అత్తవారింట గౌరి గణేశ పండుగను జరుపుకోవడానికి వెళ్లిన మహిళను కేఎస్ ఆర్టీసీ బస్సు యమపాశంలా ఊపిరి తీసింది. ఈ ఘటన హాసన్ నగరంలో జరిగింది. వివరాలు.. అపర్ణ (31), భర్త యోగిశ్ హాసన్ నుంచి బెంగళూరుకు వలస వచ్చి జీవిస్తున్నారు. వినాయక చవితికి సొంతూరికి వెళ్లారు.
శనివారం ఉదయం హాసన్ ఎన్‌ఆర్ సర్కిల్‌లో అపర్ణ స్నేహితురాలి స్కూటర్‌లో వెళుతుండగా ఓ కేఎస్ ఆర్టీసీ బస్సు వారిని ఢీకొట్టింది. అపర్ణ కిందపడిపోగా ఆమె పై నుంచి బస్సు దూసుకెళ్లింది. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న ఆమెను స్థానికులు ఆస్పత్రిలో చేర్చారు. కొంతసేపటికి ఆమె మరణించడంతో భర్త, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ట్రాఫిక్ పోలీసులు ప్రమాదస్థలిని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణం పోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. -బెంగళూరు
ఇదీ చదవండి: తుఫానులో చిక్కుకున్న విమానం.. ప్రయాణికుల హాహాకారాలు!


