ఏఐ... పైనే ఐ.. పెట్టుబడులు రెట్టింపై.. | Many companies have dramatically increased their investments in AI | Sakshi
Sakshi News home page

ఏఐ... పైనే ఐ.. పెట్టుబడులు రెట్టింపై..

Sep 11 2026 1:48 AM | Updated on Sep 11 2026 1:48 AM

Many companies have dramatically increased their investments in AI

దేశంలో 119 శాతం పెట్టుబడుల పెంపు 

ప్రపంచ సగటు కన్నా భారత్‌లో ఎక్కువ 

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) భారత్‌లోనూ శరవేగంగా విస్తరిస్తోంది. దీని ప్రాధాన్యాన్ని గ్రహిస్తున్న పలు సంస్థలు ఏఐపై తమ పెట్టుబడులను అమాంతం పెంచేశాయి. తాజాగా విడుదలైన సర్వీస్‌నౌ ఎంటర్‌ప్రైజ్‌ ఏఐ మెచ్యూరిటీ ఇండెక్స్‌–2026 ప్రకారం, వ్యాపారసంస్థల ఏఐ పెట్టుబడులు ఒక్క సంవత్సరంలోనే 119 శాతం పెరిగాయి, ఇది ప్రపంచ సగటు అయిన 110% కన్నా కూడా ఎక్కువ కావడం విశేషం. 2027 నాటికి సగటు ఐటీ బడ్జెట్‌లో ఐదోవంతు కంటే ఎక్కువ వాటా ఏఐ మీదే ఉంటుందని అంచనా. 

నిర్వహణ సంగతేంటి? 
ప్రపంచ స్థాయి డిజిటల్‌ ప్రజా మౌలిక సదుపాయాలు, అపారమైన ఇంజనీరింగ్‌ ప్రతిభతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎంటర్‌ప్రైజ్‌ ఏఐని స్వీకరిస్తున్న దేశాల్లో భారత్‌ ఒకటి. అయితే, తదుపరి దశ అనేది సంస్థలు ఏఐని ఎంత వేగంగా అమలు చేస్తాయనే దానిపై కాకుండా, దానిని ఎంత విశ్వాసంతో నిర్వహించగలవనే దానిపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం, కేవలం 22% భారతీయ సంస్థలు మాత్రమే ఏఐ పరీక్ష, ఆడిటింగ్, రిస్‌్క–అసెస్‌మెంట్‌ ప్రక్రియలను అమలు చేయగలుగుతున్నాయని సర్వీస్‌ నౌ తేల్చింది. 

ఏఐకి సంబంధించిన ప్రధాన అవరోధంగా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందే అవకాశాన్ని 60 శాతం మంది పేర్కొన్నారు. అలాగే 55% మంది నియంత్రణ, నిబంధనల పాటింపులో ఉన్న సంక్లిష్టతను, మరో 50 శాతం మంది డేటా గోప్యత, భద్రతాపరమైన ఆందోళనలను వ్యక్తపరిచారు. ప్రస్తుత దేశ సగటు ఐటీ బడ్జెట్‌లో ఏఐ వాటా 16.6% కాగా, 2027 నాటికి ఇది 21.3 శాతానికి పెరుగుతుందని అంచనా. కొన్ని అంతరాలను పూడ్చడం ద్వారా ప్రస్తుతం 55 శాతంగా ఉన్న భారత్‌ ఏఐ గవర్నెన్స్‌ స్కోర్‌ను ఏఐ అగ్రగామి దేశాల స్థాయికి తీసుకెళ్లవచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement