కొత్త పింఛన్లు ఎప్పుడు? | Poor People wait New Cheyutha Pensions in Telangana | Sakshi
Sakshi News home page

కొత్త పింఛన్లు ఎప్పుడు?

Nov 1 2026 6:14 AM | Updated on Nov 1 2026 6:14 AM

Poor People wait New Cheyutha Pensions in Telangana

5,98,193 మంది దరఖాస్తు  

కొత్తగా రెండున్నర లక్షల పింఛన్లు ఇవ్వాలని సర్కార్‌ సూత్రప్రాయ నిర్ణయం 

ఎప్పటి నుంచి ఇస్తారనే దానిపై అధికారుల్లో కొరవడిన స్పష్టత

సాక్షి, హైదరాబాద్‌: కొత్త చేయూత పింఛన్ల కోసం పేదలకు ఎదురుచూపులు తప్పడం లేదు. వివిధ కేటగిరీల వారీగా దాదాపు ఆరులక్షల దరఖాస్తులు అందాయి. మెజారిటీ జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తి కాగా...మళ్లీ రీవెరిఫికేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో మళ్లీ వాటి వడపోతకు మరికొంత సమయం పట్టొచ్చునని తెలుస్తోంది. కొత్తగా రెండున్నర లక్షల పింఛన్లు ఇవ్వాలని సర్కార్‌ సూత్రప్రాయంగా నిర్ణయించగా, మరో లక్ష ,లక్షన్నర దాకా జతచేసి మొత్తం నాలుగు లక్షల దాకా ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. 

అయితే వీటిని ఎప్పటి నుంచి ఇస్తారనే దానిపై పంచాయతీరాజ్‌శాఖ అధికారుల్లో స్పష్టత కొరవడింది. దసరా నాటికి కొత్త పింఛన్లు ఇస్తామంటూ చేసిన ప్రకటనలు ఆచరణకు నోచుకోలేదు. దీంతో మళ్లీ దీపావళి, ఇందిరాగాంధీ జయంతి (నవంబర్‌ 19) దాటితే డిసెంబర్‌ 7న రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ మూడేళ్లపాలన పూర్తవుతున్న సందర్భంగా ఇచ్చే అవకాశాలున్నట్టు ఊహాగానాలు సాగుతున్నాయి. 

కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికల హామీ, మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీ మేరకు పింఛన్ల మొత్తం పెంపుదల లేకపోయినా కనీసం కొత్తవైనా ఇస్తారని ఆశలో పేదలు ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఖజానాకు కటకటగా ఉండడం, తీవ్రవర్షాభావ పరిస్థితులతో దానిపై మరింత ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో కొత్త పింఛన్లు ఇస్తే ప్రతినెలా అదనపు భారం తడిసిమోపెడు అవుతుందని ప్రభుత్వవర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఇస్తున్న చేయూత పింఛన్ల కోసం ఏడాదికి రూ.12,000 కోట్లు (నెలకు రూ.వెయ్యికోట్ల చొప్పున) ఖర్చుచేస్తుండగా...మరో రెండున్నర లక్షల కొత్త పింఛన్లకు మరింత భారం పడనుంది. 

జూన్‌ 2... ఆగస్ట్‌ 15... దసరా... నెరవేరని హామీ  
గత జూన్‌ 2 (2026) నుంచి కొత్త పింఛన్లు ఇవ్వనున్నట్టు గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ప్రథమ ప్రాధాన్యం కింద వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, వృద్ధులకు ఇస్తామని ప్రకటించినా, అది కార్యరూపం దాల్చలేదు. రాష్ట్రంలోని తలసేమియా, సికిల్‌సెల్‌ ఎనీమియా బాధితులందరికీ ఆగస్టు 15 నుంచి పింఛన్లు పంపిణీ చేయాలన్న సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు ఇంకా ఆచరణకు నోచుకోలేదు. 

సీఎం ములుగు జిల్లా పర్యటన సందర్భంగా కొందరు కొత్త లబ్ధిదారులకు ప్రతీకాత్మకంగా పంపిణీ పత్రాలు అందజేశారే తప్ప...రాష్ట్రంలోని వితంతు, ఒంటరి మహిళలు, నేత, గీత కారి్మకులందరికీ సంతృప్తికర స్థాయిలో పింఛన్లు మంజూరు చేయాలని సీఎం ఇచ్చిన మౌఖిక ఆదేశాలు పూర్తిస్థాయిలో అమలు కాలేదు. 

పంద్రాగస్టు నుంచే రెండున్నర లక్షల కొత్త పింఛన్ల పంపిణీకి చర్యలు చేపడుతున్నట్టు గతంలోనే పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క కూడా వెల్లడించారు. ఈ ఆగస్ట్‌ 15 గడువు దాటాక...దసరా నుంచి కొత్త పింఛన్లు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అయితే దసరా పండుగ గడిచి పదిరోజులు దాటినా వీటి మంజూరు విషయంలోఎలాంటి కదలిక కనిపించడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement