యంత్రం ప్రైవేటుది.. ఖర్చు ప్రభుత్వానిది.. రోగికి పరీక్ష ఉచితం
మహబూబ్‌నగర్ జీజీహెచ్‌లో పైలట్ ప్రాజెక్టు
రెండేళ్లలో అన్ని జీజీహెచ్‌లకు విస్తరణ.. భవిష్యత్‌లో జిల్లాలకు కూడా సేవలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎంఆర్‌ఐ సేవల తీరు మారనుంది. కోట్లాది రూపాయలు వెచ్చించి కొన్న యంత్రాలు మూలకు చేరడం, రోగులు ప్రైవేటు స్కానింగ్ కేంద్రాల చుట్టూ తిరగాల్సి రావడం వంటి పరిస్థితులకు స్వస్తి పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానాన్ని ఎంచుకుంది. ఈ విధానంలో ఎంఆర్‌ఐ యంత్రం ఏర్పాటు, నిర్వహణ బాధ్యత ప్రైవేటు భాగస్వామ్య సంస్థదే.
ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు సూచించిన రోగులకు ఆ సంస్థ పరీక్షలు చేస్తుంది. అందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే ఆ సంస్థకు చెల్లిస్తుంది. రోగిఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. తొలుత మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి, రెండేళ్లలో రాష్ట్రంలోని అన్ని జీజీహెచ్‌లకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భవిష్యత్‌లో అన్ని జిల్లాలకు ఎంఆర్‌ఐ సేవలు అందే అవకాశం ఏర్పడింది.
యంత్రాలున్నా.. దారి ప్రైవేటుకే
ఒక్కో ఎంఆర్‌ఐ యంత్రం కొనుగోలుకు రూ.20 కోట్లకు పైగా ఖర్చవుతుంది. ఇంత భారీ వ్యయంతో గతంలో కొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో యంత్రాలు ఏర్పాటు చేసినా, అవి ఆశించిన స్థాయిలో రోగులకు ఉపయోగపడలేదు. కొన్నిచోట్ల సిబ్బందే యంత్రాలు పనిచేయకుండా చేసి, రోగులను ప్రైవేటు స్కానింగ్ కేంద్రాలకు పంపించారన్న ఆరోపణలు ఉన్నాయి. ’యంత్రం రిపేరులో ఉంది’, ’టెక్నీషియన్ లేరు’ అంటూ రోగులను బయటకు పంపడంతో పేదవారు ప్రైవేటు కేంద్రాల్లో వేల రూపాయలు చెల్లించి పరీక్షలు చేయించుకోవాల్సి వచ్చింది. ఒకవైపు కోట్లు పెట్టి కొన్న యంత్రాలు నిరుపయోగంగా మారి ప్రభుత్వ సొమ్ము వృథా కాగా, మరోవైపు రోగులపై ఆర్థిక భారం పడింది.
ఎనిమిది ఆస్పత్రుల్లోనే సేవలు..
ప్రస్తుతం రాష్ట్రంలో 8 ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రమే ఎంఆర్‌ఐ సేవలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్, ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రితోపాటు వరంగల్ ఎంజీఎం, ఆదిలాబాద్ రిమ్స్, భూపాలపల్లి జీజీహెచ్‌లలో మాత్రమే ఈ సదుపాయం ఉంది. కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ వంటి ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ఎంఆర్‌ఐ లేదు.
దీంతో ఆయా జిల్లాల రోగులు ఒక్క స్కానింగ్ కోసం హైదరాబాద్‌కు రావాల్సి రావడం, లేదంటే స్థానిక ప్రైవేటు కేంద్రాలకు డబ్బులు చెల్లించేవారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు వైద్యులు, ఆరోగ్యశాఖ అధికారులతో కూడిన ప్రత్యేక బృందం ఇతర రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేసింది. తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతున్న పీపీపీ విధానాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
ఈ నేపథ్యంలోనే పీపీపీ విధానంలో ఎంఆర్‌ఐ యంత్రాలను ఏర్పాటు చేయించి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే ప్రతి రోగికి ఉచితంగా వైద్య పరీక్షలు చేయాలని ఆదేశించారు. ప్రస్తుత విధానంతో పోలిస్తే పీపీపీ విధానంలో ప్రభుత్వానికి సుమారు 20 శాతం ఖర్చు తగ్గుతుందని అధికారులు మంత్రికి వివరించారు.
యంత్రాల కొనుగోలుకు ప్రభుత్వం ఒకేసారి కోట్లాది రూపాయలు వెచ్చించాల్సిన అవసరం ఉండదని, నిర్వహణ, మరమ్మతుల బాధ్యత కూడా భాగస్వామ్య సంస్థదే కావడంతో యంత్రాల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలు తొలగిపోతాయని తెలిపారు. రోగులకు నిరంతరం సేవలు అందించవచ్చని పేర్కొన్నారు. యంత్రం పనిచేయకపోతే నష్టం ప్రైవేటు భాగస్వామిదే కావడంతో, యంత్రాలను మూలన పడేసి రోగులను బయటకు పంపే పరిస్థితికి కూడా అడ్డుకట్ట పడనుంది.


