ఫైనల్లో న్యూజిలాండ్‌ చిత్తు.. విశ్వవిజేతగా భారత్‌ | India Defeats New Zealand to Clinch T20 World Cup 2026 Title | Sakshi
Sakshi News home page

T20 World Cup 2026: ఫైనల్లో కివీస్ చిత్తు.. విశ్వవిజేతగా భారత్‌

Mar 8 2026 10:43 PM | Updated on Mar 8 2026 11:11 PM

India Defeats New Zealand to Clinch T20 World Cup 2026 Title

అహ్మదాబాద్‌లో భారత పురుషల క్రికెట్ జట్టు అద్భుతం చేసింది. రెండున్నరేళ్ల కిందట ఎక్కడైతే అభిమానులకు గుండె కోత మిగిల్చిందో.. ఇప్పుడు అదే వేదికలో చరిత్రను తిరగరాసింది. టీ20 వరల్డ్‌కప్‌-2026 విజేతగా టీమిండియా అవతరించింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత జట్టు.. ముచ్చటగా మూడోసారి టైటిల్‌ను ముద్దాడింది.

తద్వారా అత్యధిక సార్లు టీ20 ప్రపంచకప్ టైటిల్‌ గెలిచిన జట్టుగా మెన్ బ్లూ నిలిచింది. అంతేకాకుండా వరుసగా రెండోసారి పొట్టి ప్రపంచకప్‌ గెలిచిన జట్టు కూడా టీమిండియానే కావడం విశేషం. భారత్‌ 2007,2024లో విశ్వవిజేతలగా నిలవగా.. ఇప్పుడు సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యంలో మరోసారి కప్‌ కొట్టి సత్తాచాటింది. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి.

దంచి కొట్టిన భారత బ్యాటర్లు
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ తొలుత భారత్‌ను బ్యాటింగ్‌కు అహ్హనించాడు. అయితే శాంట్నర్ తీసుకున్న నిర్ణయం మిస్ ఫైర్ అయింది. భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. సంజూ శాంసన్‌(46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 89), అభిషేక్‌ శర్మ(52), ఇషాన్‌ కిషన్‌(54) హాఫ్‌ సెంచరీలతో సత్తాచాటారు. ఆఖరిలో శివమ్‌ దూబే(8 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 26) మెరుపులు మెరిపించాడు.

సంజూ, అభిషేక్ తొలి వికెట్‌కు 98 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యాన్ని అందించారు. ఓ దశలో భారత్ 300 పరుగుల మార్క్ అందుకునేలా కన్పించింది. కానీ మిడిల్ ఓవర్లలో వికెట్లు కోల్పోవడంతో నిర్ణీత ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది.

బుమ్ బుమ్ బుమ్రా..
అనంతరం 256 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక కివీస్ చతికల పడింది. 19 ఓవర్లలో 159 పరుగులకు న్యూజిలాండ్ కుప్పకూలింది. భారత బౌలర్లలో పేస్ గుర్రం జస్ప్రీత్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. బుమ్రా తన 4 ఓవర్ల కోటాలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు అక్షర్ పటేల్ మూడు, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మ తలా వికెట్ సాధించారు. కివీస్ బ్యాటర్లలో సీఫర్ట్ (52) టాప్ స్కోరర్ నిలిచాడు. బుమ్రా ప్లేయ‌ర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిల‌వ‌గా.. సంజూ శాంస‌న్‌కు ప్లేయ‌ర్ ఆఫ్‌ది టోర్నీ అవార్డు ల‌భించింది.
 



 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement