ఇరాన్–యూఎస్ యుద్ధంతో సమస్య
ఇన్సులేటింగ్ ఆయిల్ సరఫరాకు ఆటంకం
హీటెక్కుతున్న ట్రాన్స్‌ఫార్మర్లు
ఆరు నెలల కాలంలో 80 సార్లు 400 కేవీ సబ్‌స్టేషన్లలో సమస్యలు
పట్టించుకోని ప్రభుత్వం.. ఆయిల్ నిల్వలు పెంచాలని సూచనలు
సాక్షి, హైదరాబాద్ : పశ్చిమాసియా యుద్ధ ప్రభావం తెలంగాణ ట్రాన్స్‌కోపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సబ్ స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లలో వాడే మినరల్ ఆయిల్ ఆధారిత ఇన్సులేటింగ్ ఆయిల్ కోసం ట్రాన్స్‌కో అష్టకష్టాలూ పడాల్సి వస్తోంది. దీని కొరత కారణంగా తరచూ సబ్ స్టేషన్‌లో విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. కీలకమైన 400 కేవీల్లో కొన్ని నిమిషాల పాటు సమస్యలు ఏర్పడుతున్నాయి. దీనివల్ల పరిశ్రమలు, గృహ విద్యుత్ ఉన్నట్టుండి ఆగిపోతున్నాయి. పశ్చిమాసియా యుద్ధం కొన్ని నెలలుగా కొనసాగుతున్నా, సమస్య తీవ్రత మాత్రం కొన్ని వారాలుగా ఉందని అధికారులు చెబుతున్నారు.
యుద్ధం మొదలైనా ఉన్న నిల్వలు, ముందు చూపుతో తెప్పించుకున్న ఆయిల్ వల్ల సమస్య లేకుండా చూశామని ఓ డైరెక్టర్ స్థాయి అధికారి తెలిపారు. కానీ ఇప్పుడు మార్కెట్లోనూ దొరకడం కష్టంగా ఉందంటున్నారు. ఎక్కడన్నా లభించినా క్రూడ్ ధర పెరగడం వల్ల ట్రాన్స్‌కోకు కావాల్సిన ఆయిల్ రేట్లూ పెరుగుతున్నాయని తెలిపారు. ఈ సమస్యపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని, పెరిగిన ఖర్చుపై ప్రభుత్వం నుంచి స్పందన రావాల్సి ఉందని అధికారులు అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమలు, వాణిజ్యం, గృహ విద్యుత్‌కు ట్రాన్స్‌కోకు సంబంధించిన 400 కేవీ, 220 కేవీ లైన్లే కీలకం. ఇవి జాతీయ గ్రిడ్‌కు అనుసంధానమై ఉంటాయి.
ఇదే సామర్థ్యంతో ఉండే సబ్ స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు విద్యుత్ సరఫరాలో కీలక పాత్ర పోషిస్తాయి. వినియోగదారుడికి చేరుకునే 11 కేవీ లైన్లకు విద్యుత్‌ను నియంత్రించి పంపడం వీటి బాధ్యత. రాష్ట్రంలో 400 కేవీ సబ్ స్టేషన్లు 29, 220 కేవీ సబ్ స్టేషన్లు 105, 132 కేవీ సబ్ స్టేషన్లు 254 వరకూ ఉన్నాయి. వీటి పరిధిలో ఉండే ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని బట్టి ఆయిల్ వినియోగం ఉంటుంది. 105ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్ సమర్థ్యానికి 35 వేలు, 315 ఎంవీఏ సామర్థ్యం ట్రాన్స్‌ఫార్మర్లకు 80 వేల లీటర్ల వరకూ ఆయిల్ వాడకం ఉంటుంది. క్రూడ్ ఆయిల్ మార్కెట్లో ఆరు నెలల క్రితం 6,500 వరకూ ఉంది. ప్రస్తుతం ఇది రూ. 8 వేల వరకూ వెళ్ళింది. ఫలితంగా ట్రాన్స్‌కోపై రోజుకు కొన్ని లక్షల రూపాయల అదనపు భారం పడుతుందని అధికారులు చెబుతున్నారు.
ట్రాన్స్‌కో పరిధిలోని ట్రాన్స్‌ఫార్మర్‌ను పెద్ద విద్యుత్ హీటర్‌గా భావిస్తారు. కాయిల్స్, వేడి ఉత్తత్తి నియంత్రణ, రేడియేటర్ల వేడిని తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుంది. అధిక వోల్టేజీ కాయిల్స్, ఆయిల్ ఇన్సులేషన్‌కు ఆయిల్ కీలకం. ఆయిల్ తక్కువైనప్పుడు ట్రాన్స్‌ఫార్మర్‌లో నీరు, తేమ, దుమ్ము, ఆక్సీకరణ ఉత్పత్తుల పెరుగుదల ఉంటుంది. దీనివల్ల ఇన్సులేటింగ్ సామర్థ్యం తగ్గుతుంది. ఇన్సులేషన్ బలహీనపడితే వేడి పెరిగి, ట్రాన్స్‌ఫార్మర్ వైఫల్యం చెందుతుంది. పశ్చిమాసియా యుద్ధం మొదలైనప్పట్నుంచీ ఆరు నెలల కాలంలో 80 సార్లు 400 కేవీ సబ్ స్టేషన్లలో సమస్యలు వచ్చినట్టు అధికారులు గుర్తించారు. దీని ప్రభావం వల్ల ఈ ఆరు నెలల్లో నెలకు కనీసం వందకుపైగా విద్యుత్ అంతరాయాలు పెరిగాయి. ఆయిల్ కొనుగోలుపై ట్రాన్స్ అధికారులు చెప్పినా, ప్రభుత్వం పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఆయిల్ నిల్వలు పెంచాలని అధికారులు సూచిస్తున్నారు.


