్‌ (42) మెరుగ్గా ఆడగా కరుణ్‌ నాయర్‌ (31) కూడా ఈసారి కాస్త ఫర్వాలేదనిపించాడు. ఇక బ్యాటింగ్‌లో అదరగొట్టిన భారత్‌.. బౌలింగ్‌లోనూ రాణిస్తోంది. గురువారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి మూడు వికెట్లు తీసిన టీమిండియా.. ఇంగ్లండ్‌ను 77 పరుగులకు పరిమితం చేసింది. తద్వారా ప్రస్తుతం 510 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

అరుదైన రికార్డులు
ఇక రెండో రోజు ఆటలో హైలైట్‌ గిల్‌ డబుల్‌ సెంచరీ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎడ్జ్‌బాస్టన్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన భారత బ్యాటర్‌గా నిలవడంతో పాటు.. ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్‌గానూ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి పేరిట ఉన్న ఆల్‌టైమ్‌ రికార్డును బద్దలు కొట్టాడు.

అంతేకాదు.. SENA (సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా) దేశాల్లో టెస్టుల్లో అత్యధిక స్కోరు సాధించిన ఆసియా తొలి కెప్టెన్‌గానూ గిల్‌ చరిత్రకెక్కాడు. వీటితో పాటు మరెన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు.

ఎడ్జ్‌బాస్టన్‌ స్టేడియంలో వైభవ్‌ ప్రత్యక్షం
ఇక గిల్‌ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ను భారత క్రికెట్‌ యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ కూడా ప్రత్యక్షంగా వీక్షించాడు. ఓవైపు గిల్‌కు సంబంధించిన మరుపురాని మధుర క్షణాలను ఒడిసిపడుతూనే.. స్టాండ్స్‌లో వైభవ్‌పై కూడా కెమెరామెన్‌ ఫోకస్‌ చేశాడు. ఈ నేపథ్యంలో ఎడ్జ్‌బాస్టన్‌ స్టేడియంలో వైభవ్‌ సూర్యవంశీ మ్యాచ్‌ను వీక్షిస్తున్న ఫొటోలు వైరల్‌గా మారాయి.

కాగా ఐపీఎల్‌-2025లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున సంచలన శతకం సాధించిన వైభవ్‌ సూర్యవంశీ.. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో భారత అండర్‌-19 జట్టు తరఫునా మెరుపులు మెరిపిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో యూత్‌ వన్డేల్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

తొలి యూత్‌ వన్డేలో 19 బంతుల్లోనే 48 పరుగులతో రాణించిన వైభవ్‌.. రెండో వన్డేలో 34 బంతుల్లో 45 రన్స్‌ చేశాడు. తాజాగా మూడో వన్డేలో 31 బంతుల్లోనే 81 పరుగులతో దుమ్ములేపాడు. ఇక నాలుగో యూత్‌ వన్డే జూలై 5న జరుగనుండగా.. ఆఖరిదైన ఐదో మ్యాచ్‌ జూలై 7న జరుగనుంది.

యువ జట్టును పిలిపించిన బీసీసీఐ
ఇక నార్తాంప్టన్‌లో మూడో యూత్‌వన్డే ముగిసిన తర్వాత భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI).. ఆయుశ్‌ మాత్రే సారథ్యంలోని యువ జట్టును ఎడ్జ్‌బాస్టన్‌కు పిలిపించింది. సీనియర్ల ఆటను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పించింది. ఈ క్రమంలో గిల్‌ ఐకానిక్‌ ఇన్నింగ్స్‌ను వీక్షించిన వైభవ్‌ సూర్యవంశీ.. ‘‘మనదే ఆధిపత్యం’’ అంటూ గిల్‌ ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. 

ఇక వైభవ్‌ను ఎడ్జ్‌బాస్టన్‌ స్టేడియంలో చూసిన అభిమానులు త్వరలోనే అతడు టీమిండియాలో అరంగేట్రం చేయాలంటూ ఆకాంక్షిస్తున్నారు.

చదవండి: WCL: భార‌త జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. కెప్టెన్‌గా యువ‌రాజ్ సింగ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement