AI ద్వారా సృష్టించబడిన ఫోటో
హైదరాబాద్: కుటుంబ సభ్యుల మధ్య వివాదం నేపథ్యంలో మరిది తనను బెదిరించడమే కాకుండా చేతులు, కాళ్లపై కొరికినట్లు మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్‌కు చెందిన విజయ్‌కుమార్, సౌమ్య భార్యాభర్తలు. విజయ్‌కుమార్ ఉద్యోగం చేయకుండా భార్య బంగారు ఆభరణాలు, ఆస్తి పత్రాలు తీసుకోవడంతో పాటు ఆమె పేరు మీద రుణాలు తీసుకుని ఆర్థికంగా ఇబ్బందులు గురిచేస్తున్నాడు.
ఈ నేపథ్యంలో ఈ నెల 20న కుటుంబసభ్యుల మధ్య వివాదం జరగగా.. మరిది సురేష్ కుమార్ తనను బెదిరించడంతో పాటు చేతులు, కాళ్లపై కొరికాడని, చంపుతామంటూ బెదిరించారని బాధితురాలు సౌమ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తాళిబోట్టును సైతం రుణం కోసం వినియోగించారని, ఆస్తి పత్రాలను దాచిపెట్టి డబ్బుల కోసం వేధిస్తున్నారని ఆరోపించారు. విడాకులు ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. కాగా.. కుటుంబ వివాదంలో తనపైనా దాడి చేశారంటూ సురేష్ కుమార్ సైతం సౌమ్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరస్పర ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు కేసులు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.


