శరదృతువు మనుషులకు సుఖప్రదమైన రుతువు. శరదృతువులో వాతావరణం సమశీతలంగా ఉంటుంది. నీలాకాశం మబ్బులు లేకుండా నిర్మలంగా ఉంటుంది. నదీ తటాకాది జలాశయాలలోని నీరు స్వచ్ఛంగా ఉంటుంది. వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. శరదృతువులో జరుపుకోవడం వల్లనే దసరా నవరాత్రులను శరన్నవరాత్రు లని కూడా అంటారు. శరదృతువు తొలిపంటల కోతల కాలం. పంటలు చేతికి అందివచ్చే కాలంలో పండుగలు జరుపుకోవడం మన అనాది సంస్కృతి. పూర్వ పురాణేతిహాస ప్రబంధాది కావ్యాలు దాదాపు ఇవే లక్షణాలను వర్ణించాయి. శరదృతువులోనే దసరా నవరాత్రులు, దీపావళి వంటి పండుగలు, వేడుకలు వస్తాయి.
నడుము వంపుల నొయ్యారి నడకలలర/ నూత్నవస్త్రాల నవరాత్రి నోము వేళ/ గలసి పేరంటమున కేగు కాంతలట్లు/ నదులు ప్రవహించె గజగమనంబు తోడ’ – అని
శరదృతువులోని నదులను పేరంటాలకు గజగమనంతో బయలుదేరే వొయ్యారి పడతులతో పోలుస్తూ ‘ఋతుగానము’ చేశారు ఎ.కృష్ణమాచార్య. అలాగని ఈ గానం నదీగమన గమకాలతోనే ఆగిపోలేదు. ‘తెల్లచీరెగట్టి తెలివెల్గులను గల్గి/ సితకముదము దాల్చు ఋతులతాంగి/ దైవతంబు పాడె ధైవత్యకాంతుల/ సృష్టియెల్ల ముదము
జెందుచుండ’ అంటూ శరత్కాల ప్రకృతి వైభవాన్ని వర్ణిస్తారు.
‘నిర్మలాకాశంపు నీలాటిరేవులో/ పండువెన్నెల నీట పిండి ఆరేసిన/ తెలిమబ్బు వలువలు తేలిపోతున్నాయి/ చిగురు గుబురుల దూరి చిరుగాలి బాలికలు/ రేరాణి పూలపై పారాణి రాచుకొని/ చిక్కని నెత్తావి పుక్కిలిస్తున్నాయి’– ఇది శేషేంద్ర శరద్వర్ణన.
నిజానికి ప్రకృతి సక్రమంగా ఉంటే, శరదృతువు మనుషులకు ఎంతటి ఆహ్లాద ప్రదమైన రుతువు! కాని, కాలం కలసిరానప్పుడు, కానికాలం దాపురించినప్పుడు
ప్రకృతి గతి తప్పుతుంది. ప్రకృతి గతి తప్పడాన్నే వరాహ మిహిరుడు ‘ఉత్పాతం’ అన్నాడు. ‘నరాణామపచారేణ కించిద్ దైవాత్ప పీడ్యతే/ తస్మాత్ ఉత్పాత రూపేణ
ప్రకృతిర్దర్శయేత్ భయమ్’ అని తన ‘బృహత్సంహిత’లో ఉత్పాతాలకు కారణాలను చెప్పాడు.
మనుషులు తప్పుడు పనులు చేయడం వల్ల; ప్రకృతిని నాశనం చేసే పనులు తలపెట్టడం వల్ల; మనుషులను హెచ్చరించడానికి ప్రకృతి ఉత్పాతాల రూపంలో భయాన్ని సృష్టిస్తుందట! ప్రకృతి గతి తప్పినప్పుడు కనిపించే సూచనలను కూడా వరాహమిహిరుడు చెప్పాడు. ‘ఋతూనాం చ విపర్యాస్యః పుష్పపత్రఫలాదిషు/ అకాలే జాయతే యచ్చ తద్విద్యాద్ భయ లక్షణమ్’– అంటే, వృక్షజాతులు అకాలంలోచిగురించడం, పూలు పూయడం, పండ్లు కాయడం వంటివి సంభవిస్తే, ప్రకృతి
గతి తప్పుతున్నట్లు సూచనగా పరిగణించాలి. ఇలాంటి పరిణామాలు భావి ఉత్పాతాలకు సంకేతాలు.
ప్రకృతి గతి తప్పినప్పుడు ‘వైగుణ్యముపపన్నానాం దేశకాలానిలానలమ్/ ఋతూనాం చ విపర్యాసం జనపదోధ్వంసనముపచ్యతే’ అని చెప్పాడు చరకుడు. భూమి, కాలం, గాలి, ఉష్ణం వంటి ప్రకృతి అంశాలు తమ సహజ గుణాలను కోల్పోయి వికృతి చెందినప్పుడు, రుతువులు క్రమం తప్పినప్పుడు ఆ ప్రాంతంలో నివసిస్తున్న జనాలు వ్యాధులు, విపత్తులతో పెద్దసంఖ్యలో నశిస్తారట!
ఈ ఏడాది ప్రకృతి గతి తప్పింది. ‘సూపర్ ఎల్ నినో’ దెబ్బకు శరదృతువు మనుషులకు ఆహ్లాదభరితంగా కాకుండా, అసౌకర్యభరితంగా మారింది. ఆశ్వయుజం మొదలైనా, ఉక్కపోతలు తప్పడం లేదు. గడచిన నూటపాతికేళ్లలో ఇదే అత్యంత వేడిగా ఉన్న అక్టోబర్ నెలగా వాతావరణ శాఖ చెబుతోంది. ప్రకృతి గతి తప్పడంలో పాలకుల పాత్ర కూడా ఉంటుందని చెబుతోంది మహాభారతం.
‘కాలోవా కారణం రాజ్ఞో రాజా వా కాలకారణమ్/ ఇతి తే సంశయో మా భూద్రాజా కాలస్య కారణమ్’– ఇది శాంతిపర్వంలోని శ్లోకం. ‘కాలం రాజును నడిపిస్తుందా? రాజే కాలాన్ని నడిపిస్తాడా? అనే సంశయం వద్దు. రాజు ప్రవర్తనను బట్టే ప్రకృతి అనుకూలించడం గాని, ప్రతికూలించడం గాని జరుగుతుందని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. ఆ లెక్కన ఇప్పుడీ ‘సూపర్ ఎల్ నినో’ వల్ల ప్రస్తుతం ఎదురవుతున్న శరత్తాపానికి కారణాలేమిటో, ఇందులో పాలకుల పాత్ర ఎంతటిదో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు.


