
టీమిండియా- ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య టెస్టు సిరీస్.. క్రికెట్ ప్రేమికులకు అసలు సిసలైన సంప్రదాయ ఫార్మాట్ మజాను అందిస్తోంది. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)లో భాగంగా ఇరుజట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికి మూడు పూర్తయ్యాయి.
అయితే, ఈ మూడు టెస్టులు ఆఖరిదైన ఐదో రోజు వరకు ఉత్కంఠగా సాగడం ఒక విశేషమైతే.. అన్నింటిలోనూ ఫలితం కూడా తేలడం మరో విశేషం. లీడ్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ మ్యాచ్‌ను టీమిండియా నుంచి లాగేసుకుని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
ఇక ఎడ్జ్‌బాస్టన్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన టీమిండియా సారథి శుబ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ (269), సెంచరీ (161)లతో అదరగొట్టి.. భారత్‌కు ఏకపక్ష విజయం అందించాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో తొలిసారి టీమిండియా గెలుపు జెండా ఎగరవేయడంలో కీలక పాత్ర పోషించి ఈ అవార్డు అందుకున్నాడు.
అయితే, లార్డ్స్ టెస్టులో మాత్రం ఆతిథ్య జట్టు మరోసారి పైచేయి సాధించింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇటు బ్యాట్‌తో.. అటు బంతితో రాణించి.. జట్టును గెలిపించుకున్నాడు. తద్వారా 2-1తో ఆధిక్యంలో నిలిపాడు. ఇలా మూడు టెస్టుల్లో ఒక్కొక్కరు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు.
మరి టెస్టు ఫార్మాట్లో అత్యధికసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న క్రికెటర్ల జాబితాలో టాప్-5లో ఉన్నది ఎవరో తెలుసా?!.. సంప్రదాయ క్రికెట్‌లో అత్యధిక పరుగుల వీరుడి (15921)గా ఉన్న టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ మాత్రం ఈ జాబితాలో లేకపోవడం గమనార్హం.
జాక్వెస్ కలిస్
సౌతాఫ్రికా లెజెండరీ ఆల్‌రౌండర్ జాక్వెస్ కలిస్ టెస్టుల్లో అత్యధికంగా 23 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. తన కెరీర్‌లో 166 టెస్టు మ్యాచ్‌లు ఆడిన కలిస్.. 13289 పరుగులు చేశాడు. ఇందులో 45 శతకాలు, రెండు డబుల్ సెంచరీలు ఉన్నాయి.
ముత్తయ్య మురళీధరన్
శ్రీలంక స్పిన్ దిగ్గజం టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్ల వీరుడు (800). అతడు తన కెరీర్‌లో 133 టెస్టులాడి 19 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.
వసీం అక్రం
పాకిస్తాన్ ఐకానిక్ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ తన కెరీర్‌లో 104 టెస్టులు ఆడి.. 414 వికెట్లు కూల్చాడు. తన నిలకడైన బౌలింగ్‌తో ఈ స్వింగ్ సుల్తాన్ పదిహేడు సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
షేన్ వార్న్
ఆస్ట్రేలియా స్పిన్ లెజెండ్ షేర్ వార్న్. అంతర్జాతీయ క్రికెట్‌లో 145 టెస్టులు ఆడిన వార్న్.. 708 వికెట్లు పడగొట్టాడు. అతడి ఖాతాలోనూ పదిహేడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు ఉన్నాయి.
కుమార్ సంగక్కర
శ్రీలంక మాజీ కెప్టెన్, స్టైలిస్ లెఫ్టాండ్ బ్యాటర్ కుమార్ సంగక్కర తన కెరీర్‌లో 134 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. నిలకడైన ప్రదర్శనలతో శ్రీలంక బ్యాటింగ్ లైనప్ ప్రధాన పిల్లర్‌గా పేరొందిన సంగక్కర పదహారు సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. సంగక్కర టెస్టుల్లో 38 సెంచరీలు, 11 డబుల్ సెంచరీల సాయంతో 12400 పరుగులు సాధించాడు. అ న్న ట్లు చెప్పనే లేదు కదూ! సచిన్ తన కెరీర్‌లో పద్నాలుగు సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు.