ఢిల్లీలో జరిగే నిరసనలో పాల్గొనవద్దని నోటీసులు ఇస్తున్నారు: దీప్కే
ఛత్రపతి శంభాజీనగర్: తమ పోరాటాన్ని అణచివేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం కుట్రలు సాగిస్తోందని కాక్రోచ్ జనతా పార్టి(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆరోపించారు. ఈ నెల 10న ఢిల్లీలో జరగనున్న నిరసన ప్రదర్శనలో పాల్గొనవద్దని ఆదేశిస్తూ మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో పోలీసులు తమ కార్యకర్తలకు నోటీసులు పంపిస్తున్నారని మండిపడ్డారు. అధికార బలంతో ఒత్తిడి తమపై తెస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ‘యోగి ఆదిత్యనాథ్ 2.0’గా మారడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారో చెప్పాలని నిలదీశారు. దీప్కే మంగళవారం ఛత్రపతి శంభాజీనగర్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని నియంతృత్వ చర్యగా అభివర్ణించారు.
రాజకీయ ఆకాంక్షల కోసం పోలీసు శాఖను దుర్వినియోగం చేయడం తగదని సీఎం ఫడ్నవీస్‌కు సూచించారు. బీజేపీ చెబుతున్న ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’వెనుక పెద్ద కుట్ర ఉందని విమర్శించారు. ఇది కేవలం నినాదం మాత్రమేనని, బీజేపీ అసలు లక్ష్యం ‘ఒకే దేశం, ఒకే రాజకీయ పార్టీ’అని దుయ్యబట్టారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియతోపాటు ఎన్నికల సంఘం పనితీరు పట్ల తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ నెల 10వ తేదీ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద భారీ నిరసన చేపట్టనున్నట్లు సీజేపీ ఇప్పటికే ప్రకటించింది. ఇందుకోసం సన్నాహాలు ప్రారంభించింది. ఈ నిరసనలో పాల్గొనవద్దని చంద్రాపూర్ పోలీసులు సీజేపీ కార్యకర్తలకు నోటీసులు జారీ చేయడాన్ని దీప్కే తప్పుపట్టారు. జంతర్‌మంతర్‌కు వెళ్లడానికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పాలని పోటీసులు బలవంతం చేస్తున్నారని ఆక్షేపించారు.


