సాక్షి, చైన్నె: తనకు ప్రాణ హానీ ఉందని, రక్షణ కల్పించాలని బుధవారం పోలీసుల్ని వేడుకున్న వ్యక్తి గురువారం ఉదయాన్నే దారుణ హత్యకు గురయ్యాడు. ఉత్తర చైన్నె పరిధిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించి నారాయణ్ అలియాస్ నవీన్, లోకేష్, జఫర్, హరికృష్ణన్ అనే నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
అప్పు వివాదం
ఉత్తర చైన్నె తిరువొత్తియూరు పరిధిలో ఆటో డ్రైవర్‌గా ఉన్న ప్రదీప్ రాజ్ తల్లి ఢిల్లీ రాణి, నిందితుడైన నారాయణ్ తల్లి నవనీతం వద్ద రూ. 9 లక్షలు అప్ప చేశారు. ఆ డబ్బును తిరిగి చెల్లించమని కోరిన వివాదం కారణంగా ఇరువర్గాల మధ్య వివాదం రేగింది. ఈ నగదు వివాదంపై నవనీతం ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరువొత్తియూరు పోలీసులు గతంలో ప్రదీప్ రాజ్‌ను అరెస్టు చేసి జైలుకు పంపారు. ఆ తర్వాత అతను బెయిల్‌పై బయటకు వచ్చాడు.
భయంతో పథకం ప్రకారం హత్య
జైలు నుంచి వచ్చినప్పటికీ ప్రదీప్ రాజ్ తమను ఏమైనా చేస్తాడేమోనన్న భయంతో నారాయణ్, తన స్నేహితులతో కలిసి కుట్ర పన్ని గురువారం పథకం ప్రకారం కత్తులతో నరికి చంపేశాడు. ఈ దాడిలో ప్రదీప్ రాజ్ ముఖం గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైంది. కాగా, బుధవారం పోలీసు స్టేషన్‌కు వెళ్లిన ప్రదీప్ రాజ్ తనకు ప్రాణహానీ ఉందని, రక్షణ కల్పించాలని ఫిర్యాదు చేశాడు. ఆమరుసటి రోజే ఈ హత్య జరగడంతో పోలీసుల వైఫల్యంపై విమర్శలు బయలు దేరాయి. ప్రత్యర్థులు తమను చంపుతామని బెదిరిస్తున్నారని ప్రదీప్ రాజ్ కుటుంబం గతంలో డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు కూడా చేసింది. అయితే తిరువొత్తియూరు ఇన్‌స్పెక్టర్ అలెక్స్ ఈ విషయాన్ని తేలికగా తీసుకుని నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ హత్య జరిగిందని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఇన్‌స్పెక్టర్‌పై బదిలీ వేటు
ఈ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఇన్‌స్పెక్టర్ అలెక్స్‌ను వీఆర్‌కు పంపించేందుకు ఉన్నతాధికారులు నిర్ణయించారు. హత్యకు గురైన ప్రదీప్ రాజ్, సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ నటించిన చిత్రంలో బైక్ రైడింగ్ సన్నివేశంలో నటించడంతో పాటు కొన్ని ప్రైవేట్ సీరియల్స్‌లోనూ నటించారు.
పోలీసులు ఆయన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం చైన్నె ప్రభుత్వ స్టాన్లీ వైద్యశాలకు తరలించారు. కాగా, ఈ హత్యపై ప్రధాన ప్రతి పక్ష నేత ఉదయ నిధి స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. ‘‘పోలీసుల వద్ద రక్షణ కోరితే హత్యకు గురవుతారనే సరికొత్త చరిత్రను ఈ టీవీకే పాలకులు సృష్టించారని విమర్శించారు. పోలీసు శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న సీఎంని పోలీసులే ఒక డమ్మీ సీఎంగా భావిస్తున్నారా? అని ఎద్దేవా చేశారు. ఈ హత్యతో రాష్ట్ర రాజధాని నగరంలో ఏ మేరకు శాంతి భద్రతల పరిరక్షణ ఉందో అర్థం అవుతోందని డీఎంకే ఎంపి కనిమొళి మండిపడ్డారు.


