breaking news
pwl
-
సవాళ్లకు సిద్ధం
భారత చాంపియన్ రెజ్లర్ అంతిమ్ పంఘాల్ గురువారం మొదలయ్యే ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్) సవాళ్లకు సిద్ధమని ప్రకటించింది. కొరకరాని విదేశీ రెజ్లర్లపై ఎప్పటి నుంచో దృష్టి సారించినట్లు చెప్పింది. మన రెజ్లర్లకు జాతీయ శిబిరాలు మెలకువలు నేర్పిస్తే... విదేశాల్లో శిక్షణ విదేశీ రెజ్లర్లను దీటుగా ఎదుర్కొనే స్థయిర్యాన్నిస్తుందని చెప్పుకొచ్చింది. న్యూఢిల్లీ: రోజుల వ్యవధిలోనే మొదలయ్యే పీడబ్ల్యూఎల్ కోసం పక్కా ప్రణాళికలతో బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యానని భారత స్టార్ మహిళా రెజ్లర్ అంతిమ్ పంఘాల్ తెలిపింది. 53 కేజీల కేటగిరీలో జూనియర్, సీనియర్ అంతర్జాతీయ స్థాయిల్లో ఇదివరకే నిరూపించుకున్న అంతిమ్ ఇప్పుడు కొత్త తరహా లీగ్ ‘పట్టు’కు సై అంటోంది. 17 ఏళ్ల వయసులోనే 2022లో అండర్–20 ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఆమె ఆ మరుసటి ఏడాది టైటిల్ నిలబెట్టుకుంది. ప్రపంచ ఛాంపియన్షిప్ లో రెండు కాంస్యాలు నెగ్గిన ఆమె.. 2022 ఆసియా క్రీడల్లోనూ కాంస్య పతకంతో మెరిసింది. 21 ఏళ్ల ఈ స్టార్ రెజ్లర్ తనకు ఎదురయ్యే మింగుడు పడని విదేశీ రెజ్లర్లపై ఓ కన్నేసినట్లు చెప్పింది. జపాన్ దిగ్గజ రెజ్లర్ యుయ్ సుసాకి పోటీల వీడియోలను ఫోన్లో తరచూ చూస్తానని చెప్పుకొచ్చింది. తన కెరీర్లోనే ఓటమి ఎరుగని సుసాకిపై పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇలా మేటి రెజ్లర్లను ఓడించే సత్తా మనకుందని 2023లో కేంద్ర ప్రభుత్వం నుంచి ‘అర్జున అవార్డు’ అందుకున్న అంతిమ్ చెప్పుకొచ్చింది. బౌట్‌కు ముందు ఎన్నో ఆలోచనలు చుట్టూ తిరుగుతూనే ఉంటాయని, అయితే బౌట్ కోసం మ్యాట్ మీదిగి దిగగానే మైండ్ ఒక్కసారిగా ‘పోరాటం’పైనే పడుతుందని, దీంతో... గెలుపోటముల ఆలోచనేది గుర్తుకురాదని, వంద శాతం కుస్తీపట్టడం గురించే ఆలోచిస్తానని అంతిమ్ వివరించింది. ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్) ఈ నెల 15 నుంచి నోయిడా ఇండోర్ స్టేడియంలో జరుగుతుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తన మనోభావాలను ఇలా పంచుకుంది. అర కోటి... అస్సలు ఊహించలేదు! ‘పీడబ్ల్యూఎల్ వేలంలో ఈ స్థాయి మొత్తం లభిస్తుందని అస్సలు ఊహించనేలేదు. నేనే కాదు... మా కుటుంబసభ్యులెవరూ ఇంత మొత్తం వస్తుందని అనుకోలేదు. నిజానికి నాకు సుమారు రూ. 30 లక్షలకు అటు ఇటుగా వస్తుందనే ఆశించాను. పెరిగినా దీనికి కాస్తే ఎక్కువ రావొచ్చని అనుకున్నా! కానీ ఏకంగా రూ. 