ఉత్సవాలా? ఉరితాళ్లా? | Sakshi Editorial On Vijayawada Navaratri Celebrations by Vardhelli Murali | Sakshi
Sakshi News home page

ఉత్సవాలా? ఉరితాళ్లా?

Oct 18 2026 2:29 AM | Updated on Oct 18 2026 2:29 AM

Sakshi Editorial On Vijayawada Navaratri Celebrations by Vardhelli Murali

జనతంత్రం

రెండేళ్ల నుంచి ఏపీ పెద్దలు ‘విజయవాడ ఉత్సవాల’ను నిర్వహిస్తున్నారు. నవరాత్రి వేడుకల వెలుగుల్లో నగరం మీద కురిపించే ప్రేమ కాంతులు కూడా ప్రకాశిస్తాయని పాలకులు ఆశిస్తున్నారు. ఈ 9 రాత్రుల అట్టహాసం మాటున నగర భవిష్యత్తుకు పెద్దలు పేనుతున్న ఉరితాళ్లను ఎవరూ గమనించలేరని వారు సంబరపడుతుండవచ్చు. విజ్ఞులైన విజయవాడ ప్రజలు ఈ వంచనా శిల్పాన్ని అంచనా వేయలేరనుకోవడం వెర్రితనమే అవుతుంది. సదాశయంతో నగరానికి ఉత్సవాలు నిర్వహిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. అది సంతోషదాయకం కూడా. గ్రామదేవతకు బలి ఇచ్చే ముందు మేకపోతుకు ముస్తాబు చేసి దండవేసి ఊరేగించే ఉత్సవం వంటిదైతే మాత్రం తప్పకుండా అభ్యంతరం ఉంటుంది. ఆందోళన కూడా ఉంటుంది. 

ప్రభుత్వ ప్రాయోజిత ఉత్సవ్‌ జరుగుతున్న సమయంలోనే నగరాన్ని డెడ్‌ సిటీగా మార్చవద్దని కోరుతూ ఒక రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. సీపీఎం నిర్వహించిన ఈ సమావేశానికి ఇతర పార్టీల నుంచి పౌర సంఘాల నుంచీ ప్రతినిధులు హాజర య్యారు. వివిధ అంశాల్లో విజయవాడ నగరానికి జరుగుతున్న అన్యాయాలు ఇలాగే కొనసాగితే అది మృత నగరంగా మారే అవకాశం ఉందని వక్తలు హెచ్చరించారు. సమావేశం లేవనెత్తిన అంశాలకు బాధ్యత కలిగిన ప్రభుత్వమైతే సమాధానం చెప్ప వలసిన అవసరం ఉన్నది. విజయవాడ ప్రాంత సాంస్కృతిక– ఆధ్యాత్మిక వైభవాన్ని షోకేస్‌ చేసి నగరాన్ని పర్యాటక పటంలో నిలబెట్టడం ఉత్సవ్‌  లక్ష్యమని నిర్వాహకులు ప్రకటించారు. 

ఈ కార్యక్రమం సందర్భంగా పర్యాటకుల సంఖ్య పెరిగి వ్యాపారం పెరుగుతుందనీ, ఆతిధ్య రంగానికి మేలు జరుగుతుందని ఆటో రిక్షా కార్మికులకు, చేతివృత్తుల కళాకారులకు పని దొరుకుతుందని కూడా వారు చెబుతున్నారు. ఉత్సవ్‌  పేరుతో వారు ఆశిస్తున్న మహత్తర లక్ష్య సాధనే ఇదే. చిల్లర వ్యాపారాలను పెంచుకోవడానికి ఉత్సవాలు చేయ వలసిన అగత్యం నిజానికి విజయవాడ నగరానికి లేదు.వందేళ్లకు పూర్వమే అది అతిపెద్ద టోకు వ్యాపార కేంద్రం.గుంటూరు, తెనాలి, మచిలీపట్నం తదితర సమీప పట్టణాలతో కలిసి తెలుగు సాంస్కృతిక కూడలిగా విలసిల్లిన చరిత్ర ఉన్నది. స్వాతంత్య్ర పోరాటంతో పాటు అనేక అభ్యదయ, హేతువాద ఉద్యమాలకు ఆలంబనగా నిలిచిన ప్రాంతం. ఆంధ్ర రాజకీయ రాజధానిగా మన్నన పొందిన నగరం విజయవాడ. సుదీర్ఘ కాలం పాటు పత్రికారంగానికి ఈ నగరమే పట్టుకొమ్మగా నిల బడింది. ప్రింటింగ్, పబ్లికేషన్‌ రంగాలకు ఇది కేంద్ర స్థానం. 

విజయవాడ నగర ప్రధాన కండబలం దాని లాజిస్టిక్‌రంగం. రెండు జాతీయ రహదారుల (కోల్‌కతా–చెన్నై, పుణె– హైదరాబాద్‌–మచిలీపట్నం) సంగమ స్థలం. దేశంలోని అతి పెద్ద రైల్వే జంక్షన్లలో బెజవాడ జంక్షన్‌ నాలుగవ స్థానంలో ఉన్నది. సగటున రోజుకు లక్షన్నర నుంచి లక్షాఎనభై వేలమంది దాకా ఈ స్టేషన్ గుండా ప్రయాణిస్తారు. మోటార్‌ ట్రాన్స్సపోర్ట్‌కు ఈ నగరం ఒక నాడీకేంద్రం. ఫలితంగా అరవయ్యేళ్ల కిందనే ఆసియా ఖండంలో అతిపెద్దదైన ఆటోనగర్‌ ఏర్పాటైంది. ఒక దశలో లక్ష కుటుంబాలకు కడుపు నింపిన కామధేనువు ఈ ఆటోనగర్‌. ఉమ్మడి రాష్ట్ర లారీ యజమానుల సంఘం కేంద్ర స్థానం విజయవాడలోనే ఉండేది. రాష్ట్ర వ్యాపితంగా దాదాపు మూడు లక్షల లారీల సరకు రవాణాను ఈ సంఘం తన కనుసైగలతో శాసించేది.

ఇటువంటి అనేక ప్రత్యేకతల కారణంగా విజయవాడ నగరంలో ఆతిథ్యరంగం కూడా చాలాకాలం కిందనే అభివృద్ధి చెందింది. కనుక ఇప్పుడు ఉత్సవాలు జరపవలసింది రిటైల్‌ వర్తకాన్ని పెంచడం కోసమో, హోటల్‌ బుకింగ్స్‌ను పెంచడం కోసమో, కార్మికులకు 9 రోజులు పని కల్పించడం కోసమో కాదు. విజయవాడకు కావలసింది మారుతున్న కాలంతో పాటు కలిసి పరిగెత్తడం. అధిక వేతనాలు లభించే ఐటీ, బిజినెస్‌ సర్వీస్‌ రంగాలను పెంపొందించడం. మీడియా, డిజిటల్‌ కంటెంట్‌వంటి సృజనాత్మక పరిశ్రమలకు ఊతమివ్వడం. ఉన్నత విద్య, పరిశోధన, నైపుణ్య శిక్షణలకోసం ఆధునిక విద్యాసంస్థలను వసతులను ఏర్పాటు చేయడం, పటిష్టమైన పునాదులున్న రవాణా రంగాన్ని, సరుకు రావాణా కార్యక్రమాలను ఆధునీ కరించడం, గోడౌన్‌ సదుపాయాలను పెంచడం. 

సమీప గ్రామాల్లో ఇప్పటికే అభివృద్ధి చెందిన వ్యవసాయ రంగానికి దన్నుగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలకు ఊతమివ్వడం, బుడమేరు వరదముప్పును శాçశ్వతంగా పరిష్కరించడం, గుట్టలమీద కాలువ గట్లమీద లక్షలమంది నివసిస్తున్న మురికి వాడలను సౌకర్యవంతంగా మార్చడం, జనాభాకు సరిపడా పార్కులను నెలకొల్పడం వంటి చర్యలు తీసుకోవాలని చిరకాలంగా నిపుణులు సూచిస్తున్నారు.

అమరావతి ప్రాంతాన్ని పరిపాలనా కేంద్రంగా కొనసాగించినప్పటికీ వాణిజ్య, ఆరోగ్య, విద్య, ఆతిధ్య, లాజిస్టిక్స్, ఫుడ్‌ప్రాసెసింగ్‌ తదితర అంశాలను విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం కేంద్రాల్లో అభివృద్ధి చేసినట్లయితే ఈ ప్రాంతమంతా ఆర్గానిక్‌గా అభివృద్ధి చెంది ఒక అంతర్జాతీయ ఆధునిక నగర సమూహం ఏర్పడే అవకాశం ఉంటుంది. అమరావతి కోసం కూటమి ప్రభుత్వం రూపొందించిన నవ నగర సముదాయంలోని గవర్నమెంట్‌ సిటీ, జస్టిస్‌ సిటీలను అక్కడే ఏర్పాటు చేసి మిగిలిన ఫైనాన్స్‌ సిటీ, నాలెడ్జి సిటీ, ఎలక్ట్రానిక్స్‌ సిటీ, హెల్త్‌ సిటీ, స్పోర్ట్స్‌ సిటీ, మీడియా సిటీ, టూరిజం సిటీలను విజయవాడ, గుంటూరు మచిలీపట్నంల మధ్య విభజిస్తే ఆ ప్రతిష్టాత్మక పట్టణాల ఉనికి నిలబడటంతోపాటు ప్రభుత్వానికి భూసమీకరణ భారం కూడా తగ్గుతుందనే అభిప్రాయం బలంగా ఉన్నది.

కూటమి సర్కార్‌ దృష్టి కోణం మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నట్టు కనిపిస్తున్నది. విజయవాడ నగరం ఇప్పటికే పటిష్టంగా ఉన్న లాజిస్టిక్స్‌ రంగంలో కూడా దాన్ని దెబ్బతీయాలనే లక్ష్యం ఇటీవల కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ద్వారా స్పష్టమవుతున్నది. ఎప్పుడో కుతుబ్‌ షాహీ గోల్కొండ ప్రభువుల కాలంలోనే 17వ శతాబ్ది నాటికే హైదరాబాద్‌ –బందరు రహదారి బెజవాడ మీదుగా ఉన్నట్టు ఆధారా లున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అది జాతీయ రహ దారిగా మారింది. పుణె నుంచి బందరు వరకు తూర్పు–పశ్చిమ భారతదేశాలకు వారధిగా ప్రతిష్టాత్మక రహదారిగా పేరుగాంచింది. రద్దీ పెరగడంతో నాలుగు వరుసలుగా, కొన్నిచోట్లఆరు వరుసలుగా విస్తరించారు. ఇప్పుడు రహదారి మొత్తాన్ని ఆరు వరుసలుగా విస్తరించే పనులు కూడా ప్రారంభ మయ్యాయి. ఇది సరిపోదని ఇప్పుడు ఏపీ, తెలంగాణ ముఖ్య మంత్రులు ఒక కొత్త ప్రతిపాదన సిద్ధం చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి స్వప్నసీమ ఫ్యూచర్‌ సిటీ, ఏపీ ముఖ్యమంత్రి కలల నగరం అమరావతి మీదుగా బందరు వరకు గ్రీన్‌ ఫీల్డ్‌ రహదారిని రంగంలోకి దించారు. ఇప్పుడున్న 65వ నెంబర్‌ జాతీయ రహదారిపై అవసరమైనచోట్ల కొన్ని ఫ్లై ఓవర్లు నిర్మిస్తే సరిపోతుందనీ సమాంతరంగా వేలకోట్లు ఖర్చు పెట్టి మరో రహదారి నిర్మాణం అవసరంలేదని రవాణారంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కానీ, రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిష్టాత్మకంగా మారిన రియల్‌ ఎస్టేట్‌ ప్రయోజనమే నెరవేరింది. బందరు పోర్టు నిర్మాణం పూర్తయితే తెలంగాణ రాష్ట్రం ఎగుమతి దిగుమతులకు అధికంగా ఈ పోర్టుమీదనే ఆధారపడే అవకాశముంటుంది. 

హైదరాబాద్‌–బందరు మధ్య సాగే సరుకు రవాణా చెయిన్‌ నుంచి విజయవాడ నిష్క్రమించి అమరావతి చేరుతుంది. లాజిస్టిక్స్‌ మీదనే ఆధారపడి అభివృద్ధి చెందిన ఆటోనగర్‌ ఇప్పటికే కళావిహీనమై కునారిల్లుతున్నది. ఈ దెబ్బతో దాని ఆయువు తీరడం ఖాయం.మరో ముఖ్యమైన ప్రాజెక్టు బుల్లెట్‌ ట్రెయిన్‌ మార్గం. కేంద్ర ప్రభుత్వం మొదటి ప్రతిపాదన ప్రకారం శంషాబాద్‌ నుంచి సూర్యాపేట, ఖమ్మం, విజయవాడ, గుంటూరుల మీదుగా చెన్నయ్‌ వరకు బుల్లెట్‌ ట్రెయిన్‌ రైలు మార్గాన్ని నిర్మించవలసి ఉన్నది. అయితే చంద్రబాబు తిప్పిన చక్రం వేటుకు విజయవాడ తెగిపడింది. 

కొత్తగా ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రతిపాదించిన గ్రీన్‌ఫీల్డ్‌ హైవే పక్క నుంచి అమరావతి మీదుగా చెన్నయ్‌కి వెళ్లే విధంగా రైల్వేశాఖ బుల్లెట్‌ ట్రెయిన్‌ అలైన్‌మెంటును మార్చి వేసింది. దేశంలోనే అతిపెద్ద రైల్వే జంక్షన్లలో ఒకటిగా పేరుగాంచిన విజయవాడకు బుల్లెట్‌ ట్రెయిన్‌ అర్హతలేదా? ఇంత టితో విజయవాడ కష్టాలు తీరిపోలేదు. అమరావతిలో 1,500 ఎకరాల్లో ఒక మహత్తరమైన రైల్వేస్టేషన్‌ నిర్మిస్తారట. అప్పుడు విజయవాడ స్టేషన్‌ పరిస్థితి ఏమవుతుందో ఊహలకే వది లేయాలి. గన్నవరం ఎయిర్‌పోర్టు, తాజా లెక్కల ప్రకారం గడి చిన ఏడాది 14 లక్షలమంది ప్రయాణికులను హ్యాండిల్‌ చేయ గలిగింది. 

విస్తరించిన టెర్మినల్‌ల వల్ల ఈ సామర్థ్యం 35 లక్షల ప్రయాణికులను హ్యాండిల్‌ చేసే స్థాయికి పెరుగుతుంది. ఇప్పుడు సగటున రోజుకు సుమారు 4 వేలమంది గన్నవరం నుంచి ప్రయాణం చేస్తున్నారు. రోజుకు ఇంకో ఆరువేల మంది ప్రయాణం చేసినా హ్యాండిల్‌ చేసే సామర్థ్యాన్ని ఎయిర్‌పోర్టు సంతరించుకున్నది. కానీ ఇది చాలదని అమరావతిలో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టును ప్రతిపాదిస్తున్నారు.విజయవాడ నుంచి ఎయిర్‌పోర్టు కట్, రైల్వేస్టేషన్‌ కట్, విభజన హామీల్లోని మెట్రోరైల్‌ కట్, బందరు రేవు, తెలంగాణ మధ్య రావాణా చెయిన్‌ నుంచి కట్, బుల్లెట్‌ రైలు మార్గంనుంచి కట్‌. ఆధునిక హెల్త్‌కేర్‌ సెంటర్లు అమరావతికే. 

ఉన్నత విద్యాసంస్థలు అమరావతికే. అధిక జీతాలు లభించే ఐటీ బిజినెస్‌ సర్వీస్‌ రంగసంస్థలు ఏవైనా ఏర్పాటయితే అవిఅమరావతికే. విజయవాడ ఎలా ఎదగాలి? అమరావతిలోఅంతర్భాగమే అని చెప్పే కబుర్లు దాన్ని పాతబస్తీలా మార్చకుండా నివారిస్తాయా? హైదరాబాద్‌లో అంతర్భాగమైన యాకుత్‌ పురా, డబీర్‌ పురా, మంగళ్‌ హాట్, ధూల్‌ పేటలు ఏమాత్రం అభివృద్ధి చెందాయి. తల్లిని చంపి బిడ్డను తీసినచందంగా ప్రభుత్వం అమరావతి మీద దృష్టి పెట్టింది.కంటి తుడుపుగా తొమ్మిది రోజులపాటు చిల్లర వ్యాపారం పెరగాలని ‘విజయవాడ ఉత్సవ్‌’ నిర్వహిస్తున్నారు. స్థానిక ఎన్నికల వేళ విజయవాడ–గుంటూరు ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రభుత్వాన్ని నిలదీయకపోతే చారిత్రక తప్పిదం చేసిన వారవుతారు.

విజయవాడలో తాత్కాలిక ‘ఉత్సవాలు’ నిర్వహిస్తూ, నగర అభివృద్ధికి అవసరమైన శాశ్వత ఆధునిక రవాణా,విద్య, ఐటీ ఆధారిత పరిశ్రమల కల్పనను ప్రభుత్వం విస్మరిస్తోంది. ‘కూటమి’ నిర్ణయాల వల్ల... చారిత్రకంగా రవాణా, వ్యాపార కేంద్రంగా ఉన్న విజయవాడ ప్రాధాన్యం తగ్గి, క్రమంగా ఒక ‘మృత నగరం’గా లేదా వెనుకబడిన ప్రాంతంగా మారే అవకాశం ఉంది. 



వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement