సాక్షి, హైదరాబాద్: బొల్లారం ఆయుధాల అపహరణ కేసులో మిస్టరీ వీడింది. ఆయుధాలను మాజీ ఆర్మీ అధికారే చోరి చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు గతంలో మద్రాస్ రెజిమెంట్‌లో పనిచేసినట్లు తెలిపారు. చెడు వ్యసనాలకు బానిసై ఆయుధాల చోరీ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆయుధాల చోరీకి మరో ముగ్గురు అధికారులు సహకరించినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అయితే అత్యంత పటిష్ట భద్రత గల మిలటరీ కంపౌండ్ నుంచి ఆయుధాలు ఏలా చోరీ చేశారనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.
చోరీ వివరాలు తెలుసుకున్న పోలీసులు సదరు మాజీ అధికారి నివాసంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో నిందితుడి ఇంట్లో రహస్యంగా దాచి ఉంచిన భారీ ఆయుధ నిల్వలు బయటపడ్డాయి. అధికారులు అక్కడ నుంచి మొత్తం 12 ఏకే-47 (AK-47) తుపాకులు, అత్యాధునిక ఇన్‌సాస్ (INSAS) గన్స్ సహా దాదాపు 1,200 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతంరం వాటిని సీజ్ చేసి అధికారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


