చెన్నై: తమిళనాడులో వ్యాపారవేత్త ఆర్. వీరమణి లైంగిక వేధింపుల కేసు కీలక మలుపు తిరిగింది. మైనర్లపై లైంగిక దాడులకు సంబంధించిన కేసుల దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఐదుగురు పోలీసు అధికారులపై అభియోగాలు నమోదు చేసింది. వీరిలో మాజీ గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్ అరుణ్ కూడా ఉండటం తీవ్ర సంచలనం రేపుతోంది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాల్సిన బాధ్యతను విస్మరించడంతో పాటు, కీలక ఆధారాలు మాయమయ్యేలా వ్యవహరించారనే ఆరోపణలు వారిపై ఉన్నాయి.
వీరమణికి సంబంధించిన ఓ అభ్యంతరకర వీడియో పెన్‌డ్రైవ్‌లో అక్టోబర్ 2025లో చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు అందింది. అందులో మైనర్‌పై లైంగిక దాడి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ వీడియో పోలీసులకు అందిన నాలుగు నెలల తర్వాత కేసును మూసివేస్తూ క్లోజర్ రిపోర్టు దాఖలు చేయడం వివాదానికి దారితీసింది. ఈ వ్యవహారంలో పోలీసుల పాత్రపై అనుమానాలు వ్యక్తం కావడంతో సిట్ విచారణ చేపట్టింది. తాజాగా దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో మాజీ పోలీస్ కమిషనర్ అరుణ్‌తో పాటు అసిస్టెంట్ కమిషనర్ ఎం.ఏ. యాస్మిన్ సహా ఐదుగురు పోలీసు అధికారుల పేర్లను చేర్చినట్లు సమాచారం.
పోక్సో చట్టం కింద పోలీసులపైనా చర్యలు!
బాధిత బాలికలపై లైంగిక వేధింపుల విషయం తెలిసినా కేసు నమోదు చేయకపోవడం, ఆధారాలు మాయమయ్యేలా వ్యవహరించడం వంటి ఆరోపణలతో ఐదుగురిపై పోక్సో చట్టంలోని సెక్షన్ 21, భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 199, 238 కింద అభియోగాలు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. ఈ కేసు సెప్టెంబర్ 27న వెలుగులోకి వచ్చింది. షెడ్యూల్డ్ కులానికి చెందిన తన 14 ఏళ్ల కుమార్తెపై వీరమణి లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ తల్లి ఫిర్యాదు చేశారు. వీరమణి డ్రైవర్లు పార్థిబన్, బాబు బాలికను చెన్నైలోని ఆయన నివాసానికి తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో వీరమణి, అతడి ఇద్దరు డ్రైవర్లపై పోక్సో చట్టంతో పాటు భారతీయ న్యాయ సంహిత, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసులు నమోదయ్యాయి.
720 పేజీల ఛార్జిషీట్.. 40 మంది సాక్షులు!
ఈ కేసులో సిట్ బుధవారం స్థానిక కోర్టులో 720 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో వీరమణి, అతడి ఇద్దరు డ్రైవర్ల పేర్లను చేర్చింది. 40 మంది సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా ఛార్జిషీట్ రూపొందించినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో మొత్తం తొమ్మిది మంది బాలికలు, వారి తల్లులు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదుల ఆధారంగా సిట్ మొత్తం ఏడు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఇక, ఈ కేసులో మరో కీలక పరిణామం ఆస్తుల విక్రయాల వ్యవహారం. చెన్నై సమీపంలోని వీరమణికి చెందిన రెండు ఆస్తులను రూ.36.52 కోట్లు, రూ.43.72 కోట్లకు విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. ఫిబ్రవరిలో పోలీసులు క్లోజర్ రిపోర్టు దాఖలు చేసిన సమయంలోనే ఈ లావాదేవీలు జరగడంతో సిట్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ ఆస్తుల విక్రయం వెనుక ఏదైనా కుట్ర ఉందా? వచ్చిన డబ్బును పోలీసులకు లంచాలుగా ఉపయోగించారా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
విదేశాల్లో ఉన్న నిందితుడి కోసం వేట!
ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న వ్యాపారవేత్త ప్రకాశ్ ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్నట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. అతడి పాస్‌పోర్టును స్వాధీనం చేసుకుని, భారత్‌కు రప్పించేందుకు సిట్ చర్యలు చేపడుతోంది. అతడితో పాటు వీరమణి కుమార్తె అర్చన సహా ఐదుగురిపై లుక్‌అవుట్ సర్క్యులర్లు జారీ చేసింది. వీరమణికి సహకరించేందుకు పోలీసు సిబ్బందితో సహా పలువురికి ఆర్థిక లావాదేవీలు జరిపిన వ్యక్తుల్లో ప్రకాశ్ కూడా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా, మైనర్లపై లైంగిక దాడుల ఆరోపణలతో మొదలైన ఈ కేసు.. ఇప్పుడు పోలీసు అధికారుల పాత్ర, కోట్ల రూపాయల ఆస్తుల లావాదేవీలు, బంగారు కడ్డీలు, విదేశాల్లో ఉన్న నిందితుల వరకు విస్తరించింది. సిట్ తదుపరి దర్యాప్తులో ఇంకెన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.
ఇదీ చదవండి: అజిత్ మరణంతో అంతా మారిపోయింది.. సుప్రియా సూలే షాకింగ్ కామెంట్స్


