రైతు ‘తేమ’ కష్టాలకు చెక్‌! | Minister Uttam Kumar Reddy chaired a review meeting with civil supplies officials | Sakshi
Sakshi News home page

రైతు ‘తేమ’ కష్టాలకు చెక్‌!

Nov 8 2026 4:39 AM | Updated on Nov 8 2026 4:39 AM

Minister Uttam Kumar Reddy chaired a review meeting with civil supplies officials

సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్‌

ధాన్యం నిల్వకు భారీగా సైలోలు..రాష్ట్రవ్యాప్తంగా తొలుత 20 ప్రాంతాల్లో ఆధునిక గోదాములు 

అధికారులతో సమీక్ష నిర్వహించిన పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: పంట చేతికొచ్చిన వెంటనే అమ్ముకోవాల్సిన దుస్థితి నుంచి రైతులను గట్టెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతోంది. ధాన్యం నిల్వ, ఆరబెట్టే ప్రక్రియలో ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు భారీగా సైలోల(వర్టీకల్‌ టవర్స్‌) నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా తొలుత 20 ప్రాంతాల్లో ఆధునిక నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ప్రభుత్వ సంస్థ ద్వారానే కాకుండా ప్రైవేటు భాగస్వామ్యంతోనూ వీటిని నిర్మించేలా రెండు విధానాలను పరిశీలిస్తోంది. ప్రైవేటు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు పౌరసరఫరాల సంస్థ అద్దె హామీ ఇవ్వనుంది.

ఈ విధానం అమల్లోకి వస్తే రైతులు పంట కోత తర్వాత వెంటనే తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవాల్సిన అవసరముండదు. మార్కెట్‌లో మంచి ధర వచి్చనప్పుడు విక్రయించుకునే వెసులుబాటు కలుగుతుంది. ఈ మేరకు శనివారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో ఆధునిక సైలోల ఏర్పాటుకు రెండు ప్రతిపాదనలను మంత్రి పరిశీలించారు. మొదటి విధానంలో తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ (టీఎస్‌సీఎస్‌సీ) ప్రముఖ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు సమీకరించి భారీ స్థాయిలో సైలోలను నేరుగా నిర్మించనుంది.

రెండో విధానంలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. నిర్మాణ వ్యయం, రుణాల సమీకరణ, అద్దె హామీలకు సంబంధించిన ఆర్థిక అంశాలపై త్వరగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం 25 శాతం తేమతో ఉన్న ధాన్యం క్వింటాల్‌కు రూ.3,500–4,500 పలుకుతుండగా, శాస్త్రీయ పద్ధతుల్లో ఆరబెట్టి తేమను 12 శాతానికి తగ్గిస్తే రూ.5,000–5,500 వరకు ధర లభించే అవకాశం ఉందని మంత్రి వివరించారు.

మరోవైపు తెలంగాణ దేశంలోనే ప్రముఖ వరి ఉత్పత్తి రాష్ట్రాల్లో ఒకటిగా ఎదిగిందని, ఖరీఫ్, రబీ రెండు సీజన్లలోనూ రాష్ట్రంలో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే వరి పంటకు ఆధునిక నిల్వ, నాణ్యత పరిరక్షణ సౌకర్యాలు కల్పించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచవచ్చని, సంప్రదాయ నిల్వ విధానాల నుంచి శాస్త్రీయ పద్ధతుల వైపు మారాల్సిన అవసరం ఉందన్నారు. సమీక్షలో పౌరసరఫరాల కమిషనర్‌ ఎం.స్టీఫెన్‌ రవీంద్ర, అదనపు డైరెక్టర్‌ రోహిత్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement