భారీగా పడిపోతున్న చేరికలు
భర్తీ కాని సీట్లు 51 వేల పైమాటే
తిష్టవేసిన సమస్యలు... పట్టించుకోని ప్రభుత్వం
వెంటాడుతున్న టీచర్లు, వసతి గృహాలు, రవాణా సమస్యలు
ఖాళీగా 1,080 టీచర్ పోస్టులు.. భర్తీ చేయని 97 ప్రిన్సిపాల్ పోస్టులు
అతిథి అధ్యాపకులపై ఆధారపడుతున్న దైన్యం
మరోవైపు గురుకులాల దెబ్బతో విలవిల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మోడల్ స్కూళ్లలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. దీంతో భారీగా సీట్లు మిగిలిపోతున్నాయి. ఈ పరిస్థితిని మార్చాలని విద్యాశాఖాధికారులు ప్రతీ ఏటా నివేదికలు పంపుతూనే ఉన్నారు.మౌలిక వసతుల కల్పనపై సూచనలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో మోడల్ స్కూళ్ళల్లో చేరేందుకు విద్యార్థులు ముందుకు రావడం లేదు.
ప్రస్తుత విద్యా సంవత్సరంలో 194 మోడల్ పాఠశాలల్లో మొత్తం 1,59,080 సీట్లున్నాయి. కేవలం 1,07,782 మంది విద్యార్థులే చేరారు. దీంతో ఏకంగా 51,298 సీట్లు ఖాళీగా మిగిలాయి. గత విద్యా సంవత్సరంలోనూ సుమారు 50,718 సీట్లు ఖాళీగానే ఉన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మోడల్ స్కూళ్ళ భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అసలు సమస్య ఎక్కడ?
మోడల్ స్కూళ్ల టీచర్ల సమస్య తీవ్ర స్థాయిలో ఉంది. 3,880 బోధనా పోస్టులు మంజూరైతే, ఇప్పటికీ 1,080 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 97 ప్రిన్సిపాల్ పోస్టులే భర్తీ చేయలేదు. ఫలితంగా ఉన్న సిబ్బందిపై అదనపు భారం పడుతోంది. అతిథి అధ్యాపకులను తీసుకుని కాలం వెళ్ల దీస్తున్నా, అర్హత ఉన్న వారు, అనుభవం ఉన్నవారే కన్పించడం లేదని స్థానికులు అంటున్నారు.
చాలా చోట్ల ప్రస్తుతం పనిచేస్తున్న వారే అదనపు తరగతులు నిర్వహించాల్సి వస్తోంది. దీనివల్ల విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ కొరవడుతోంది. ప్రయోగశాలల నిర్వహణ, ఇతర విద్యా కార్యక్రమాలకు తగినంత సమయం కేటాయించలేని పరిస్థితి నెలకొంది. గంటల ప్రాతిపదికన ఉపాధ్యాయులను నియమించడం తాత్కాలిక పరిష్కారమే తప్ప.. శాశ్వత పరిష్కారం కాదని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.
వసతి గృహాల కొరత
చాలాచోట్ల మోడల్ స్కూళ్లు గ్రామీణ ప్రాంతాలకు దూరంగానే ఉంటున్నాయి. దీంతో సరైన రవాణా సదుపాయం లేని విద్యార్థులు ఈ స్కూళ్లకు వెళ్ళాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మోడల్ స్కూళ్లకు పూర్తి స్థాయి వసతి సదుపాయం ఉంటేనే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని విద్యాశాఖ అనేక సార్లు ప్రభుత్వానికి నివేదికలు పంపింది. ముఖ్యంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలల్లో హాస్టల్ సదుపాయాలు తగినంతగా లేకపోవడం సమస్యగా మారిందని తెలిపింది.
అబ్బాయిలకు వసతి సౌకర్యాలు పరిమితంగా ఉండడంతో దూర ప్రాంతాల విద్యార్థులు చేరేందుకు ఇష్టపడడం లేదని వివరించారు. ఇదే క్రమంలో గురుకులాల పోటీ కూడా మోడల్ స్కూళ్ల ప్రవేశాలను దెబ్బతీస్తోంది. రాష్ట్రంలో నివాస విద్యను అందించే గురుకుల పాఠశాలల సంఖ్య పెరగడం కూడా మోడల్ పాఠశాలల ప్రవేశాలపై ప్రభావం చూపుతోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. గురుకులాల్లో విద్యతో పాటు వసతి, భోజనం తదితర సౌకర్యాలు అందుబాటులో ఉండడంతో తల్లిదండ్రులు వాటివైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొంటున్నారు.
మార్పులకు సన్నద్ధం
మరోవైపు మోడల్ స్కూళ్లను విద్యార్థులకు చేరువ చేయాలనే ప్రయత్నం ఇటీవల కొంతమేర మొదలైందని, కొన్ని మార్పులు చేసేందుకు సన్నద్ధమవుతున్నామని అధికారులు పేర్కొంటున్నారు. మోడల్ పాఠశాలలను తెలంగాణ పబ్లిక్ స్కూళ్లుగా మార్చడం లేదా ఉన్నతీకరించడం, సీబీఎస్‌ఈ పాఠ్యప్రణాళికను ప్రవేశపెట్టడం, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు వంటి ప్రతిపాదనలు ముందుకొచ్చాయని తెలిపారు. హాస్టల్ సదుపాయాలు కల్పించడం, బోధకులను అవసరమైన మేర నియమించడం వల్లే వీటి పరిస్థితి మెరుగు పడుతుందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి.


