
గాయంతో టెస్టు సిరీస్‌కు దూరం
కోలుకోని ఆకాశ్‌దీప్, అర్ష్ దీప్
భారత జట్టులో అన్షుల్ కంబోజ్
మాంచెస్టర్: ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టుకు ముందు భారత జట్టుకు గాయాల సమస్య ఎదురైంది. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నితీశ్ కుమార్ రెడ్డి మోకాలి గాయంతో సిరీస్‌కు దూరమయ్యాడు. ఆదివారం జిమ్‌లో ట్రైనింగ్ చేస్తుండగా అతను గాయపడ్డాడు. పరీక్షల అనంతరం అతని గాయం తీవ్రత తెలిసింది. సిరీస్‌లో రెండో, మూడో టెస్టు ఆడిన నితీశ్ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాడు. లార్డ్స్ టెస్టులో 3 వికెట్లు తీయడంతో పాటు మొత్తం 43 పరుగులు చేశాడు.
తొలి టెస్టులో శార్దుల్ ఠాకూర్ బరిలోకి దిగగా, అతని వైఫల్యంతో అదే తరహా ఆల్‌రౌండర్ అయిన నితీశ్‌కు అవకాశం దక్కింది. ఇప్పుడు టీమ్ మేనేజ్‌మెంట్ ఇదే కూర్పుతో తుది జట్టును ఎంపిక చేస్తే మళ్లీ శార్దుల్ ఆడే అవకాశం ఉంది. మరోవైపు పేసర్లు ఆకాశ్‌దీప్, అర్ష్ దీప్ సింగ్ కూడా గాయాలతో మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. ఆకాశ్‌దీప్ తొడ కండరాల గాయంతో బాధపడుతుండగా, అర్ష్ దీప్ ఎడమ చేతికి గాయమైంది.
రెండో టెస్టులో 10 వికెట్లతో భారత్ ఘన విజయంలో కీలక పాత్ర పోషించిన ఆకాశ్‌దీప్ లార్డ్స్ టెస్టులో విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో లయను అందుకోలేక ఇబ్బంది పడిన అతను నాలుగో రోజు మధ్యాహ్నమే చికిత్స కోసం మైదానం వీడాడు. బెకెన్‌హామ్‌లో జట్టు ప్రాక్టీస్‌లో పాల్గొన్నప్పుడు ఆకాశ్‌దీప్ అసలు బౌలింగ్‌కే దిగలేదు. మరోవైపు ఇంకా అరంగేట్రం చేయని అర్ష్ దీప్ సింగ్ నాలుగో టెస్టుకు దూరం కానున్నాడు.
ఆకాశ్‌దీప్ ఆడకపోతే అతని స్థానంలో అర్ష్ దీప్ బరిలోకి దిగేవాడు. అయితే అతను కూడా అనూహ్యంగా గాయపడ్డాడు. ప్రాక్టీస్ సెషన్‌లో బౌలింగ్ చేస్తున్న సమయంలో సాయి సుదర్శన్ కొట్టిన షాట్‌ను ఫాలో త్రూలో ఆపే ప్రయత్నంలో అతని ఎడమ చేతికి గట్టి దెబ్బ తగిలింది. లెఫ్టార్మ్ పేసర్ అయిన అర్ష్ దీప్ ఆపై చేతికి కట్టుతో వెనుదిరిగాడు. అతని చేతికి కుట్లు వేసినట్లు సమాచారం.
ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు...
ప్రధాన బౌలర్లు గాయాలబారిన పడటంతో ముందు జాగ్రత్తగా సెలక్టర్లు పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అన్షుల్ కంబోజ్‌ను జట్టులోకి ఎంపిక చేశారు. ఈ సిరీస్‌కు ముందు అన్షుల్ భారత్ ‘ఎ’ జట్టు తరఫున రెండు అనధికారిక టెస్టులు ఆడాడు. నార్తాంప్టన్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో 4 వికెట్లు తీసిన అతను రెండో ఇన్నింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 51 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
హరియాణాకు చెందిన అన్షుల్ 24 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 79 వికెట్లు తీసి 486 పరుగులు చేశాడు. గత రంజీ ట్రోఫీలో సీజన్‌లో కేరళతో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్ పది వికెట్లు (10/49) పడగొట్టి సంచలనం సృష్టించిన అతను...రంజీల్లో ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా నిలిచాడు.