వీసీ లైంగికంగా వేధించారు | Sexual Harassment Complaint Filed Against Telangana Agriculture University Vice-Chancellor | Sakshi
Sakshi News home page

వీసీ లైంగికంగా వేధించారు

Nov 8 2026 5:21 AM | Updated on Nov 8 2026 5:20 AM

Sexual Harassment Complaint Filed Against Telangana Agriculture University Vice-Chancellor

అల్దాస్‌ జానయ్యపై ఏజీ వర్సిటీ మహిళా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆరోపణ 

ఆయనకు లొంగనందుకు వేరే చోటుకు బదిలీ చేశారని వ్యాఖ్య 

న్యాయం జరిగే వరకు విడిచిపెట్టేది లేదని స్పష్టికరణ

ఏజీ వర్సిటీ/లక్డీకాపూల్‌/సాక్షి, హైదరాబాద్‌: ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఏయూ) వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ అల్దాస్‌ జానయ్య తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆ వర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ముసిని తేజశ్రీ ఆరోపించారు. తనకు లొంగకపోతే కెరీర్‌ నాశనం చేస్తానని బెదిరించారని... ఆ తర్వాత తనను వేరే చోటుకు బదిలీ చేశారని ఆరోపణలు గుప్పించారు. శనివారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘నేను ఇదే విశ్వవిద్యాలయంలో చదువుకున్నాను.

2014 నుంచి ఇదే విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉద్యోగం చేస్తున్నాను. వీసీని తండ్రిలా భావించి వ్యక్తిగత విషయాలైనా, ఏ ఇబ్బందులున్నా ఆయన దృష్టికి తీసుకెళ్లేదాన్ని. కానీ ఆయన ఇలాంటి నీచుడని తెలియదు. గత కొంతకాలంగా చెప్పుకోలేని రీతిలో లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ వేధింపులతో విసిగిపోయాను. ఇక తప్పదని నిర్ణయించుకొని విమెన్‌ వింగ్, డీజీపీ, గవర్నర్‌లకు ఫిర్యాదు చేశాను. అయినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు.

పైగా నా ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని కొందరు మధ్యవర్తులు అడుగుతున్నారు. నాకు నాయ్యం జరిగే వరకు ఈ విషయాన్ని విడిచిపెట్టేది లేదు. నాతోపాటు విశ్వవిద్యాలయంలో ఇంకా చాలా మంది వీసీ బాధితులున్నారు. వారు కూడా బయటకు వస్తారు. వీసీకి శిక్ష పడాలి’అని తేజశ్రీ డిమాండ్‌ చేశారు. మరోవైపు వీసీని వెంటనే బర్తరఫ్‌ చేసి బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ శనివారం తెలంగాణ సైంటిస్ట్స్‌ అసోసియేషన్, విశ్వవిద్యాలయ టీచింగ్, నాన్‌ టీచింగ్, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసనకారులు వర్సిటీ ప్రాంగణంలో ధర్నా చేశారు.

అక్కడి నుంచి ర్యాలీగా వీసీ భవన్‌కు వెళ్లి అక్కడ బైఠాయించారు. కాగా, వీసీ జానయ్యకు మద్దతుగా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ శంకర్, భార్గవి, శ్రీనివాస్‌ యాదవ్, మాధవీలత తదితరులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరగాలని.. నిరాధార ఆరోపణలు ఎవరు చేస్తున్నారో బహిర్గతం కావాలన్నారు. ఆమెకు ఒక మహిళా ప్రొఫెసర్‌ ప్రోత్సాహం ఉందని ఆరోపించారు. కృషి విజ్ఞాన కేంద్రాల్లో పనిచేస్తున్న 100–120 మంది కాంట్రాక్టు ఉద్యోగుల నుంచి ఉద్యోగాల క్రమబదీ్ధకరణ పేరుతో వీసీ అల్దాస్‌ జానయ్య సుమారు రూ.70 లక్షలు వసూలు చేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి.


వీసీ భవన్‌ ముందు బైఠాయించిన బాధితురాలు, ఉద్యోగస్తులు    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement