రెండున్నరేళ్ల పాలనపై వ్యతిరేకతను ప్రతిబింబించిన ‘స్థానిక’ ఓటు
పోస్టల్ బ్యాలెట్లలో ఉద్యోగుల అసంతృప్తి
ఐఆర్, పీఆర్సీ లేవు.. ఐదు డీఏలు పెండింగ్
రూ.40 వేల కోట్ల బకాయిలు ఇవ్వడం లేదని ఆగ్రహం
భారీ సంఖ్యలో చెల్లని ఓట్లు.. బ్యాలెట్ పెట్టెల్లో గ్రామ సమస్యల కరపత్రాలు
ప్రతిపక్ష అభ్యర్థుల విజయాలను అడ్డుకునేందుకు రీకౌంటింగ్ కుట్రలు
అమలుకాని వాగ్దానాలతో చంద్రబాబు సర్కార్‌పై ప్రజల్లో అసంతృప్తి
నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకే పెన్షన్, ఆడబిడ్డ నిధి, విద్యా దీవెన, సున్నావడ్డీకి మంగళం.. ఉద్యోగులు, గ్రామస్తులు, అన్ని వర్గాలలో తీవ్ర అసహనం
ప్రజా వ్యతిరేకత కనిపించనీయకుండా ఎన్నికల ప్రక్రియ హైజాక్
సాక్షి, అమరావతి: పరిషత్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఎన్నికల ప్రక్రియను హైజాక్ చేసిన చంద్రబాబు సర్కార్ ప్రజాగ్రహాన్ని మాత్రం దాచలేకపోయింది. అంకెల్లో విజయం చూపించుకున్నా అందులో ప్రజల తీర్పు ప్రతిబింబించలేదు. ఎన్నికల కౌంటింగ్‌లో ఈ విషయం ప్రస్ఫుటంగా కనిపించిందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగానే బైండోవర్లు, నామినేషన్ల దశలోనే దౌర్జన్యాలు, నిర్బంధాలు, దాడులు, ఏకగ్రీవాలు.. పోలింగ్ రోజు కెమెరాల బంద్, సైక్లింగ్, రిగ్గింగ్.. కౌంటింగ్‌లో అక్రమాల వరకూ అడుగడుగునా ఎన్నికల ప్రక్రియను తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు చంద్రబాబు సర్కారు తెగించింది.
కానీ రెండున్నరేళ్ల పాలనపై ప్రజల్లో పేరుకుపోయిన వ్యతిరేకతను మాత్రం అడ్డుకోలేకపోయింది. ఉద్యోగుల పోస్టల్ ఓట్లు, బ్యాలెట్ పెట్టెల్లో గ్రామస్తుల వినతులు, ప్రతిపక్ష అభ్యర్థుల గెలుపులపై రీకౌంటింగ్ రగడ.. ప్రతి ఘట్టంలోనూ ప్రభుత్వంపై అసంతృప్తి చర్చకు వచ్చింది. పైకి గెలుపు అంకెలు చూపించినా.. అవి సాధించడానికి అధికార పార్టీ చేసిన దారుణాలను చూస్తే.. కూటమి పాలనపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఉద్యోగుల ఆగ్రహానికి పోస్టల్ బ్యాలెట్లే సాక్ష్యం!
ప్రభుత్వంపై ఉద్యోగ వర్గాల్లో పేరుకుపోయిన వ్యతిరేకత పోస్టల్ బ్యాలెట్లలో స్పష్టంగా ప్రతిబింబించింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేస్తారు. ఓటు ఎలా వేయాలి? ఏ పొరపాటు జరిగితే ఓటు చెల్లకుండా పోతుంది? అనే విషయాలపై వారికున్న అవగాహన మరెవరికీ ఉండదు. ఎన్నికల శిక్షణ ఇచ్చేది, బ్యాలెట్ పత్రాలను పరిశీలించేది కూడా ఉద్యోగులే. అలాంటి ఉద్యోగుల పోస్టల్ ఓట్లే ఈసారి భారీ సంఖ్యలో చెల్లకుండా పోవడం చర్చనీయాంశంగా మారింది. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో 92 పోస్టల్ ఓట్లకు గానూ 59 చెల్లలేదు. అంటే మూడింట రెండొంతుల ఓట్లు వృథా అయ్యాయి.
ఏలూరు జిల్లా కైకలూరులో 66 ఓట్లలో ఏకంగా 64 చెల్లనివిగా తేలాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరిలో 137 ఓట్లకు 91, కొయ్యూరులో 201 ఓట్లకు 85 చెల్లలేదు. కొయ్యూరులో ఏ ఒక్క పార్టీకి వచ్చిన ఓట్ల కంటే చెల్లని పోస్టల్ ఓట్ల సంఖ్యే ఎక్కువగా ఉండటం గమనార్హం. మైలవరంలో 94 ఓట్లకు 24, నిడదవోలులో 134 ఓట్లకు 22 ఓట్లు చెల్లనివిగా నమోదయ్యాయి. ఒకటి రెండు చోట్ల ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటే పొరపాటుగా భావించవచ్చు. కానీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇదే తరహా పరిస్థితి కనిపించడం వెనుక ఉద్యోగుల అసంతృప్తి ఉందనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. చెల్లిన పోస్టల్ ఓట్లలో తమకే మెజారిటీ వచ్చిందని కూటమి నేతలు చెప్పుకుంటున్నా.. భారీగా నమోదైన చెల్లని ఓట్ల సంఖ్య మాత్రం మరో కోణాన్ని ఆవిష్కరిస్తోంది.
ఉద్యోగులు తమ నిరసనను ఈ రూపంలో వ్యక్తం చేశారన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే పీఆర్సీ, ఐఆర్ అమలు చేస్తామన్న హామీలు నెరవేరలేదు. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలు, రూ.40 వేల కోట్ల బకాయిలకు మోక్షం కలగలేదు. స్థానిక ఎన్నికల విధుల్లో సచివాలయ ఉద్యోగులకు చివరి నిమిషంలో డ్యూటీలు కేటాయించి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేకుండా చేశారు. విధులు నిర్వహించిన ఉద్యోగులకు పారితోషికాలు చెల్లించలేదు.
మరోవైపు తమ మాట వినకపోతే బదిలీలు తప్పవనే బెదిరింపులతో ఉద్యోగులను ఒత్తిడికి గురిచేశారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో బహిరంగంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రతిపక్షానికి ఓటు వేస్తే అధికార పార్టీ నేతల నుంచి వేధింపులు ఎదురవుతాయనే భయం.. అధికార పార్టీకి ఓటు వేయాలనే మనసు లేకపోవడం.. అందుకే తమ ఓట్లు చెల్లకుండా చేసుకున్నట్లు కనబడుతోంది. రాష్ట్ర పాలనను నడిపించే ఉద్యోగ వర్గమే ఇలా నిరసన తెలపడం కూటమి సర్కారుకు చెంపదెబ్బ.
గెలుపును లాక్కునేందుకు రీకౌంటింగ్ కుట్రలు..
ప్రజలు ఇచ్చిన తీర్పును సైతం కూటమి నేతలు సహించలేకపోయారు. ప్రతిపక్ష అభ్యర్థులు గెలిచిన చోట్ల రీకౌంటింగ్ పేరుతో ఆ విజయాలను లాక్కోవడానికి బరితెగించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు నేరుగా రంగంలోకి దిగి అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ప్రజలు ఓట్లేసి గెలిపించినా.. తమకు అనుకూలంగా ఫలితం వచ్చే వరకు వదిలిపెట్టేది లేదన్నట్లుగా వ్యవహరించారు. కృష్ణా జిల్లా గన్నవరం జెడ్పీటీసీ ఎన్నిక ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అనగాని రవి 64 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. ఎన్నికల అధికారి గెలుపును ప్రకటించారు.
అయినా కూటమి నేతలకు ఆ ఫలితం మింగుడుపడలేదు. వెంటనే రీకౌంటింగ్ నాటకానికి తెరలేపారు. చెల్లని ఓట్లను మళ్లీ పరిశీలించాలంటూ జాయింట్ కలెక్టర్‌ను సైతం పిలిపించారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్వయంగా రంగంలోకి దిగి రిటర్నింగ్ అధికారి, జిల్లా అధికారులపై ఒత్తిడి తెచ్చారు. చెల్లని ఓట్లను సైతం తమకు అనుకూలంగా మలుచుకుని ఫలితాన్ని తారుమారు చేయడమే లక్ష్యంగా ఈ తతంగం నడిపించారు. గన్నవరంలోనే కాదు.. విశాఖ జిల్లా గంభీరంలోనూ ఇదే బరితెగింపు. ప్రతిపక్ష అభ్యర్థి 36 ఓట్ల ఆధిక్యంతో గెలుస్తుంటే నాలుగు దఫాల రీకౌంటింగ్ చేపట్టి ఆ ఆధిక్యాన్ని ఒక్క ఓటుకు కుదించారు. ఈ క్రమంలో నాలుగుసార్లు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
పలుచోట్ల మంత్రుల పీఏలు కౌంటింగ్ కేంద్రాల వద్దే తిష్టవేసి ఫలితాల ప్రకటనను అడ్డుకున్నారు. ఒకవైపు భారీ విజయాలు సాధించామని ప్రచారం.. మరోవైపు ప్రతిపక్షం గెలిచిన చోట ఒక్క ఓటు ఆధిక్యాన్ని కూడా వదులుకోలేని ఆరాటం. అధికార బలంతో ఎన్నికల ఫలితాలనే తమకు అనుకూలంగా మలుచుకోవాలనే ప్రయత్నాలు. ఓటర్లు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సింది పోయి, రీకౌంటింగ్‌ల పేరుతో... గెలుపొందిన అభ్యర్థుల విజయాలనే ప్రశ్నార్థకం చేశారు. ప్రజల ఓటుతో వచ్చిన ఫలితాన్ని అధికార దర్పంతో మార్చేయాలనే ధోరణి కూటమి నేతల ఎన్నికల వ్యవహారాన్ని బట్టబయలు చేసింది.
బ్యాలెట్ పెట్టెలోనే నిలదీసిన ఓటర్లు
ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లు బ్యాలెట్ పెట్టెలో సమస్యను రాసి వేయడం సాధారణంగా జరగదు. కానీ ఈసారి అదీ జరిగింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంకణాలపల్లి గ్రామస్తులు ఓట్లతో పాటు తమ సమస్యను కరపత్రాలుగా రాసి జడ్పీటీసీ, ఎంపీటీసీ బ్యాలెట్ పెట్టెల్లో వేశారు. గ్రామ రైల్వే గేటు దగ్గర నిర్మిస్తున్న యూ ఆకారపు అండర్‌పాస్ వల్ల ఇబ్బంది పడుతున్నామని, ప్రధాన రోడ్డుకు నేరుగా వంతెన కావాలని అందులో రాశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌ల పేర్లతో నేరుగా వినతి పెట్టారు.
నరసరావుపేట కౌంటింగ్ కేంద్రంలో పెట్టెలు తెరిచినప్పుడు ఆ కరపత్రాలు బయటపడ్డాయి. గ్రామ సభల్లో చెప్పినా, అధికారులకు అర్జీలు ఇచ్చినా, ఎమ్మెల్యేను కలిసినా ఫలితం లేదు. అందుకే చివరకు తమ మాట నేరుగా కూటమి పాలకుల చెవికి చేరాలంటే బ్యాలెట్ బాక్సే మార్గమని భావించారు. ప్రజల ఫిర్యాదులు వినే వ్యవస్థ గ్రామ స్థాయిలో కుప్పకూలిపోయిందనడానికి ఇదే నిదర్శనం. రోడ్లు, తాగునీరు, పింఛన్లు, పథకాలు అందక ఎన్నో గ్రామాల్లో పేరుకుపోయిన అసంతృప్తికి ఇది ప్రతిరూపం.
పీఠాలు లాక్కున్నారు సరే.. ప్రజల మద్దతు ఏది?
సూపర్ సిక్స్, సూపర్ సెవన్ పేరుతో ప్రజలను నమ్మించి వంచించడం.. ఇచ్చిన హామీల్లో ఒక్కదాన్నీ అమలు చేయకుండా నిలువునా మోసం చేయడం.. ఉద్యోగులకు ఇచ్చిన మాట తప్పడం.. గ్రామాల సమస్యలను గాలికొదిలేయడం.. ఏ ఒక్క వర్గానికీ న్యాయం చేయకుండా నిర్లక్ష్యం చేయడం.. అన్నింటికీ మించి అంతులేని అవినీతితో పాలన సాగించడం.. ఇలా కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో పేరుకుపోయిన ఆగ్రహానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.
50 ఏళ్లు నిండిన మహిళలకు పెన్షన్ ఇస్తామని ఇవ్వకుండా మోసం చేయడం, నెలకు రూ.1,500 చొప్పున ఇస్తామని మహిళలను మోసం చేయడం, నిరుద్యోగులకు నెలకు రూ.3,000 చొప్పున నిరుద్యోగ భృతి అమలు చేయకపోవడం, విద్యాదీవెన బకాయిలు పేరుకుపోవడం, సున్నా వడ్డీ ఎత్తేయడం.. ఇలా అనేక కారణాలతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.ఈ వ్యతిరేకత ఓట్ల రూపంలో బయటపడకుండా అధికార బలంతో అడుగడుగునా అడ్డుకట్ట వేయాలని చూశారు.
