‘సర్‌’తో.. ఏదో ప్రమాదం! | CM Revanth Reddy Comments On SIR | Sakshi
Sakshi News home page

‘సర్‌’తో.. ఏదో ప్రమాదం!

Sep 11 2026 2:21 AM | Updated on Sep 11 2026 2:21 AM

CM Revanth Reddy Comments On SIR

పొంచి ఉందన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 

ఈ ప్రమాదం వెనుక ఉన్న ఆంతర్యాన్ని నేతలు గ్రహించాలి

‘సర్‌’ ప్రక్రియను తీవ్రంగా పరిగణించాలి..అర్హులైన వారి ఓట్లు కాపాడాలి 

దేశ వ్యాప్తంగా 15 కోట్ల ఓట్లు గల్లంతయ్యాయి 

ఓట్ల తొలగింపు ప్రమాదం మన దరిదాపులకు రానీయొద్దు 

ఎమ్మెల్యేగా గెలవాలనుకునే ప్రతి ఒక్కరూ దీన్ని సీరియస్‌గా తీసుకోవాలి 

శాసనసభ జరగకుండా ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన కుట్ర 

అసెంబ్లీ ఘటనలపై ఫ్లాష్‌ సర్వేలో కాంగ్రెస్‌కు చాలా పాజిటివ్‌గా వచ్చింది 

సభ జరిగినన్ని రోజులూ కాంగ్రెస్‌ సభ్యులు పూర్తిగా హాజరు కావాలన్న సీఎం 

నిషేధిత భూములపై ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని వ్యాఖ్య 

సీఎల్పీ సమావేశంలో ఎల్‌నినో, 22ఏ తదితర అంశాలపై మంత్రుల వివరణ

సాక్షి, హైదరాబాద్‌: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ద్వారా ఎక్కడో ఏదో ప్రమాదం పొంచి ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ప్రమాదం వెనుక ఉన్న ఆంతర్యాన్ని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు గ్రహించాలని చెప్పారు. ఎస్‌ఐఆర్‌ను చాలా సీరియస్‌గా తీసుకోవాలని అన్నారు. ఈ విషయం ఇప్పటికే పలుమార్లు చెప్పానని, ఎమ్మెల్యేగా గెలవాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియను తీవ్రంగా పరిగణించాలని, అర్హులైన వారి ఓటు హక్కును కాపాడాలని సూచించారు. గురువారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎం అధ్యక్షతన కాంగ్రెస్‌ శాసనసభా పక్ష (సీఎల్పీ) సమావేశం జరిగింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్‌ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబుతో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ భేటీలో పాల్గొన్నారు. సమావేశం ప్రారంభం కాగానే మాజీ ఎమ్మెల్యేలు కొమ్మిది నరసింహారెడ్డి, వంగా సుబ్బారావు, జి.సిద్ధయ్యల మృతికి సీఎల్పీ సంతాపం తెలిపింది. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు. 

ఎస్‌ఐఆర్‌ పేరుతో ఓట్లు తొలగించే కుట్ర 
‘ఎస్‌ఐఆర్‌ పేరుతో ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోంది. దేశంలో వయోజనుల జనాభా 103 కోట్లుగా చూపెడుతున్నారు. కానీ ఓటర్ల సంఖ్య మాత్రం 88 కోట్లే అంటున్నారు. అంటే దాదాపు 15 కోట్ల ఓట్లు గల్లంతయ్యాయి. ఈ 15 కోట్ల ఓట్ల తొలగింపు కారణంగా పొంచి ఉన్న ప్రమాదాన్ని అంచనా వేయగలగాలి. ఆ ప్రమాదం మన దరిదాపులకు రానీయకుండా మీరే జాగ్రత్త పడాలి. మీ ప్రవర్తన రెండోసారి గెలుపుపై ప్రభావం చూపుతుంది. మీ వ్యక్తిగత పనితీరు మీ గెలుపోటములను ప్రభావితం చేస్తుంది. ఎస్‌ఐఆర్‌ కోసం నేను రెండు రోజులు కొడంగల్‌లోనే ఉన్నా. ఎమ్మెల్యేలందరూ అలానే ఫోకస్‌ పెట్టాలి. తెలంగాణలో జరిగిన జనగణన దేశానికి రోల్‌మోడల్‌. రాష్ట్ర నమూనాను దేశ వ్యాప్తంగా జనగణనలో చేపట్టేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి.  

అధికారం పోయినా అహంకారం పోలేదు 
రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలను గురించి రాష్ట్ర ప్రజలకు వివరించాలి. అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుంటే ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన సభ జరగకుండా కుట్ర చేశారు. అధికారం పోయినా వారికి అహంకారం పోలేదు. పోలీసులు, ప్రజాప్రతినిధులను దూషించి మూడు రోజుల పాటు సభ సజావుగా జరగకుండా చేశారు. అధికారులపై అనుచితంగా వ్యవహరించారు. మహిళా అధికారుల ముందు టీ షర్టులు విప్పి ఇబ్బంది కలిగించారు. సభాపతిని అత్యంత అభ్యంతరకరంగా దూషించారు. దళితులు నిరసన తెలిపేందుకు వెళ్లిన నేలను శుద్ధి చేసి అవమానపర్చారు. అయినా ప్రతిపక్షం కుట్రలను బలంగా తిప్పికొట్టడంతో పాటు ఆ కుట్రను ప్రజలకు తెలియజేయగలిగాం..’అని సీఎం అన్నారు. కుట్రను తిప్పికొట్టారంటూ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అభినందించారు. 

సీఎల్పీ భేటీలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి, రాజనర్సింహ, ఉత్తమ్‌, మహేశ్‌ గౌడ్, శ్రీధర్‌బాబు, ఆది శ్రీనివాస్‌  

అసెంబ్లీలో పనితీరు ఆధారంగానే పదోన్నతులు 
‘అసెంబ్లీలో జరిగిన ఘటనల గురించి ఫ్లాష్‌ సర్వే చేయించా. అందులో కాంగ్రెస్‌కు చాలా పాజిటివ్‌గా వచ్చింది. మనం ఏం చేస్తున్నామో ప్రజలు గమనిస్తుంటారు. కాంగ్రెస్‌ సభ్యులు లాబీల్లో తిరగడం కాదు. అసెంబ్లీలో హాజరు తగ్గకుండా చూసుకోవాలి. సభ జరిగినన్ని రోజులు ఖచ్చితంగా హాజరు కావాలి. చర్చల్లో పాల్గొనాలి. నియోజకవర్గాల సమస్యలు ప్రస్తావించాలి. ప్రజలిచ్చిన హోదాను సరైన విధంగా ఉపయోగించుకోకపోతే భవిష్యత్తులో రాజకీయంగా రాణించలేరు. అసెంబ్లీలో పనితీరు ఆధారంగానే పదోన్నతులు వస్తాయి. సభలో అందరికీ వెసులుబాటుగా ఉండడం కోసం అత్యంత చారిత్రక భవనంలో శాసనమండలి నిర్వహిస్తున్నాం. అసెంబ్లీలో దుద్దిళ్ల శ్రీపాదరావు పేరిట సెంట్రల్‌ హాల్‌ ఏర్పాటు చేశాం. 

22ఏలో కోటి ఎకరాలు అవాస్తవం 
22ఏ అనేది అభూత కల్పన మాత్రమే. ఈ జాబితాలో కోటి ఎకరాలు ఉన్నాయని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఉన్న భూములే ఇప్పుడూ ఉన్నాయి. ప్రైవేటు వివాదాలున్నవి కేవలం 3 లక్షల ఎకరాలు మాత్రమే. ధరణిలో భారీ ఎత్తున అరాచకాలు చేశారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలోనే బీఆర్‌ఎస్‌ నేత ఒకరి పేరిట వెయ్యి ఎకరాలు ఎక్కించుకున్నారు. వీటన్నింటిపైనా విచారణ చేయిస్తున్నాం. అన్నీ ఒకొక్కటిగా బయటకు వస్తాయి. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సహకారంతోనే దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. ఎల్‌నినో కారణంగా వచ్చే 10 నెలలు కూడా ఇబ్బంది ఉంటుంది. కరువు వచ్చే ప్రమాదం ఉంది. ఎమ్మెల్యేలు సాగునీటిపై కాకుండా తాగునీటిపై ఫోకస్‌ చేయాలి. కొందరు కాంగ్రెస్‌ పార్టీ ద్వారా ఎదిగి అదే కాంగ్రెస్‌ పార్టీకి నష్టం చేయాలని చూస్తున్నారు. కాంగ్రెస్‌ అవకాశం ఇవ్వకపోతే సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలు రాష్ట్ర స్థాయి నేతలుగా ఎదిగేవారా?’అని సీఎం ప్రశ్నించారు. వెయ్యి రోజుల పాలనకు సహకరించిన సీఎల్పీకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.  

ఇంటింటికీ పథకాల ప్రచారం జరగాలి: భట్టి విక్రమార్క 
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ సభ్యులందరం కలిసి పనిచేస్తే కుట్రలను ఎలా ఛేదించగలమో చేసి చూపించామని అన్నారు. బీఆర్‌ఎస్‌ నేతల తీరు, వారి భాష, వివక్ష పూరిత కార్యకలాపాల గురించి రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేసి కట్టడి చేయగలిగామని అన్నారు. అందరం ఒకటే మాట, ఒకటే బాటగా ఇదే పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రచారం చేసుకోవడంలో వెనుకబడుతున్నామన్నారు. సరైన విధంగా ప్రచారం చేసుకుంటే ఆ ప్రవాహంలో ప్రతిపక్షాలు కొట్టుకుపోతాయని చెప్పారు. ప్రజా ప్రభుత్వం చేసిన పనులను ప్రతి గ్రామంలో ఇంటింటికీ ప్రచారం చేయాలని కోరారు.  

తెలంగాణలోనే సామాజిక న్యాయం: పీసీసీ చీఫ్‌ 
సామాజిక న్యాయం తెలంగాణలోనే అమలవుతోందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేశ్‌కుమార్‌గౌడ్‌ వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్‌ బీసీ కాకపోయినా బీసీలకు రిజర్వేషన్ల కోసం ముందుకొచ్చారని, కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం సహకరించడం లేదని విమర్శించారు. కాగా రాష్ట్రంలో పరిస్థితులను పలువురు మంత్రులు సీఎల్పీకి వివరించారు. ఎల్‌నినో ప్రభావం, నీటి సమస్యపై మంత్రి ఉత్తమ్, జనగణనలో బీసీ కాలమ్‌ గురించి పొన్నం, 22ఏ భూముల జాబితా గురించి పొంగులేటి, పాలిటెక్నిక్‌ విద్యార్థుల అంశంపై మంత్రి వివేక్‌లు వివరించారు.  

యాష్కీకి సీఎం శుభాకాంక్షలు 
ఆల్‌ ఇండియా ప్రొఫెషనల్స్‌ కాంగ్రెస్‌ చైర్మన్‌గా ఎంపికైన మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. గురువారం సీఎల్పీ సమావేశం అనంతరం.. అసెంబ్లీ కమిటీ హాల్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు యాష్కీకి శుభాకాంక్షలు తెలియజేశారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement