స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌తో కలిసి రైతు మేళాను ప్రారంభిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో తుమ్మల, దామోదర, శ్రీధర్‌బాబు, మల్లు రవి, మనోహర్‌రెడ్డి, కాలె యాదయ్య, రామ్మోహన్‌రెడ్డి తదితరులు
కరువును కలిసికట్టుగా ఎదుర్కొందాం.. రైతులకు సీఎం రేవంత్ పిలుపు
ప్రాజెక్టులన్నీ ఖాళీ అయ్యాయి.. సాగుకే కాదు.. తాగడానికీ నీళ్లు లేవు
కరువు మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదముంది
సంక్రాంతి తర్వాత ప్రజా బలం కార్యక్రమంతో ప్రతీ గ్రామానికి వచ్చి అందరినీ కలుస్తా..
పదేళ్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నా పాలమూరులో ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేదు
పదేళ్ల పాలనలో లక్ష కోట్లు లూటీ చేశారు...
పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు నన్ను చూసి కేటీఆర్ గడ్డం పెంచుతుండు
ఆ కుటుంబాన్ని తెలంగాణ నుంచి బహిష్కరించాలి
హకీంపేట రైతులతో సీఎం ముఖాముఖి
వికారాబాద్: ‘ఎల్‌నినో ప్రభావంతో ప్రాజెక్టులు, చెరువులు ఇప్పటికే అడుగంటుతున్నాయి. జూలై వరకు వర్షాలుండవు. కరువు మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదముంది. ప్రాజెక్టులు ఖాళీ అవుతున్నాయి. ఉన్న నీళ్లు తాగునీటి అవసరాలకే సరిపోవు. వరి పంట జోలికి పోయి నష్టపోవద్దు. నీరు తక్కువ అవసరమయ్యే ఆరుతడి పంటలే వేసుకోవాలి. స్ప్రింక్లర్లు, డ్రిప్పులతో నీరుపారించాలి. ప్రభుత్వం మీ మేలు కోరుతోంది. మీకు అండగా నిలవాలనుకుంటోంది.
మీ మేలు కోరే సోదరుడిగా చెబుతున్నా జాగ్రత్తగా ఆలోచించి పంటలు వేయండి సంక్రాంతి తర్వాత ప్రజా బలం కార్యక్రమంతో ప్రతీ గ్రామానికి వచ్చి అందరినీ కలుస్తా.. కరువును మనమందరం కలిసికట్టుగా ఎదుర్కొందాం. బావ, బామ్మర్దులు చెప్పే మాటలు వింటే మన్ను పోసి అంబలి కాచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని హకీంపేట శివారులో ఏర్పాటు చేసిన మెగా రైతు మేళా ఇండ్రస్టియల్ ఎక్స్‌పో కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
రేవంత్‌రెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులు దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వర్‌రావ్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, వాకిటి శ్రీహరితో కలిసి రైతు మేళాను ప్రారంభించారు. అనంతరం సీఎం ఆదర్శ రైతులు, రైతు శాస్త్రవేత్తలతో ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడారు. అంతకుముందు ఆరుతడి పంటలు సాగు చేస్తూ తాము సాధించిన ప్రగతి, లాభాల గురించి రైతులు తమ అనుభవాలు వివరించారు.
కేసీఆర్ పాలమూరుకు చేసిందేం లేదు..
‘బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా సేవలందించారు.. ఆ తర్వాత పాలమూరుకు వివిధ అవకాశాలు దక్కినా జిల్లా అభివృద్ధిలో ముందుకెళ్లలేదు. జిల్లా వాసులు ఐదారు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచినా మంత్రులుగా సముచిత స్థానం దక్కలేదు. తెలంగాణ వస్తే పాలమూరు అభివృద్ధి చెందుతుందని ఆనాడు విఠల్‌రావును కాదని 2009లో ప్రజలు కేసీఆర్‌ను పార్లమెంటుకు పంపారు. కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, మక్తల్, కొడంగల్, నారాయణ్‌పేట్ ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తవుతాయని అంతా అనుకున్నారు. పదేళ్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగినా పాలమూరు జిల్లాలో ఏ ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేదు. కేసీఆర్ ఈ ప్రాంత ప్రజలకు సాగునీరు, తాగు నీరు అందించాలన్న ఆలోచన చేయలేదు. 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఉంటే ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేవి’ అని రేవంత్‌రెడ్డి చెప్పారు.
