నోబెల్‌ తెచ్చిపెట్టిన మంచు ‘ఘనం’! | IceCube Neutrino Observatory Pioneer Francis Halzen Wins Physics Nobel | Sakshi
Sakshi News home page

నోబెల్‌ తెచ్చిపెట్టిన మంచు ‘ఘనం’!

Oct 7 2026 4:45 AM | Updated on Oct 7 2026 4:46 AM

IceCube Neutrino Observatory Pioneer Francis Halzen Wins Physics Nobel

కిలోమీటరు పొడవు, వెడల్పు, ఎత్తు మంచు ముద్ద... అది కూడా అంటార్కిటికాలో...  భూమికి రెండు కిలోమీటర్ల లోతులో! .. 5,160 డిజిటల్‌ ఆప్టిక్‌ మాడ్యూళ్లు.... ఒక్కో దాంట్లో కాంతిని పట్టుకోగల సున్నితమైన సెన్సర్లు, మినీ కంప్యూటర్లు! .. వీటికి ఇంకో 324 డిజిటల్‌ ఆప్టిక్‌ మాడ్యూళ్లు కూడా కలిపేసుకోండి! ..ఈ ఏడాది భౌతికశాస్త్ర నోబెల్‌ అవార్డు దక్కించుకున్న ఆవిష్కరణ వెనుక సెటప్‌ ఇదే! .. పేరు ‘ఐస్‌ క్యూబ్‌ న్యూట్రినో అబ్జర్వేటరీ’. నిర్మాణంలో కీలకపాత్ర పోషించింది ఫ్రాన్సిస్‌ హాల్జెన్‌

విశాల విశ్వాన్ని కళ్లారా చూసేందుకు మనిషి ఎన్నో ఏర్పాట్లు చేసుకున్నాడు. గెలీలియో టెలిస్కోపుతో మొదలైన ప్రస్థానం అత్యంత శక్తిమంతమైన నాన్సీ గ్రేస్‌ రోమన్‌ టెలిస్కోపు వరకూ సాగింది. అయితే ఇవన్నీ కాంతి సాయంతో పని చేసేవి. టెలిస్కోపుల్లోని దర్పణాలపై కాంతి పడితేనే నక్షత్రాలైనా, గెలాక్సీలైనా మరేదైనా కనిపించేది. కానీ కొన్నిసార్లు కాంతికి కొన్ని అడ్డంకులు వస్తూంటాయి. కృష్ణబిలం అదేనండి బ్లాక్‌హోల్‌ లోపల, సూపర్‌నోవా పేలుళ్లలో, లేదా చాలా దూరంగా ఉన్న గెలాక్సీల్లోంచి కాంతి ఉండదు. కాబట్టి విశ్వంలోని ఆ భాగం కనిపించదు.

ఇలా కాకుండా విశ్వం మొత్తం గురించి ఎలాంటి ఇబ్బందుల్లేకుండా తెలుసుకోవాలంటే న్యూట్రినోలను అర్థం చేసుకుంటే సరి. కంటికి కనిపించనివి కోటానుకోట్ల మైళ్ల దూరం ప్రయాణించినా చెక్కు చెదరనివి. ఈ క్షణంలోనూ మన శరీరాన్ని దాటుకుని సునాయాసంగా ప్రయాణిస్తున్న అతి సూక్ష్మ కణాలివి. ఈ న్యూట్రినోలను గుర్తించేందుకు, తద్వారా విశ్వ రహస్యాలను ఛేదించేందుకు ఒక అద్భుతమైన ‘ఐస్‌ క్యూబ్‌ న్యూట్రినో’అబ్జర్వేటరీని నిర్మించడంలో కీలకపాత్ర పోషించిన యూనివర్సిటీ ఆఫ్‌ విస్‌కాన్సిన్‌(అమెరికా) ప్రొఫెసర్‌ ఫ్రాన్సిస్‌ హాల్జెన్‌కు ఈ ఏడాది భౌతికశాస్త్ర నోబెల్‌ అవార్డు దక్కింది.  

అంటార్కిటికా ప్రాంతంలో దాదాపు రెండు కిలోమీటర్ల లోతులో (1,450 – 2,450 మీటర్లు) ఏర్పాటైంది ఈ వేదశాల. అలాగని ఇదేదో బిల్డింగ్‌ కాదండోయ్‌. ముందుగానే చెప్పినట్లు ఒక కిలోమీటరు సైజున్న మంచు ఘనం! గడ్డకట్టిన ఈ మంచు ఎంత పారదర్శకంగా ఉంటుందంటే న్యూట్రినోలు అణువును ఢీకొన్నప్పుడు వెలువడే విద్యుదావేశిత కణాల వెలుతురును డిజిటల్‌ ఆప్టికల్‌ మాడ్యూల్స్‌ స్పష్టంగా చూడగలిగేంత. ఈ ఐస్‌ క్యూబ్‌ చుట్టూ 5,160 మాడ్యూల్స్, భూ ఉపరితలంపై మరో 324 మాడ్యూల్స్‌ ఏర్పాటు చేశారు. కాంతి మాడ్యూళ్లను ఏ తీరున ఢీకొట్టాయి? వాటి ప్రకాశం ఎంత? ఏ కోణాల్లో ఢీకొట్టాయి? వంటి అంశాలను విశ్లేషించడం ద్వారా న్యూట్రినోల తీరుతెన్నుల సమాచారం తెలుసుకోవచ్చు. తద్వారా ఇప్పటికే ఉన్న సిద్ధాంతాలను ధ్రువీకరించుకోవచ్చు. కొత్త కొత్త విషయాలూ తెలుసుకోవచ్చు.  

అయితే మనకేంటి? 
ఐస్‌క్యూబ్‌ న్యూట్రినో అబ్జర్వేటరీ కేవలం ఖగోళ శా్రస్తానికి పరిమితం కాదు. దీన్ని నిర్మించేందుకు అభివృద్ధి చేసిన పలు టెక్నాలజీలు ఇప్పటికే మనకెంతో ఉపయోగపడుతున్నాయి. అత్యంత సున్నితమైన డిటెక్టర్ల తయారీ, డేటా అనాలసిస్‌ పద్ధతులు, దేశాల మధ్య సహకారానికి బాటలు వేసింది ఈ అబ్జర్వేటరీ. వ్యాధి నిర్ధారణలో ఎంతో కీలకమైన మెడికల్‌ ఇమేజింగ్‌ను మరింత కచ్చితంగా చేసేందుకు వీలు కల్పించింది. ఐస్‌క్యూబ్‌ కోసం అభివృద్ధి చేసిన డేటా అనాలసిస్‌ పద్ధతులను ఇప్పుడు కృత్రిమ మేధ రంగంలోనూ ఉపయోగిస్తున్నారు. భవిష్యత్తులో విద్యుత్తును మరింత ఆదా చేయగల టెక్నాలజీల అభివృద్ధికి కారణం కావచ్చునని శాస్త్రవేత్తల అంచనా.            – నేషనల్‌ డెస్క్ , సాక్షి  

ఫ్రాన్సిస్‌ హాల్జెన్‌కు భౌతిక శాస్త్ర నోబెల్‌ 
స్టాక్‌హోం: కంటికి కనిపించని న్యూట్రినో కణాలను గుర్తించేందుకు ఒక అత్యాధునిక వేదశాల (అబ్జర్వేటరీ) నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన అమెరికన్‌ శాస్త్రవేత్త ఫ్రాన్సిస్‌ హాల్జెన్‌ ఈ ఏడాది భౌతిక శాస్త్ర నోబెల్‌ అందించనున్నట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ మంగళవారం ప్రకటించింది. అవార్డు కింద దాదాపు పది కోట్ల రూపాయలు (12 లక్షల అమెరికన్‌ డాలర్లు) దక్కనున్నాయి.

‘‘హాల్జెన్‌ నేతృత్వంలోని ఇంజనీర్లు, పరిశోధకుల బృందం సిద్ధం చేసిన ఐస్‌క్యూబ్‌ న్యూట్రినో అబ్జర్వేటరీ ఖగోళ శాస్త్రంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది’’ అని అవార్డు ప్రకటన సందర్భంగా నోబెల్‌ అవార్డు కమిటీ తెలిపింది. హాల్జెన్‌ ఇటలీ నుంచి నోబెల్‌ కమిటీతో ఫోన్‌లో మాట్లాడుతూ.. ‘‘ఇది నిజంగా పెద్ద సర్‌ప్రైజ్‌. అవార్డు దక్కుతుందని అసలు ఊహించలేదు’’ అని వ్యాఖ్యానించారు. నోబెల్‌ అవార్డు దక్కవచ్చునని కొందరు అంచనా వేసినప్పటికీ దక్కడం మాత్రం కొంచెం చిత్రమైన అనుభూతి కలిగించిందని అన్నారు. బెల్జియంలో పుట్టి యూనివర్సిటీ ఆఫ్‌ విస్‌కాన్సిన్‌ (అమెరికా)లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న హాల్జెన్‌ వయసు ఇప్పుడు 82 ఏళ్లు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement