Photo Credit: Twitter
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఐపీఎల్ స్టార్ ఆటగాళ్లు అదరగొడుతున్నారు. ఆర్సీబీ వికెట్ కీపర్ జితేశ్ శర్మ, లక్నో బ్యాటర్ అబ్దుల్ సమద్‌లు చేజింగ్‌లో మెరిశారు. ఇక హైదరాబాద్ కెప్టెన్ సీవీ మిలింద్ బౌలింగ్‌లో గర్జించాడు. దీంతో వీళ్లంతా ఆయా జట్ల తరఫున అద్భుత ప్రదర్శనలతో మ్యాచ్ హీరోలుగా నిలిచారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌ల్లో ఢిల్లీ, హైదరాబాద్, బరోడా, జమ్మూ కశ్మీర్‌లు థ్రిల్లింగ్ విజయాలు నమోదు చేశాయి.
జితేశ్ జిగేల్..
ఎలైట్ గ్రూప్-ఏలో బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో బరోడా 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ (78) అర్థసెంచరీతో రాణించగా, అభిషేక్ పొరెల్ (29) పర్వాలేదనిపించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన బరోడా జట్టును జితేశ్ శర్మ (29 బంతుల్లో 54) తన మెరుపు ఇన్నింగ్స్‌తో గెలిపించాడు.
Knock of intent 👊 Jitesh Sharma's match-winning 4️⃣7️⃣ runs in Baroda's run-chase ⚡ Scorecard ▶️ https://t.co/y9CuslG5gu #SMAT | @mflone_ https://t.co/Ud4syqyTj5
— BCCI Domestic (@BCCIdomestic) November 20, 2026
తేజస్వీ ఫటాఫట్
ఎలైట్ గ్రూప్-బిలో హర్యానాతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు 43 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. తేజస్వీ దహియా (36 బంతుల్లో 95; 6 ఫోర్లు, 9 సిక్సర్లు) హర్యానా బౌలర్లను ఊచకోత కోయగా, కెప్టెన్ ప్రియాన్ష్ ఆర్య (40 బంతుల్లో 62) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం హర్యానా 20 ఓవరల్లో 8 వికెట్ల నష్టానికి 189 పరుగులకు పరిమితమై ఓటమి చవిచూసింది.
Career-best knock of 9️⃣5️⃣(36) 💪 Delhi's Tejasvi Dahiya looked flawless against Haryana 🙌 Scorecard ▶️ https://t.co/xi3st8tC9t #SMAT | @mflone_ https://t.co/0Flfrn2BSB
— BCCI Domestic (@BCCIdomestic) November 22, 2026
అబ్దుల్ సమద్ మెరుపులు
ఎలైట్ గ్రూప్-బిలో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో జమ్మూ కశ్మీర్ 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జమ్మూ కశ్మీర్ అబ్దుల్ సమద్ (27 బంతుల్లో 64 నాటౌట్) మెరుపులతో 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. అంతకముందు పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఓపెనర్ విహాన్ మల్హోత్రా (59 బంతుల్లో 85 నాటౌట్), కెప్టెన్ రమణ్‌దీప్ సింగ్ (27 బంతుల్లో 50 నాటౌట్) అజేయ అర్థశతకాలతో మెరిశారు.
గర్జించిన సీవీ మిలింద్
ఎలైట్ గ్రూప్-డిలో ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఉత్తరాఖండ్.. హైదరాబాద్ కెప్టెన్ సీవీ మిలింద్ (4-25) ధాటికి 19.2 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. అనంతరం హైదరాబాద్ 15.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసి విజయాన్ని సాధించింది. కొడిమెల హిమతేజ (40 బంతుల్లో 77) భారీ అర్థశతకంతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ఇదీ చదవండి: IND Vs PAK: రిఫరీ తప్పిదం.. టాస్ విషయంలో పాక్ రాద్ధాంతం!


