నా ఆఫీసు ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి
అదో రచ్చబండ లాంటిది...ఉదయమే కాదు... రాత్రి కూడా కలవచ్చు
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ అందుబాటులో ఉంటాను
టీజీఈజేఏసీ ప్రతినిధుల భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్య
అసెంబ్లీ సమావేశాల తర్వాత ఆర్థిక పరిస్థితిని సమీక్షించి నిర్ణయిస్తానని హామీ
సాక్షి, హైదరాబాద్: ‘నా ఆఫీసు రచ్చబండ లాంటిది. నా కార్యాలయ ద్వారాలు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి. ఉద్యోగ సంఘాల నేతలు నన్ను ఎప్పుడైనా కలవచ్చు. ఉదయమే కాదు... రాత్రిపూట కూడా వచ్చి కలవచ్చు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది’అని సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ప్రతినిధులకు భరోసా ఇచ్చారు. అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో టీజీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు తదితర ప్రతినిధి బృందం సీఎంతో సమావేశమైంది.
ఉద్యోగుల డిమాండ్లు, సమస్యలను టీజీఈజేఏసీ ప్రతినిధులు వివరించారు. ఇందుకు సంబంధించి వినతిపత్రాన్ని సమర్పించారు. ప్రధానంగా ఆరు అంశాలను వినతిపత్రంలో ప్రస్తావించారు. రెండవ పీఆర్సీ నివేదిక, 51% ఫిట్‌మెంట్, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలు, రూ.10,000 కోట్లకు పైగా పెండింగ్ బిల్లులు, సీపీఎస్ రద్దు–ఓపీఎస్ అమలు, ఉద్యోగుల ఆరోగ్య పథకం, ఉద్యోగ సంఘాల గుర్తింపు తదితర అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. ఉద్యోగుల సమస్యలను ఆలకించిన అనంతరం సీఎం పైవిధంగా స్పందించారు.
నివేదిక పరిశీలిస్తాం...తుది నిర్ణయం తీసుకుంటాం
జేఏసీ ప్రతినిధులతో సీఎం మాట్లాడుతూ పీఆర్సీ నివేదిక సమర్పించేందుకు ఇప్పటికే కమిషన్‌కు ప్రభుత్వం లేఖ పంపిందని, నివేదిక అందిన అనంతరం దానిని పరిశీలించి, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించి పీఆర్సీ, డీఏలపై తుది నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. గత జనవరి నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం సుమారు రూ.10వేల కోట్లు విడుదల చేసిందని, ఉద్యోగుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తున్నానని సీఎం తెలిపారు.
ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున అనేక అంశాలు తన ముందున్నాయని, వాటితో పాటు ఇతర పరిపాలనా కార్యక్రమాల వల్ల సమయం కేటాయించడం కష్టంగా ఉందన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఆర్థిక శాఖతో సమావేశమై రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సమీక్షించి, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని సీఎం స్పష్టం చేశారు. అదేవిధంగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మరోసారి సమావేశమై అన్ని అంశాలపై చర్చించి పరిష్కార మార్గాలను ఖరారు చేస్తామని హామీ ఇచ్చారు.
సీఎంను కలిసిన వారిలో జేఏసీ ప్రతినిధులు దామోదర్ రెడ్డి, చావ రవి, సదానంద గౌడ్, గౌతమ్ కుమార్, కటకం రమేష్, ముజీబ్ హుస్సేన్, బి.శ్యామ్, వెంకట్, రమణారెడ్డి, భిక్షం గౌడ్ తదితరులున్నారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యోగ జేఏసీ అధ్యక్షులు, డిప్యూటీ కలెక్టర్ల సంఘంవ్యవస్థాపక అధ్యక్షులు వి.లచి్చరెడ్డి, జేఏసీ నేత వడ్నాల రాజశేఖర్ కూడా సీఎంను కలిసి ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. అనంతరం టీజీఈజేఏసీ ప్రతినిధి బృందం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కలిసి ఉద్యోగుల సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.


