సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిరుపేదలకు ఇవ్వడానికి గుర్తించిన ప్రభుత్వ స్థలాలను లేఅవుట్ చేసిన వాటిని నెల రోజుల్లో పేదలకు ఇచ్చే ప్రయత్నం చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శాసనసభలో గురువారం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అంశాన్ని పలువురు సభ్యులు లేవనెత్తారు. సభ్యుల సందేహాలకు మంత్రి సమాధానమిస్తూ, 2024లో రాష్ట్ర ప్రభుత్వం సర్వే పూర్తి చేసి, ఆవాస్ యోజన అర్హత కలిగిన 11,56,929 కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. ఇది ఇప్పటికే పెండింగ్‌లో ఉందన్నారు. దీనిపై ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం 8 లక్షల ఇళ్లకు రూ.40 వేల కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. భవిష్యత్‌లో అర్హులకు మూడు, నాలుగో విడతలో కూడా ఇళ్లు ఇవ్వాలని ఆలోచిస్తోందని తెలిపారు.
సమస్యలున్నాయి: రాజగోపాల్‌రెడ్డి
చిన్న చిన్న కారణాల వల్ల అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం లేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. బతుకు దెరువు కోసం వాహనాలు కొనుక్కొన్నారని, అవి ఎప్పుడో పోయాయని, వారిని అనర్హులను చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ఇళ్లు ఇస్తున్నామనేది కాదని, ఎంతమంది అర్హులకు ఇస్తున్నామన్నదే ముఖ్యం కావాలన్నారు. చర్చలో మనోహర్‌రెడ్డి, అక్బరుద్దీన్, మేడేపల్లి సత్యం, వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.
అగ్రి పాలిటెక్నిక్ కాలేజీలను
మెరుగుపరుస్తాం: మంత్రి తుమ్మల
రాష్ట్రంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీలను ఆధునీకరిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 11 ప్రైవేటు అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రభుత్వం తనిఖీలు నిర్వహించిందని, ఇందులో ఆరు ప్రైవేటు కాలేజీల అనుబంధాన్ని రద్దు చేశామన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. ప్రమాణాలు లేని కాలేజీల అనుమతి రద్దు చేశామని, కొన్ని కాలేజీల్లో ప్రమాణాల పరిశీలనకు ఓ కమిటీని వేశామన్నారు. ఈ చర్చలో పాల్గొన్న ఎమ్మెల్యే మదనమోహన్ మాట్లాడుతూ, సరైన ప్రమాణాలు లేకుండా వ్యవసాయ కాలేజీలకు అనుమతి ఇవ్వొద్దని చెప్పారు.అవసరమైన ఫ్యాకల్టీ ఉండాలని కసిరెడ్డి నారాయణరెడ్డి సూచించారు. కొత్త వంగడాలు, సరికొత్త వ్యవసాయ విధానాలపై ఆధునిక లేబొరేటరీలతో పరిశోధనలు జరగాలని మధుసూదన్‌రెడ్డి కోరారు. చర్చలో ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు కూడా పాల్గొన్నారు.
హజ్‌హౌస్‌పై స్పష్టత ఇవ్వాలి: అక్బర్
హజ్‌హౌస్‌లో సమస్యలు పునరావృతం కాకుండా చూడాలని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ కోరారు. ఇతరులను మనం అనుసరించాల్సిన అవసరం లేదని, బెంగళూరులోని హజ్‌హౌస్‌ను ఉద్దేశించి అన్నారు. పహాడీషరీఫ్ వద్ద కొత్త హజ్‌హౌస్ నిర్మాణంపై అక్బర్ పలు ప్రశ్నలు వేశారు.