50 లక్షలు దక్కుతాయని ఏమాత్రం ఊహించలేదు. వేలం జరుగుతుండగా నేను ఆలయానికి వెళ్లాను. యూపీ డామినేటర్స్ నన్ను అంత మొత్తానికి కొనుగోలు చేసిందని తెలియగానే దేవుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపాను. హరియాణాకు చెందిన నేను కెరీర్ అసాంతం ఈ రాష్ట్రానికే ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఎందుకనో ఈ లీగ్‌లో మాత్రం యూపీ తరఫునే ఆడాలని గట్టిగా అనుకున్నా’. మరింత పట్టుదలతో... ‘సీనియర్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ మరింత పట్టుదలతో, రెట్టించిన ఉత్సాహంతో పునరాగమనం చేస్తుంది. ఆమె రిటైర్మెంట్ను పక్కనబెట్టడం శుభపరిణామం. నాకంటే ఆమె ఎంతో అనుభవజ్ఞురాలైన రెజ్లర్. ఆమె వస్తుందంటేనే చెమటోడ్చేందుకు సిద్ధమైందని అర్థం. ఏ ప్లేయర్ అయినా సరే పోరాడేతత్వం, మనోధైర్యం బలంగా ఉంటేనే పునరాగమనం చేస్తారు. మన వినేశ్ కూడా అంతే! ఇక నేను పోటీపడే 53 కేజీల కేటగిరీ నాకు మాత్రమే సొంతం కాదు. ఎవరైనా పోటీపడొచ్చు. ఏ కేటగిరీ సరైందో పోటీ పడే అథ్లెట్‌కే బాగా తెలుస్తుంది. అందులో ఎంతగా కష్టపడగలదో, ఏ రకంగా గెలుస్తుందో, దేనివల్ల ఓడిపోతోందో ఆ విభాగానికి చెందిన అథ్లెట్‌కే బాగా తెలుస్తుంది’. సీనియర్ స్థాయికి ఎదగగానే... ‘జూనియర్ నుంచి సీనియర్ స్థాయి పోటీల్లో బరిలోకి దిగుతుంటే మన పరిణతి కూడా పెరుగుతుంది. జూనియర్స్‌లో ఒకట్రెండు పాయింట్లు ఓడితే నిరాశ ఆవహించేది. కానీ ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకోగలుగుతున్నా. ఒకట్రెండు పాయింట్లు కాదు... ఆడాల్సింది ఆరు నిమిషాలు. ఒకటి అర కోల్పోయినా ప్రత్యర్థి పట్టుపట్టేందుకు, పైచేయి సాధించేందుకు మన చేతిలో సమయమైతే ఉంటుంది. ఇప్పుడు నా ట్రెయినింగ్ కూడా మారింది. అంతేకాదు... మళ్లీ నేను కోచ్ సియరామ్ దహియాతో శిక్షణ తీసుకోవడం నన్ను మరింత మెరుగుపరిచింది. దహియా మార్గదర్శకంలో అనవసర ఒత్తిడి తగ్గించుకొని త్వరితగతిన పుంజుకోవడంపై ఎక్కువగా దృష్టి సారించాను. అదేపనిగా లేదంటే మితిమీరిన శిక్షణ కూడా తగదని కోచ్‌లు వారిస్తారు. మ్యాట్‌పై ఎప్పుడు కుస్తీ పట్టాలో... వద్దో మేము, కోచ్, ఫిజియో కలిసి నిర్ణయించుకుంటాం. అనుకూల వాతావరణాన్ని సృష్టించుకుంటాం’. విదేశీ శిక్షణ కీలకం ‘జాతీయ శిబిరాలు రెజ్లర్లను దీటుగా సన్నద్ధపరుస్తున్నాయి. అలాగని విదేశాల్లో శిక్షణ అనవసరం అనుకుంటే పొరపాటు. అది కూడా రెజ్లర్లకు కీలకమైన వేదిక. మేమంతా కూడా సహచరులతో కుస్తీ పట్టడం ద్వారానే నేర్చుకున్నాం. అంటే మా మధ్య ఎలాంటి పోటీ ఉంటుందో, ఎవరి సత్తా ఎంటో మాకు బాగా తెలుసు. జాతీయ శిబిరాల్లో ఇదే జరుగుతుంది. కానీ విదేశీ రెజ్లర్లు మాలానే ఉంటారని అనుకోలేం. వారిలో వేగం ఎక్కువ. అలాంటి వారితో అడపాదడపా విదేశాల్లో శిక్షణ ఏర్పాటు చేస్తే ఈ అనుభవం అంతర్జాతీయ పోటీలకు బాగా ఉపయోగపడుతుంది’. -
అమన్, అంతిమ్‌పై నజర్
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్లు అమన్ సెహ్రావత్, అంతిమ్ పంఘల్... ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్) వేలంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. అమన్ పురుషుల విభాగంలో రూ. 18 లక్షల ప్రాథమిక ధరతో వేలంలోకి రానుండగా... మహిళల విభాగంలో అంతిమ్ రూ. 10 లక్షలు ‘బేస్ ప్రైస్’గా నిర్ణయించుకుంది. ఈ నెల 15 నుంచి ఈ లీగ్ ప్రారంభం కానుండగా... శనివారం వేలం నిర్వహించనున్నారు. ఈ లీగ్‌లో మొత్తం ఆరు ఫ్రాంచైజీలు హరియాణ థండర్స్, టైగర్స్ ఆఫ్ ముంబై దంగల్స్, పంజాబ్ రాయల్స్, మహారాష్ట్ర కేసరి, ఢిల్లీ దంగల్ వారియర్స్, యూపీ డామినేటర్స్ పాల్గొంటున్నాయి. పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, 21 ఏళ్ల అమన్ సెహ్రావత్ అత్యధిక ప్రాథమిక ధరతో వేలంలో అందుబాటులో ఉండగా... కామన్వెల్త్ గేమ్స్ పతక విజేత దీపక్ పూనియా, నవీన్ రూ. 10 లక్షల ‘బేస్ ప్రైస్’తో వేలంలోకి రానున్నారు. అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న సుజీత్ కల్కల్ తన ప్రాథమిక ధరను రూ. 7 లక్షలుగా నిర్ణయించుకున్నాడు. విదేశీ రెజ్లర్ల కేటగిరీల్లో రష్యాకు చెందిన ప్రపంచ మాజీ చాంపియన్ మగోమ్డోవ్తో పాటు అర్మాన్ (అర్మెనియా), ఇస్మాయిల్ (హంగేరీ), అర్సెన్ (అర్మేనియా), ఉస్మానోవ్ అహ్మద్ (రష్యా) రూ. 10 లక్షల ప్రాథమిక ధరతో వేలంలోకి రానున్నారు. మహిళల విభాగంలో భారత స్టార్ అంతిమ్ పంఘల్ రూ. 10 లక్షల ‘బేస్ ప్రైస్’తో వేలంలోకి రానుంది. -
ఫైనల్లో ముంబై గరుడ
► సెమీస్‌లో బెంగళూరుపై విజయం ప్రొ రెజ్లింగ్ లీగ్ న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యుఎల్)లో ముంబై గరుడ అప్రతిహతంగా దూసుకెళుతోంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో బెంగళూరు యోధాస్‌ను 5-2తో ఓడించిన ముంబై ఫైనల్లోకి ప్రవేశించింది. ఇప్పటిదాకా ముంబై ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఒక్క ఓటమి కూడా లేకపోవడం విశేషం. పురుషుల 97కేజీ విభాగంలో జరిగిన తొలి బౌట్లో ఒడికడ్జ్ ఎలిజబెర్ 7-2తో పావ్లో ఒలియనిక్ను ఓడించి ముంబైకి తొలి విజయాన్ని అందించాడు. ఆ తర్వాత మహిళల 48కేజీలో రితూ ఫోగట్ అనూహ్యంగా పోరాడింది. 2013 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన అలీసా లాంప్ (బెంగళూరు)పై తొలి రౌండ్లో 0-4తో వెనుకబడింది. ఈ దశలో కోచ్ వ్యూహం ప్రకారం ముందుకెళ్లిన రితూ ప్రత్యర్థిని అలసిపోయేలా చేసింది. ఆ తర్వాత పుంజుకుని 8-4తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. బౌట్ పూర్తయ్యేసరికి 10-4 తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. పురుషుల 125కేజీలో గియోర్గి సకన్డెలిడ్జ్ 7-4తో డావిట్ను ఓడించి గరుడ ఆధిక్యాన్ని 3-0కు పెంచాడు. మహిళల 53కేజీలో ఒడునాయో అడెకురోయ్ 10-0తో లలితా షెరావత్‌ను చిత్తుగా ఓడించడంతో ముంబై ఫైనల్‌కు చేరడం ఖాయమైంది. చివరి మూడు బౌట్లలో బెంగళూరు ఐకాన్ రెజ్లర్ నర్సింగ్ యాదవ్ (74కేజీ) 7-0తో ప్రదీప్‌పై ఓదార్పు విజయాన్ని సాధించాడు. ముంబై ఐకాన్ రెజ్లర్ అడెలిన్ గ్రే కేవలం 45 సెకన్లలోనే 6-0తో నవజ్యోత్ కౌర్‌ను చిత్తు చేయగా చివరి బౌట్లో బజరంగ్ పూనియా 10-4తో అమిత్ ధన్కర్ను ఓడించి బెంగళూరుకు రెండో విజయాన్ని అందించింది. నేడు జరిగే రెండో సెమీస్‌లో పంజాబ్, హరియాణా తలపడతాయి. ఈ మ్యాచ్ విజేత ఫైనల్లో ముంబై గరుడతో ఆడుతుంది. -
హరియాణా హ్యామర్స్ శుభారంభం
న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్ లీగ్‌లో హరియాణా హ్యామర్స్ జట్టు తొలి మ్యాచ్‌లోనే నెగ్గి శుభారంభం చేసింది. శనివారం ఢిల్లీ వీర్స్తో జరిగిన పోరులో 5-2తో నెగ్గింది. గాయం కారణంగా చాలా కాలం ఆటకు దూరంగా ఉన్న స్టార్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ 65 కేజీ విభాగంలో నవ్రుజోవ్ ఇక్తియార్పై 3-2తో నెగ్గాడు. రెండో రౌండ్లో ఫిట్నెస్ పరంగా కాస్త ఇబ్బంది పడినా తుదకు విజేతగా నిలిచాడు. అంతకుముందు తొలి బౌట్లో ఒలింపిక్ కాంస్య పతక విజేత లివాన్ లోపెజ్ (హరియాణా) 74 కేజీ విభాగంలో 7-0తో దినేశ్‌ను చిత్తు చేశాడు. ఢిల్లీ వీర్ తరఫున గుర్పాల్ సింగ్ (97 కేజీలు) 11-0తో యూరీ మెయిర్‌ను ఓడించి స్కోరును 1-1తో సమం చేశాడు. మహిళల 58 కేజీల్లో ప్రపంచ నంబర్‌వన్ ఒక్సానా హెర్హెల్ 6-1తో ఎలిఫ్ జాలేను ఓడించి హరియాణా కు ఆధిక్యం అందించింది. పురుషుల 125 కేజీల్లో హితేందర్ (హరియాణా) 7-4తో క్రిషన్ కుమార్‌పై గెలుపొందగా... మహిళల 69 కేజీల్లో గీతికా (హరియాణా) వరుసగా రెండు పాయింట్లు సాధించి 2-2తో నిక్కీని ఓడించింది. 48 కేజీల్లో వినేశ్ 10-0తో నిర్మలా దేవి (హరియాణా)పై గెలిచింది.


