ఫ్యూచర్‌ లేని సిటీ... | BRS Working President KTR comments over Future City | Sakshi
Sakshi News home page

ఫ్యూచర్‌ లేని సిటీ...

Sep 11 2026 2:11 AM | Updated on Sep 11 2026 2:11 AM

BRS Working President KTR comments over Future City

నిరసనలో కేటీఆర్, హరీశ్‌రావు, తలసాని, మహిపాల్, పల్లా, తాతా మధు, సబిత, సునీత తదితరులు

ఫ్యూచర్‌ లేని సీఎం తన సోదరులతో కలిసి రియల్‌ ఎస్టేట్‌ నాటకం ఆడుతున్నారు 

ఇందులో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దు..బలి పశువులు కావొద్దు 

టెస్సెరాక్ట్‌ కంపెనీకి ఏటా రూ.లక్ష కూడా టర్నోవర్‌ లేదు 

రూ.250 కోట్లు విలువ చేసే భూములను రూ.7 కోట్లకే కట్టబెట్టడంపై కోర్టులను ఆశ్రయిస్తాం 

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ 

మహేశ్వరంలో టెస్సెరాక్ట్‌ కంపెనీకి కేటాయించిన భూమిని పరిశీలించిన బీఆర్‌ఎస్‌ నేతలు

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఫ్యూచర్‌ సిటీ ఓ మిథ్య అని, దానికి ఎలాంటి ఫ్యూచర్‌ లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు వ్యాఖ్యానించారు. ఫార్మాసిటీ పేరుతో సేకరించిన భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడులు చెల్లవని, ఫ్యూచర్‌ లేని సీఎం..తన సోదరులతో కలిసి ఆడుతున్న రియల్‌ ఎస్టేట్‌ నాటకంలో బలిపశువులు కావొద్దని విజ్ఞప్తి చేశారు. ‘పెట్టుబడులు పెట్టి మోసపోవొద్దు. ఏటా రూ.లక్ష కూడా టర్నోవర్‌ లేని సీఎం సోదరుడు కొండల్‌రెడ్డికి చెందిన టెస్సెరాక్ట్‌ కంపెనీకి రూ.250 కోట్లు విలువ చేసే భూములను రూ.7 కోట్లకే కట్టబెట్టడంపై కోర్టులను ఆశ్రయిస్తాం. 

ఎనుముల అన్నదమ్ముల దోపిడీని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలిపెట్టబోం..’అని అన్నారు. గురువారం మహేశ్వరం మండలం తుక్కుగూడ ఫ్యాబ్‌సిటీ (ఈసిటీ)లో టెస్సెరాక్ట్‌ కంపెనీకి కేటాయించిన భూములను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల బృందం పరిశీలించింది. ఆ కంపెనీకి భూ కేటాయింపులపై నిరసన వ్యక్తం చేసింది. అనంతరం పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కాలేరు వెంకటేష్, గూడెం మహిపాల్‌రెడ్డితో కలిసి కేటీఆర్‌ మాట్లాడారు. 

ఇందులో న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి.. 
‘ఫ్యూచర్‌ సిటీ పేరుతో ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ మాయాజాలం నడుపుతోంది. వాస్తవానికి ఫార్మాసిటీ కోసం నిర్దిష్ట షరతులతో భూసేకరణ జరిగింది. ఆ భూములను ఇప్పుడు ఇతర కార్యకలాపాలకు వినియోగించడం చట్టపరంగా ప్రశ్నార్థకం. ఫ్యూచర్‌ సిటీ భవిష్యత్తుపై న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. పెట్టుబడులు పెడుతున్న పారిశ్రామికవేత్తలు ఈ న్యాయపరమైన అంశాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. రేపు కోర్టులో ఈ భూములపై వివాదాలు తలెత్తితే నష్టపోయేది పారిశ్రామికవేత్తలే.  

పూర్తి వివరాలు ప్రజల ముందుంచాలి 
ఈ భూ కేటాయింపుపై ప్రభుత్వం పూర్తి వివరాలను ప్రజల ముందు ఉంచాలి. సీఎం కుటుంబ సభ్యులకు ప్రభుత్వ భూములు, రాయితీలు, మినహాయింపులు ఇవ్వడం అధికార దుర్వినియోగం కాదా? ప్రయోజనాల సంఘర్షణ కాదా? కుటుంబ పాలన కాదా? ఒకవైపు సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి.. మరోవైపు పారిశ్రామికవేత్త ఎనుముల జగదీశ్వర్‌రెడ్డిల మధ్య రూ.1,000 కోట్ల పెట్టుబడి ఒప్పందం. దానికి మళ్లీ ప్రభుత్వ రాయితీలు, ప్రభుత్వ భూములు, మినహాయింపులు ఇవ్వాలా? సీఎం సోదరుడి సంస్థ ఇజ్రాయెల్‌ ఇన్నోవేషన్‌ ఎకో సిస్టమ్‌తో చేసుకున్న ఒప్పందంపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి.  

బీజేపీ, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు స్పందించడం లేదు? 
అనామక కంపెనీకి విలువైన భూములు కేటాయించిన వ్యవహారంపై బీజేపీ, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు స్పందించడం లేదు? ఈడీ, ఐటీ, సీబీఐలు మాపై కేసులు పెట్టడానికే ఉన్నాయా? అధికారంలో ఉన్నవారి వ్యవహారాలు వారికి ఎందుకు కనిపించడం లేదు? తెలంగాణ..కాంగ్రెస్‌కు ఏటీఎంగా మారిందని ప్రధాని, కేంద్ర హోంమంత్రి ఆరోపిస్తున్నారు. తెలంగాణను కొల్లగొడుతున్నారని ఆరోపిస్తున్నప్పుడు దొంగలను పట్టుకోవాల్సిన హోం మంత్రి ఎక్కడున్నారు?

ఇంత పెద్ద వ్యవహారం జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఏరోస్పేస్, డిఫెన్స్‌ రంగాలు కేంద్ర ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలకు లోబడి ఉంటాయి. ఈ రంగంలోనూ అధికారానికి దగ్గర గా ఉన్న కుటుంబాలకు ప్రయోజనాలు కల్పిస్తున్నారన్న ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రేవంత్‌రెడ్డి కుటుంబానికి చెందిన సంస్థలతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుటుంబానికి చెందిన సంస్థలు కూడా ఏరోస్పేస్, డిఫెన్స్‌ రంగంలోకి రావడంపై పూర్తి వివరాలు వెల్లడించాలి.

సామాన్యులకు కూడా ఇలాగే భూములు ఇస్తారా? 
భూ కేటాయింపుల్లో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తే సామాన్యులు, యువత, రైతులకు కూడా ఇదే తరహాలో ప్రభుత్వ భూములు, రాయితీలు ఇవ్వాలి. మేము లక్ష రూపాయల మూలధనంతో పెట్టుబడి పెడతామని వస్తే కోట్ల విలువైన స్థలం ఇస్తారా? మాకు కూడా ఇదే రాయితీలు, మినహాయింపులు ఇస్తారా? ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలిపెట్టబోం. అవసరమైతే ప్రజా కోర్టును ఆశ్రయిస్తాం, రంగారెడ్డి జిల్లాలోని ప్రతి గ్రామంలో సదస్సులు నిర్వహించి భూకేటాయింపులు, ఫ్యూచర్‌ సిటీ పేరుతో జరుగుతున్న వ్యవహారాలను ప్రజలకు వివరిస్తాం..’అని కేటీఆర్‌ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement