చంద్రబాబు డ్రామాలు ఫుల్‌.. కరువు సాయం నిల్‌ | Chandrababu Naidus coalition government will not provide drought relief in AP | Sakshi
Sakshi News home page

చంద్రబాబు డ్రామాలు ఫుల్‌.. కరువు సాయం నిల్‌

Nov 8 2026 4:05 AM | Updated on Nov 8 2026 4:05 AM

Chandrababu Naidus coalition government will not provide drought relief in AP

ఒక్కో రైతుకు కర్ణాటకలో రూ.2,500, మహారాష్ట్రలో రూ.5 వేలు, గుజరాత్‌లో రూ.8,500 చొప్పున కరువు సాయం 

కర్ణాటకలో ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమచేసిన ప్రభుత్వం 

మిగిలిన రాష్ట్రాల్లోనూ పంపిణీకి సన్నాహాలు

ఏపీలో కరువు సాయం ఊసెత్తని చంద్రబాబు కూటమి ప్రభుత్వం 

మొక్కుబడిగా పంటనష్టం అంచనాలు

20 సార్లు విపత్తులు వచ్చినా పైసా పంట నష్టపరిహారం ఇవ్వని చంద్రబాబు సర్కార్‌ 

ఉచిత పంటల బీమాను అటకెక్కించడంతో బీమా పరిహారం కూడా దక్కలేదు 

తమను ఆదుకోకపోవడంపై  కూటమి నేతల్ని నిలదీస్తున్న రైతులు

సాక్షి, అమరావతి: తుపాన్లను అడ్డుకున్నా.. సునామీలకు ఎదురొడ్డినా.. ఆర్టీజీఎస్‌ ద్వారా తుపాను గమనాన్ని కచ్చితంగా అంచనా వేసి ఆ మేరకు పంట, ప్రాణనష్టాలు జరగకుండా అడ్డుకోగలిగా.. అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తరచు చెబుతూనే ఉంటారు. డ్రామాలాడడంలో తనను మించినవారు లేరని చంద్రబాబు నిరూపించుకుంటూనే ఉంటారు. కానీ విపత్తులతో నష్టపోయిన అన్నదాతలకు సాయం చేయడానికి మాత్రం ఆయనకు మనసు రాదు. తుపాన్లు, కరువు కబుర్లతో కాలక్షేపం చేయడం తప్ప ఒక్క రైతుకు కూడా పైసా కరువు సాయం చేయలేదు. 

ఉదారంగా కరువు సాయం ప్రకటిస్తున్న రాష్ట్రాలు 
ఖరీఫ్‌ సీజన్‌లో నమోదైన లోటు వర్షపాతం గుజరాత్‌లో 11 శాతం, తెలంగాణలో 18, మహారాష్ట్రలో 19, హరియాణలో 25, కర్ణాటకలో 30 శాతంగా ఉండగా ఏపీలో మాత్రం ఏకంగా 52.48 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కరువు మండలాలను ప్రకటించడమేగాక బాధిత రైతులను ఆదుకునేందుకు ఉదారంగా ముందుకొచ్చాయి. కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే ఒక్కో రైతు ఖాతాలో రూ.2,500 వంతున మొత్తం రూ.1,250 కోట్లు జమచేసింది. ఒక్కో రైతుకు రూ.5 వేలు కరువుసాయం ప్రకటించిన మహారాష్ట్ర ఇందుకోసం రూ.7,500 కోట్లు మంజూరు చేసింది. 

గుజరాత్‌లో హెక్టార్‌కు రూ.8,500 చొప్పున కరువు సాయం ప్రకటించారు. దీపావళికి ముందుగానే ఈసాయాన్ని అందించేందుకు ఆయా రాష్ట్రాలు ఏర్పాట్లు చేశాయి. మిగిలిన రాష్ట్రాలు కూడా రైతుల్ని ఆదుకునేందుకు రూ.వేలకోట్లు మంజూరు చేస్తున్నాయి. రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు కరువు మండలాలను ప్రకటించడమేగాక కరువు ప్యాకేజీలు కూడా ప్రకటించి రైతులను ఆదుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. రాజస్థాన్‌ రాష్ట్ర ప్రభుత్వం సాధారణ వర్షపాతం కంటే 22 శాతం తక్కువ వర్షపాతం నమోదైన 14 జిల్లాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించి కరువు సహాయక చర్యలకు ఉపక్రమించింది.

సబ్సిడీపై కిలో రూ.2కే పశుగ్రాసం  
గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి సబ్సిడీపై కిలో పశుగ్రాసాన్ని రూ.2కే సరఫరా చేయాలని, కరువు ప్రభావిత ప్రాంతాల్లో నవంబర్‌ 1వ తేదీ నుంచి 150 రోజుల ఉపాధి కల్పిస్తోంది. పశువుల సంరక్షణకు గోశాలలకు ఒక్కో పశువుకు రోజుకు రూ.80 చొప్పున ఆర్థికసాయం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కరువు ప్రభావిత ప్రాంతాల్లో రుణ వసూళ్ల పేరిట రైతులను వేధించవద్దని మహారాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులను ఆదేశించింది.

ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే కేంద్రబృందాలు పర్యటించి కేంద్రానికి కరువు నివేదికలు పంపాయి. ముఖ్యమంత్రుల సారథ్యంలో బృందాలు వెళ్లి కరువు సాయం కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఇలా పొరుగు రాష్ట్రాల్లో కరువును అధికారికంగా గుర్తించి సహాయక చర్యలకు కార్యాచరణ రూపొందిస్తుంటే.. ఏపీలో మాత్రం ఇందుకు భిన్నంగా చంద్రబాబు ప్రభుత్వం రైతులను గాలికొదిలేసి కరువు కబుర్లు చెబుతూ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడింది.

రైతులను పట్టించుకోని చంద్రబాబు 
కరువు తీవ్రత అధికంగా ఉన్న ఏపీలో మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వాకంతో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. సీజన్‌ ఆరంభం నుంచి సమీక్షలకు ఇస్తున్న ప్రాధాన్యత రైతులను ఆదుకునే విషయంలో ఇవ్వడంలేదు. రాష్ట్రంలో ఖరీఫ్‌లో సాధారణం కంటే ఈ ఏడాది దాదాపు 12 లక్షల ఎకరాల్లో సేద్యమే చేయలేదు. 13.15 శాతం మేర వరినాట్లు పడలేదు. గతేడాదితో పోలిస్తే ధాన్యం ఉత్పత్తి 29.7 శాతం, మొక్కజొన్న 61.9, జొన్న 69.2, చిరుధాన్యాల ఉత్పత్తి 37.8 శాతం తగ్గుతాయని లెక్కతేల్చారు. 

రాష్ట్రంలోని 688 మండలాల్లో 550 మండలాలు కరువు కోరల్లో చిక్కుకున్నాయని తొలుత ప్రకటించిన ప్రభుత్వం.. చివరకు సీజన్‌ ముగిసిన తర్వాత 388 మండలాలకే పరిమితం చేసింది. తాజాగా మరో 24 మండలాలను ప్రకటించింది. కానీ కరువు సాయం ఊసెత్తడం లేదు. కరువు తీవ్రతను కేంద్రానికి వివరించి ఎన్డీఆర్‌ఎఫ్‌ నిధులు రాబట్టాన్సిన ప్రభుత్వం ఆ దిశగా కనీసం ఆలోచించడంలేదు. ఇటీవల పాలనలో పాతికేళ్లు.. అంటూ ప్రధాని మోదీ భజన చేయడానికి ఢిల్లీ వరకు వెళ్లిన చంద్రబాబుగానీ, రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులుగానీ కరువు సాయం గురించి మాత్రం ఆయన్ని అడగలేదు.

మరోవైపు సీజన్‌ ముగిసిన తర్వాత మొక్కుబడిగా పంటనష్టం అంచనాలు రూపొందించి ఆ నివేదికను సైతం పక్కన పడేశారు. మరోవైపు ఉచితపంటల బీమా పథకాన్ని అటకెక్కించి పైసా బీమా పరిహారం కూడా అందకుండా చేసిన ఘనత కూడా చంద్రబాబుదే. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 20కి పైగా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే ఒక్క కృష్ణా వరద సాయం తప్ప మరో విపత్తుకు పైసా పరిహారం ఇవ్వలేదు. గతేడాది విరుచుకుపడిన మొంథా తుపాను సాయం నేటికీ జమచేయలేదు. దీంతో  కరువు సాయం ఏది బాబూ.. అంటూ టీడీపీ కూటమి పార్టీ నేతలను రైతులు నిలదీస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement