
వెస్టిండీస్‌తో తొలి టీ20 (WI vs AUS)లో ఆస్ట్రేలియా జయభేరి మోగించింది. జమైకా వేదికగా సోమవారం నాటి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టును మూడు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. కాగా మూడు టెస్టులు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడే నిమిత్తం ఆస్ట్రేలియా జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది.
హోప్, చేజ్ హాఫ్ సెంచరీలు
టెస్టు సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన కంగారూలు.. టీ20 సిరీస్‌లోనూ శుభారంభం చేశారు. సబీనా పార్కులో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన విండీస్ ఆదిలోనే ఓపెనర్ బ్రాండన్ కింగ్ (18) వికెట్ కోల్పోయింది.
అయితే, మరో ఓపెనర్, కెప్టెన్ షాయీ హోప్ (39 బంతుల్లో 55), వన్‌డౌన్ బ్యాటర్ రోస్టన్ చేజ్ (60) అర్ధ శతకాలతో రాణించారు. షిమ్రన్ హెట్‌మెయిర్ (19 బంతుల్లో 38) తనదైన శైలిలో ధనాధన్ దంచికొట్టగా.. మిగతా వారంతా విఫలమయ్యారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో వెస్టిండీస్ ఎనిమిది వికట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.
5️⃣0️⃣ for Roston in some style!🏏💥#WIvAUS | #fullahenergy pic.twitter.com/J9JygS3XcC
— Windies Cricket (@windiescricket) July 21, 2025
ఆసీస్ బౌలర్లలో డ్వార్షుయిస్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. సీన్ అబాట్, కూపర్ కన్నోలి, నాథన్ ఎల్లిస్, అరంగేట్ర ప్లేయర్ మిచెల్ ఓవెన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన మార్ష్ బృందం 18.5 ఓవర్లలోనే పనిపూర్తి చేసింది.
గ్రీన్, మిచ్ మెరుపు హాఫ్ సెంచరీలు
కెప్టెన్ మిచెల్ మార్ష్ (24) ఫర్వాలేదనిపించగా.. మరో ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెగర్క్ (2), వన్‌డౌన్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ (18) నిరాశపరిచారు. గ్లెన్ మాక్స్‌వెల్ (11) సైతం విఫలం కాగా.. కామెరాన్ గ్రీన్, మిచెల్ ఓవెన్ మెరుపు అర్ధ శతకాలతో చెలరేగారు.
గ్రీన్ 26 బంతుల్లో రెండు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 51 పరుగులు చేయగా.. మిచెల్ ఓవెన్ 27 బంతుల్లో ఆరు సిక్సర్లు బాది 50 పరుగులు సాధించాడు.
మిగతా వారిలో కూపర్ కన్నోలి 13 పరుగులు చేయగా.. డ్వార్షుయిస్ (5), సీన్ అబాట్ (5) అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. 18.5 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 190 పరుగులు చేసిన ఆస్ట్రేలియా.. విండీస్‌పై మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది.
పంజాబ్ కింగ్స్‌ప్లేయర్‌గా
కాగా ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్‌కు ఆడిన మిచెల్ ఓవెన్.. విండీస్‌తో తొలి టీ20 ద్వారా ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అరంగేట్రంలోనే ఈ 23 ఏళ్ల బ్యాటింగ్ ఆల్‌రౌండర్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకోవడం విశేషం. అంతేకాదు.. ఆసీస్ తరఫున అంతర్జాతీయ టీ20లలో ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా మిచ్ నిలిచాడు.
చదవండి: నితీశ్ రెడ్డి అవుట్!