
వైభవ్ సూర్యవంశీ (పాత ఫొటో)
ఇంగ్లండ్ గడ్డ మీద ఇరగదీస్తున్న భారత అండర్-19 క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఖాతాలో మరో ప్రపంచ రికార్డు చేరింది. యూత్ టెస్టు మ్యాచ్‌లో వికెట్ తీయడంతో పాటు.. అర్ధ శతకం సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా ఈ చిచ్చరపిడుగు చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ అండర్-19 జట్టు (IND U19 Vs ENG U19)తో జరిగిన తొలి యూత్ టెస్టు సందర్భంగా సాధించిన ఈ ఘనత గురించి నెట్టింట చర్చ జరుగుతోంది.
వన్డేలలో విధ్వంసకర శతకం
ఇంగ్లండ్ యువ జట్టుతో ఐదు యూత్ వన్డేలు (Youth ODI's), రెండు యూత్ టెస్టులు ఆడేందుకు భారత అండర్-19 క్రికెట్ జట్టు అక్కడికి వెళ్లిన విషయం తెలిసిందే. ఇక ఈ టూర్‌లో ఆది నుంచి వైభవ్ సూర్యవంశీ తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉన్నాడు. యూత్ వన్డే సిరీస్‌ను భారత్ 3-2తో గెలుచుకోవడంలో పద్నాలుగేళ్ల ఈ పిల్లాడిది కీలక పాత్ర.
ఆరంభంలో నిరాశపరిచినా..
ఐదు వన్డేల్లో ఐదు సాధించిన స్కోర్లు వరుసగా.. 48 (19), 45 (34), 86 (31), 143 (78), 33 (42). నాలుగో యూత్ వన్డేలో 52 బంతుల్లోనే శతకం బాది.. ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా చరిత్రకెక్కాడు. అనంతరం ఇంగ్లండ్‌తో తొలి యూత్ టెస్టు (జూలై 12- 15)లో మాత్రం వైభవ్ ఆరంభంలో నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఈ ఓపెనింగ్ బ్యాటర్ 13 బంతులు ఎదుర్కొని కేవలం 14 పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు.
రెండు వికెట్లు, ఓ అర్ధ శతకం
అయితే, బ్యాట్‌తో విఫలమైనా వైభవ్ ఇక్కడ బంతితో రాణించాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ హంజా షేక్ (84), వికెట్ కీపర్ బ్యాటర్ థామస్ రూ (34) రూపంలో రెండు కీలక వికెట్లు పడగొట్టాడు ఈ పార్ట్‌టైమ్ స్పిన్నర్.
ఇక భారత రెండో ఇన్నింగ్స్‌లో వైభవ్ బ్యాట్ ఝులిపించాడు. 44 బంతులు ఎదుర్కొని తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 56 పరుగులు సాధించాడు. తద్వారా ఇంగ్లండ్‌తో తొలి యూత్ టెస్టులో రెండు వికెట్లు తీయడంతో పాటు అర్ధ శతకం నమోదు చేశాడు.
ఈ నేపథ్యంలోనే అత్యంత పిన్న వయసులో ఒక యూత్ టెస్టులో వికెట్ తీయడంతో పాటు హాఫ్ సెంచరీ సాధించిన క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ చరిత్రకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు బంగ్లాదేశ్‌కు చెందిన మెహదీ హసన్ మిరాజ్ పేరిట ఉండేది. కాగా ఇంగ్లండ్- భారత్ మధ్య తొలి యూత్ టెస్టు ‘డ్రా’ గా ముగిసింది.
అత్యంత చిన్న వయసులో ఒక యూత్ టెస్టులో వికెట్ తీయడంతో పాటు 50 స్కోరు చేసిన క్రికెటర్లు వీరే
🏏వైభవ్ సూర్యవంశీ (ఇండియా): 14 ఏళ్ల, 107 రోజుల వయసులో- బెకెన్‌హామ్ వేదికగా ఇంగ్లండ్ మీద
🏏మెహదీ హసన్ మిరాజ్ (బంగ్లాదేశ్): 15 ఏళ్ల 167 రోజుల వయసులో- మిర్పూర్ వేదికగా శ్రీలంక మీద
🏏షైకత్ అలీ (బంగ్లాదేశ్): 15 ఏళ్ల 204 రోజుల వయసులో- సైలెట్ వేదికగా ఇంగ్లండ్ మీద
🏏నాసిర్ హుసేన్ (బంగ్లాదేశ్): 15 ఏళ్ల 219 రోజుల వయసులో డెర్బీ వేదికగా శ్రీలంక మీద
🏏సురేశ్ రైనా (ఇండియా): 15 ఏళ్ల 242 ఏళ్ల వయసులో- కొలంబో వేదికగా ఇంగ్లండ్ మీద.
చదవండి: అత్యధికసార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’లు అందుకుంది వీరే