ప్రాణహితను పక్కన పెట్టి కాళేశ్వరం తెచ్చారు...
‘కేంద్రం జాతీయ హోదా ఇస్తామన్నా లెక్కచేయక ప్రాణహిత ప్రాజెక్టును పక్కనపెట్టి కాళేశ్వరం కట్టించారు. రూ.30 వేల కోట్లతో పూర్తవుతుందని నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రాణహిత చేవెళ్ల ప్రారంభించి సగం పనులు పూర్తి చేశాక మీరు పేరు, ఊరు మార్చి అంచనాలు మార్చారు. ప్రాజెక్టుకు లక్షన్నర కోట్లు తగలేసి నిండా ముంచారు. కాళేశ్వరం అవకతవకలపై మేం సీబీఐ విచారణకు ఆదేశిస్తే ఢిల్లీకి వెళ్లి మోదీ ముందు మోకరిల్లి సీబీఐ విచారణ జాప్యం చేయాలని కోరింది మీరు కాదా? ఆనాడు హరీశ్‌రావు తనను కాళేశ్వరరావు అని పొగిడించుకున్నారు.
ఇప్పుడు మేడిగడ్డ పేరెత్తితే ఎందుకు భయపడుతున్నారు. కన్నెపల్లి పంపులను ఆన్ చేసి నీళ్లు ఎత్తితే నీళ్లు పారుతాయనుకుంటే మేడిగడ్డ ఎందుకు కట్టారు..? మూడు పంపులు ఏకకాలంలో పనిచేసినప్పుడే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుతది.. ఆ మాత్రం జ్ఞానం లేదా’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
స్పీకర్ గారూ.. చర్చకు అనుమతివ్వండి...
‘ఈ వేదికగా స్పీకర్ గారిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా.. డిసెంబర్‌లో ఎల్ నినో, కాళేశ్వరం, గోదావరి జలాలపై రెండు మూడు రోజుల చర్చకు అనుమతివ్వండి.. కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులను మొత్తం తెచ్చుకొని నిజాలు బయటపెట్టి తాట తీస్తాం. పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కొడంగల్‌కు ఏం చేశారు? కృష్ణా రైల్వే లైన్‌ను అడ్డుకున్నది మీరు కాదా? సిమెంటు ఫ్యాక్టరీలు రాకుండా అడ్డుకున్నది ఈ ప్రాంత ప్రజలకు తెలియదా..? మా ప్రభుత్వం ఏర్పడ్డాక మక్తల్ నారాయణపేట ఎత్తిపోత పనులు వేగంగా జరుగుతున్నాయి.
కొడంగల్ బాగుపడుతుందని కడుపునిండా విషం పెట్టుకుని అవినీతి జరిగిందని విషం చిమ్ముతున్నారు. ఢిల్లీ నుంచి నోయిడా, ముంబై నుంచి పుణే వరకు ఎలాంటి అభివృద్ధి జరిగిందో.. హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుంచి లగచర్ల ఇండస్ట్రియల్ పార్క్ వరకు అభివృద్ధి చేసి దేశానికే మోడల్‌గా తీర్చిదిద్దుతాం. కొడంగల్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చి దిద్దుతున్నాం. రేర్ ఎడ్యుకేషన్ హబ్, రేర్ ఇండ్రస్టియల్ పార్కులను అభివృద్ధి చేసుకుందాం. రూ.10 వేల కోట్లతో మరిన్ని అభివృద్ధి పనులను ప్రారంభించుకోబోతున్నాం’ అని సీఎం రేవంత్ చెప్పారు.
ప్రజలు మిమ్మల్ని నమ్మరు..
‘నాకు ప్రజల అభిమానం ఉందని నన్ను చూసి ఒకాయన గడ్డం పెంచుకున్నాడట.. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే నక్క పులి కాదు.. గడ్డం పెంచుకున్నంత మాత్రాన నువ్వు రేవంత్ రెడ్డి కాలేవు.. పది జన్మలు ఎత్తినా నువ్వు కేటీఆర్ అవుతావు తప్ప రేవంత్ రెడ్డివి కాలేవు.. రేవంత్ రెడ్డి కావాలంటే కార్యకర్తల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకునే ధైర్యం ఉండాలి.. పిడుగులు మీదపడ్డా నమ్మినవాడి కోసం నిలబడే తెగువ ఉండాలి. ఆయనకు గడ్డం రావడానికి 50 ఏళ్లు పట్టింది.. బుద్ధి రావడానికి ఎన్నేళ్లు పడుతుందో. వేషాలు మార్చి.. భాష మార్చినా బుద్ధిరానంత వరకు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మరు. కల్ల»ొల్లి మాటలతో విషం కక్కుతున్న ఆ కుటుంబాన్ని రాష్ట్రం నుంచి బహిష్కరిస్తేనే తెలంగాణ బాగుపడుతుంది’ అని రేవంత్ అన్నారు.
రాష్ట్రాన్ని మొదటి వరుసలో నిలిపాం: స్పీకర్
రైతులకోసం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వమని స్పీకర్ ప్రసాద్‌కుమార్ పేర్కొన్నారు. రైతుల ఆదాయం పెంచి తెలంగాణను దేశంలోనే మొదటి వరుసలో నిలిపే దశగా పనులు సాగుతున్నాయన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావ్ మాట్లాడుతూ అస్తవ్యస్తం, నిరీ్వర్యం, నిర్లక్ష్యం చేసిన తెలంగాణాను ఇప్పుడు గాడిలో పెడుతుంటే ఓర్వలేక నాశనం చేసిన వాళ్లే ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం వ్యవసాయానికి అధునాతన సాంకేతికతను అద్దుతోందని తెలిపారు. కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, యాదయ్య, కలెక్టర్ దీపక్‌తివారి తదితరులు పాల్గొన్నారు.
స్థానిక యువతకు ఉపాధే లక్ష్యం: పారిశ్రామికవేత్తలతో ముఖాముఖిలో సీఎం రేవంత్‌రెడ్డి
దౌల్తాబాద్: కొడంగల్ ప్రాంతాన్ని పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలకు కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకుసాగుతోంది. ఇందులో భాగంగా రేర్ (రూరల్ అగ్రికల్చర్ రీజినల్ ఎకానమీ) ఇండ్రస్టియల్ హబ్‌ను ఏర్పాటు చేస్తోంది. శనివారం దుద్యాల మండలం హకీంపేట గ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ హైదరాబాద్ వంటి పెద్ద నగరాలకే కాకుండా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు విస్తరిస్తూ స్థానిక యువతకు తమ ప్రాంతంలోనే ఉపాధి అవకాశాలు కలిగించడమే లక్ష్యమన్నారు.
కొడంగల్ రేర్ ఇండ్రస్టియల్ హబ్‌లో 943.34 ఎకరాల విస్తీర్ణంలో వివిధ రంగాలకు చెందిన పరిశ్రమలను ఆకర్షించేలా ప్రణాళిక రూపొందించారు. రేడియల్ రోడ్డు వెంట పారిశ్రామిక హబ్ ఉండటంతో పరిశ్రమలకు రవాణా సౌలభ్యం కలుగుతుందని అధికారులు సీఎంకు వివరించారు. హబ్ సేకరణకు రూ.220 కోట్లు వ్యయం కాగా, రోడ్లు, నీరు, విద్యుతు వంటి మౌలిక వసతులను అభివృద్ధి చేయడానికి రూ.441.91కోట్లు వ్యయ ప్రణాళికలు తయారు చేసినట్లు వివరించారు.
బిర్లా లిమిటెడ్ సంస్థకు సంబంధించిన ఫైబర్ సిమెంట్ బోర్డుల తయారీ పరిశ్రమ, ఎకోఫామ్ అయిల్ అండ్ ఫ్యాట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన వెజిటబుల్ ఆయిల్, వ్యవసాయ పరిశోధన అభివృద్ధి కార్యకలాపాల కోసం 96 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ రెండు సంస్థల ప్రతిపాదిత పెట్టుబడులు కలిపి రూ.252.86 కోట్లు. వీటితో సుమారు 535 ఉద్యోగ అవకాశాలు రానున్నట్లు అధికారులు వివరించారు. అనంతరం రేడియల్ సమీపంలో ఏర్పాటు చేస్తున్న కొడంగల్ రేర్, ఇండ్రస్టియల్ హబ్, నెట్‌వర్క్ అపరెల్ రెడీనెస్ ఇన్‌ఫాస్ట్రక్చర్ పార్క్, రైస్ (రీజినల్ ఇండస్ట్రీస్ అండ్ స్మాల్ ఎంటర్ ప్రైజెస్)ను వర్చువల్‌గా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు, తుమ్మలనాగేశ్వర్‌రావు, దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.


