‘పోలీసు బలగం అని పిలిచే సంఘటిత ముఠా నేర చరిత్రతో సరితూగగల చట్ట వ్యతిరేక సమూహం ఈ దేశంలో మరొకటి లేదు...’ అన్నారు 1961లో అప్పటి అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆనంద్ నారాయణ్ ముల్లా. ఒక తీర్పులో ఆయన చేసిన ఈ వ్యాఖ్యానం ఎంతో కటువైనదిగా అనిపించినా, దాన్ని నిజం చేయడానికి అహర్నిశలూ ‘శ్రమించే’ పోలీసు అధికారులకు మన దేశంలో అప్పుడూ ఇప్పుడూ కొదవలేదు.
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపాలిటీ, నగర పంచాయతీలకు మొదలైన నామినేషన్ల ఘట్టాన్ని చూస్తున్నవారంతా నివ్వెరపోతున్నారు. నామినేషన్ల దాఖలురోజే ఇంత చేటు హింసా అని ముక్కున వేలేసుకుంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలపై, నాయకులపై సాగించిన గూండాయిజం ఒకనాటి బిహార్‌ను తలదన్నేలా ఉంది. గూండాల దాడుల్లో, పోలీసుల లాఠీచార్జిలో వేలాదిమంది నెత్తురోడటం, రోదించటం, నామినేషన్ వేయనివ్వ మంటూ అభ్యర్థులుగా వచ్చినవారు పోలీసుల కాళ్లు పట్టుకున్నా కనికరించకపోవటం చూస్తే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా... సైనిక పాలనలో బతుకీడుస్తున్నామా అన్న సందేహం తలెత్తుతుంది.
మహిళలపైకి లంఘించి నామినేçషన్ పత్రాలు లాక్కొని ధ్వంసం చేయటం, వారి దుస్తులు చించడం, నెత్తురోడేలా కొట్టడం ఊహకందని దృశ్యాలు. అంతేనా... బయట పోలీసుల్నీ, గూండాల దాడులనూ దాటుకుని నామినేషన్లు అందించటానికిపోతే అధికారులు నిర్జీవమైన బొమ్మల్లా ఉండిపోయారు. ఒకరిద్దరు ఆత్మగౌరవం గలవారు తప్పనిసరై స్వీకరిస్తే అక్కడే ఉన్న టీడీపీ మూకలు వాటిని చించి పోగులు పెట్టాయి.
పుంగనూరులో ఏకంగా వైఎస్సార్ కాంగ్రెస్ లోక్‌సభా పక్షనేత మిథున్‌రెడ్డిపై హత్యాయత్నం చేశారు. చివరకు బాధితులపైనే కేసులు. ఇంకా రాయచోటి, తిరుపతి, ధర్మవరం, కడప, దాచేపల్లి, గుత్తి, గురజాల, దర్శి తదితర 96 ప్రాంతాల్లో టీడీపీ మూకలు రెచ్చిపోయి విధ్వంసం సృష్టిస్తుంటే... పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్‌ను నిలువరించటం ఆ ముఠాలకు అసాధ్యం అనుకున్నప్పుడు తామే రంగంలోకి దిగారు. జస్టిస్ ముల్లా వ్యాఖ్యానానికి ఇప్పటికీ సమకాలీనత ఉన్నదని నిరూపించారు. పలుచోట్ల వాహనాలకు వారే దగ్గరుండి నిప్పెట్టించారు. పులివెందులలో ఒకడు ఏకే–47తో కాల్పులకు దిగాడు. భేష్... ఈవీఎంలలో మాయజేసి అర్ధరాత్రి వరకూ ఓట్ల కైంకర్యం, జాబితాల్లో ఓటర్లను మాయం చేయటంవంటి విద్యలు నేర్చినవారు ఇప్పుడు నామినేషన్ల దాఖలును సైతం దండనార్హమైన నేరంగా పరిగణించటం మొదలెట్టారు!
ఏపీ సీఎం చంద్రబాబు ఏనాడూ సాహసించి తనకై తాను స్థానిక ఎన్నికలు జరిపించింది లేదు. ఒకే ఒక్కసారి న్యాయస్థానంతో చీవాట్లు తిని జరపకతప్పలేదు. ఆ బాపతు మనిషి ఈసారి అయిష్టంగానే సిద్ధపడ్డారు. చివరకు ఈ దుశ్శాసన పర్వానికి తెరలేపారు. సకల వ్యవస్థలూ చేష్టలుడిగి చోద్యంచూడటం గమనిస్తే జస్టిస్ ముల్లా వ్యాఖ్యానాన్ని మరింత విస్తరించి చదువుకోవాల్సిన దుఃస్థితి దాపురించిందనుకోవాలి. ఏకపక్షంగా వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు, ఆదరాబాదరాగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటన, నామినేషన్లకు మూడు రోజులే గడువు, అటుపై అరాచకాలు, స్క్రూటినీ పేరుతో తిరస్కరణలు, అంగీకరించినవాటిని సైతం బుట్టదాఖలా చేయడం... ఈ అరాచకానికి అంతం ఎక్కడ!
దృఢంగా వ్యవహరించలేనప్పుడూ, నోరు పెగలనప్పుడూ బాధ్యతాయుత పదవుల జోలికిపోకూడదు. ప్రపంచమంతా నాలుగురోజులుగా ఈ హింసాకాండ చూస్తున్నా రాష్ట్ర ఎన్నికల సంఘం చీఫ్ పునేఠకు జిల్లా కలెక్టర్ల నివేదికలు కావాలట! ప్రత్యక్ష ప్రసారాలు చూసి కలెక్టర్లను బదిలీ చేసి, పరిస్థితిని దారికి తేవాల్సిన అధికారి నీళ్లు నమలడం సిగ్గుచేటు కాదా? ‘పోయేది ఎస్‌ఈసీ పరువే...’ అని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హెచ్చరించినా పునేఠలో కదలిక రాలేదు. ఈమాత్రందానికి లక్షల్లో జీతాలెందుకు... ఎన్నికల పేరుతో కోట్ల రూపాయల ఖర్చెందుకు? ఈ హింసంతా దేనికి? ఈ దండగమారి నాటకం ఎన్నాళ్లు? కొన్ని రోజులక్రితం తాము చాలా పైపైకి పోయామని దొంగ సర్వేను ప్రకటించిన బాబే... ఓటమి ఖాయమన్న భయంతో ఇంత అరాచకం సాగిస్తుంటే వ్యవస్థలన్నీ సాగిలబడటం విచారకరం... ఘోరం.