నామినేషన్ల దగ్గర మొదలైన అడ్డంకులు, బెదిరింపులు, దౌర్జన్యాలు, ఓట్ల లెక్కింపులో జోక్యాలు.. చివరకు రీకౌంటింగ్‌ల పేరుతో ఫలితాలను తారుమారు చేసే ప్రయత్నాల వరకు సాగాయి. అయినా ప్రజాగ్రహం దాచలేకపోయారు. ఉద్యోగుల చెల్లని పోస్టల్ ఓట్లలో.. బ్యాలెట్ పెట్టెల్లో ప్రజలు వేసిన వినతుల్లో.. ప్రతిపక్ష అభ్యర్థుల గెలుపులను అడ్డుకునేందుకు సాగించిన రీకౌంటింగ్ పాకులాటలో.. కూటమి పాలనపై పేరుకుపోయిన అసంతృప్తి అడుగడుగునా బయటపడింది.
ఇంత అన్యాయమా?
ఇంత అన్యాయం నేనెప్పుడూ చూడలేదు. ఎస్టీని అని కూడా చూడకుండా నన్ను మోసం చేశారు. ముందు ఒక ఓటుతో గెలిచానని చెప్పి మూడు గంటల సేపు కూర్చోపెట్టి.. ఆ తర్వాత ప్రత్యర్థి గున్నం సముద్రాలు రెండు ఓట్లతో గెలిచినట్లు ప్రకటించారు. నేను రీకౌంటింగ్ అడిగినా ఒప్పుకోలేదు. నాకు న్యాయం జరిగేలా చూడండి. – ఉప్పు రాణి, పిట్టలవానిపాలెం మండలం అల్లూరు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థిని
మూడు ఓట్లతో గెలిచా..
నేను వైఎస్సార్‌సీపీ తరఫున కర్లపాలెం–1 నుంచి పోటీ చేశాను. మూడు ఓట్లతో గెలుపొందాను. టీడీపీ అభ్యర్థులు రీకౌంటింగ్ అంటూ హడావుడి చేశారు. ఆ తర్వాత అధికారులు పోస్టల్ ఓట్లు ఉన్నాయంటూ పిట్టు పావని రెడ్డి రెండు ఓట్లతో గెలుపొందారని ప్రకటించారు. ఇది ఎలా సాధ్యమని అడిగితే బయటకు గెంటేశారు. గెలిచిన అభ్యర్థిని గెలవలేదని ఎలా చెబుతారు? – ఆట్ల వెంకటేశ్వరమ్మ, కర్లపాలెం వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి
4 ఓట్లతో గెలుపొందాను
బాపట్ల మండలం గుడిపూడి ఎంపీటీసీగా 4 ఓట్లతో గెలుపొందాను. వెంటనే టీడీపీ నాయకులు రీకౌంటింగ్ అంటూ హడావుడి చేశారు. ఎన్నిసార్లు లెక్కలు వేసినా నాలుగు ఓట్లతో గెలుపొందానని అధికారులు చెబుతున్నా, టీడీపీ ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్రవర్మ రాజు పీఏ రాకేష్ ఒప్పుకోలేదు. ఫలితం ప్రకటించకుండా అధికారులను అడ్డుకున్నాడు. మాజీ స్పీకర్ కోన రఘుపతి వచ్చేవరకు అధికారులు కూడా ఫలితం ప్రకటించలేదు. – బోయిన వాసంతి, గుడిపూడి వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి
టీడీపీ ఇబ్బంది పెట్టింది
ప్రజలు నన్ను గెలిపించినప్పటికీ టీడీపీ నాయకులు దొడ్డిదారిలో పదవి దక్కించుకోవాలని చూశారు. నాలుగు ఓట్లతో నేను గెలుపొందినప్పటికీ పలుసార్లు రీకౌంటింగ్ అంటూ ఇబ్బందులు పెట్టారు. చివరికి నోటా ఓట్లను కూడా మూడుసార్లు లెక్క వేయించారు. ఎన్నిసార్లు లెక్కలు వేసినా విజయం నాదే అయింది. అయినా రెండుగంటల పాటు గెలిచినట్లు నాకు పత్రాలు ఇవ్వలేదు. – మరుప్రోలు తిరుపతిరెడ్డి, పోతురాజుకొత్తపాలెం వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థ


