
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) సీజన్ 2 కోసం ఇండియా ఛాంపియన్స్ మెనెజ్‌మెంట్ తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా లెజెండరీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ మరోసారి ఎంపికయ్యాడు. 2024లో అరంగేట్ర ఎడిషన్‌లో యువీ సారథ్యంలోనే భారత జట్టు విజేతగా నిలిచింది.
ఇక ఈ 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో శిఖర్ ధావన్, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్, యూసుఫ్ పఠాన్ వంటి దిగ్గజాలు ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో ఇండియా జట్టు సమతుల్యంగా కన్పిస్తోంది.
పేస్ బౌలింగ్ విభాగంలో వరుణ్ ఆరోన్, సిద్ధార్థ్ కౌల్, వినయ్ కుమార్ చోటు దక్కించుకోగా.. స్పిన్ బాధ్యతలు హర్భజన్, పియూష్ చావ్లా, పవన్ నేగి నిర్వహించనున్నారు. ఇక బ్యాటింగ్ లైనప్‌లో యువీ, ధావన్, సురేష్ రైనా వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు.
తొలి పోరు పాక్‌తోనే..
ఇక డబ్ల్యూసీఎల్ సెకెండ్ సీజన్ జూలై 18 నుండి ఆగస్టు 2 వరకు ఇంగ్లండ్‌లోని నాలుగు వేదికలలో జరగనుంది. ఎడ్జ్‌బాస్టన్ (బర్మింగ్‌హామ్), కౌంటీ గ్రౌండ్ (నార్తాంప్టన్), గ్రేస్ రోడ్ (లీసెస్టర్), హెడింగ్లీ (లీడ్స్) మైదానాలు ఈ మెగా టోర్నీకి ఆతిథ్యమివ్వనున్నాయి.
ఈ టోర్నీలో భారత్, ఇంగ్లండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మొత్తం ఆరు జట్లు పాల్గోనున్నాయి. ఈ మెగా ఈవెంట్ రౌండ్-రాబిన్ లీగ్ ఫార్మాట్‌లో జరగనుంది. పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్దానాల్లో నిలిచే జట్లు సెమీ-ఫైనల్స్‌కు చేరుకుంటాయి. ఇక ఇండియా ఛాంపియన్స్ తమ తొలి మ్యాచ్‌లో జూలై 20న పాకిస్తాన్‌తో తలపడనుంది.
ఇండియా ఛాంపియన్స్ జట్టు
యువరాజ్ సింగ్ (కెప్టెన్), శిఖర్ ధావన్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, హర్భజన్ సింగ్, పీయూష్ చావ్లా, స్టువర్ట్ బిన్నీ, గురుకీరత్ మాన్, వినయ్ కుమార్, సిద్దార్థ్ కౌల్, వరుణ్ ఆరోన్, అభిమన్యు మిథున్, పవన్ నేగి మిథున్