నాసిక్: అతనొక రిటైర్డ్ మర్చంట్ నేవీ ఆఫీసర్.. ఇప్పుడు నకిలీ బాబాగా అవతారమెత్తాడు. ఆధ్యాత్మికత పేరుతో మహిళలను వంచించి, భక్తుల బలహీనతలతో డబ్బులు దండుకుని, కోట్లాది రూపాయల సామ్రాజ్యాన్ని నిర్మించాడు. అశోక్ ఖారత్ అనే ఈ దొంగ బాబా గుట్టు ఎట్టకేలకు బయటపడింది. చేతబడులు, వశీకరణ పేరుతో అమాయకులను బురిడీ కొట్టిస్తూ, లైంగిక వాంఛలు తీర్చుకుంటున్న ఈ మాయగాడి లీలలు ఇప్పుడు మహారాష్ట్రలో సంచలనం సృష్టిస్తున్నాయి.
టెక్నాలజీతో మాయాజాలం
అశోక్ ఖారత్ తన ఆఫీసును ఒక క్షుద్ర పూజల కేంద్రంలా తీర్చిదిద్దాడు. భక్తులను భయపెట్టడానికి రిమోట్ కంట్రోల్‌తో నడిచే నకిలీ పాములను, పులి చర్మాలను, ఇతర వన్యప్రాణి అవశేషాలను ఉపయోగించేవాడు. తనకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్మించి, ఐదు రూపాయలకు కూడా విలువ చేయని చింత పిక్కలను, నకిలీ రత్నాలను ‘మంత్రించినవి’ అని చెప్పి, రూ. 10 వేల నుంచి లక్ష రూపాయల వరకు విక్రయించేవాడు. ఎవరైనా ఎదురుతిరిగితే ‘వశీకరణం’ చేస్తానని, కీడు జరుగుతుందని భయపెట్టేవాడు.
గర్భిణీ అని చూడకుండా..
ఈ కేసులో ఇప్పటికే పలువురు మహిళలు ఖారత్‌పై ఫిర్యాదు చేశారు. ఒక బాధితురాలిని మూడేళ్లుగా లైంగికంగా వేధిస్తున్న ఈ నిందితుడు, ఇటీవల మరో గర్భిణిపై కూడా అఘాయిత్యానికి పాల్పడటం గమనార్హం. పూజల పేరుతో ఆమె భర్తను బయట కూర్చోబెట్టి, లోపల ఆమెపై దారుణానికి ఒడిగట్టాడు. బాధితులకు మత్తు పానీయాలు ఇచ్చి, తన కోరికలు తీర్చుకునేవాడని పోలీసుల విచారణలో తేలింది.
రాజకీయ ప్రకంపనలు
ఖారత్ ఆధ్యాత్మిక ముసుగులో నేరాలు చేయడమే కాకుండా, విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాడు. ఇప్పటివరకు 150 సార్లు విదేశీ పర్యటనలు చేసిన ఈయనకు సుమారు 52 విలువైన ఆస్తులు ఉన్నట్లు డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. నాసిక్ సమీపంలోని ఒక దేవాలయ ట్రస్ట్‌కు చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఈ వ్యవహారం మహారాష్ట్ర రాజకీయాల్లోనూ వేడి పుట్టించింది. ఖారత్‌తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు రూపాలి చకంకర్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసును లోతుగా విచారిస్తోంది.


