ప్యాకెట్‌ ఫుడ్‌పై రెడ్‌ సిగ్నల్‌..! | Red signal on packet food | Sakshi
Sakshi News home page

ప్యాకెట్‌ ఫుడ్‌పై రెడ్‌ సిగ్నల్‌..!

Sep 11 2026 2:43 AM | Updated on Sep 11 2026 2:43 AM

Red signal on packet food

ఆహార భద్రత, ప్రమాణాల అధికార సంస్థ యోచన 

ఈ మేరకు కీలక సిఫారసులు చేసిన ఎన్‌ఐఎన్‌ 

ఆహారంలోని అనారోగ్యకర పదార్థాలను బట్టి హెచ్చరికలు 

‘అధిక కొవ్వు’, ‘అధిక చక్కెర’, ‘అధిక ఉప్పు’అని స్పష్టంగా రాయాలని సూచన  

సాక్షి, హైదరాబాద్‌:  ప్యాకెట్లలో లభించే ఆహార పదార్థాల నాణ్యత, వాటిపై వేసే ముందస్తు హెచ్చరిక ముద్రల విషయంలో భారత ఆహార భద్రత, ప్రమాణాల అధికార సంస్థకు (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) అత్యంత కీలక సిఫార్సులను చేసింది. మరోవైపు ప్రజలు కొనుగోలు చేసే ప్యాకెట్‌ ఆహారాలలో చక్కెర, ఉప్పు, కొవ్వు పదార్థాలు ఏ మేరకు ఉన్నాయో ప్యాకెట్‌ ముందు భాగంలోనే స్పష్టంగా కనిపించేలా ముద్రించాలని న్యాయస్థానం గతంలోనే ఆదేశించింది. 

ఈ నేపథ్యంలో కేంద్ర సంస్థ ఆరు కోణాలు కలిగిన ఒక ఎరుపు రంగు గుర్తును ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఒకవేళ సదరు ఆహారంలో అనారోగ్యకర పదార్థాలు ఎక్కువగా ఉంటే.. ఆ ఎరుపు రంగు గుర్తు లోపల ‘అధిక కొవ్వు’, ‘అధిక చక్కెర’, ‘అధిక ఉప్పు’అని స్పష్టంగా రాయాలని ఎన్‌ఐఎన్‌ ప్రతిపాదించింది. ముందస్తు హెచ్చరిక ముద్రల విషయంలో ఉన్నత న్యాయస్థానం విధించిన సమయం ముగియనున్న నేపథ్యంలో ఎన్‌ఐఎన్‌ ప్రతిపాదనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

మొత్తం క్యాలరీలను లెక్కించాల్సిందే.. 
కేవలం అదనంగా చేర్చే చక్కెర, కొవ్వులను మాత్రమే కాకుండా ఆ ఆహారంలో ఉండే మొత్తం క్యాలరీలు, మొత్తం చక్కెర, మొత్తం కొవ్వు ఆధారంగానే ఈ హెచ్చరిక గుర్తును నిర్ణయించాలని ఎన్‌ఐఎన్‌ స్పష్టం చేసింది. ఉదాహరణకు మార్కెట్లో దొరికే కొన్ని వేపుడు చిప్స్‌ ప్యాకెట్లలో అదనంగా చేర్చే చక్కెర చాలా తక్కువగా ఉండవచ్చు. అలాగే అదనంగా చేర్చే కొవ్వు కూడా నిర్దేశిత పరిమితి కంటే లోపే ఉండవచ్చు. కానీ అందులో ఉండే నూనె శాతం వల్ల మొత్తం క్యాలరీల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. కేవలం అదనపు కొవ్వులనే ప్రామాణికంగా తీసుకుంటే ఇలాంటి హానికర ఆహారాలు ఎరుపు రంగు హెచ్చరిక పరిధిలోకి రాకుండా తప్పించుకుంటాయని ఎన్‌ఐఎన్‌ హెచ్చరించింది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఈ ప్రతిపాదనలను పరిశీలించి త్వరలోనే కొత్త మార్గదర్శకాలను విడుదల చేయనుంది. 

ఎన్‌ఐఎన్‌ చేసిన మరికొన్ని సూచనలు.. 
» చక్కెర స్థానంలో వాడే కృత్రిమ తీపి రసాయనాలు (ఆర్టిఫిషియల్‌ స్వీట్నర్స్‌) ఆరోగ్యానికి మంచిది కాదు. వాటి పరిమాణాన్ని కూడా ప్యాకెట్‌పై స్పష్టంగా రాయాలి. 
» శాస్త్రీయ పరిభాషతో సంబంధం లేకుండా చదువుకోని సాధారణ ప్రజలు కూడా ప్యాకెట్‌ చూడగానే అది ఆరోగ్యానికి మంచిదా కాదా అని గ్రహించేలా ఆ ఎరుపు రంగు గుర్తు డిజైన్‌ ఉండాలి. 
»  పాలు, గుడ్లు, పండ్లు వంటి సహజ సిద్ధ ఆహార పదార్థాలలో ఉండే కొవ్వు లేదా చక్కెరలను ఈ నిబంధనల నుంచి మినహాయించాలి. కేవలం మనుషులు తయారు చేసే ప్యాకెట్‌ ఆహారాలకే (ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌) ఇది వర్తింపజేయాలి.  

హెచ్చరికలపై సుప్రీం ఆదేశాలు
దేశంలో విపరీతంగా లభించే ప్యాకెట్‌ ఆహార సంస్కృతి వల్ల ఊబకాయం, మధుమేహం, ఇతర జీవనశైలి వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. వినియోగదారులు తాము కొనే ఆహారం ఎంతవరకు సురక్షితమైనదో ప్యాకెట్‌ చూడగానే సులభంగా అర్థం చేసుకోవడానికి ఈ ముందస్తు హెచ్చరిక గుర్తులు దోహదపడతాయని ఎన్‌ఐఎన్‌ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. 

ప్యాకెట్‌ ఆహార పదార్థాలపై వినియోగదారులను హెచ్చరించే ముద్రలు వేయడంపై గతంలో సుప్రీంకోర్టులో ఒక ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ప్యాకెట్ల ముందు భాగంలోనే స్పష్టమైన గుర్తులు లేకపోవడం వల్ల ప్రజలు అనారోగ్యకర ఆహారాన్ని కొని తింటున్నారని, దీనివల్ల దేశంలో ఊబకాయం, గుండె జబ్బులు పెరుగుతున్నాయని పిటిషన్‌దారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఈ ముందస్తు హెచ్చరిక ముద్రల విధానాన్ని త్వరగా ఖరారు చేయాలని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐని ఆదేశించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement