కౌంటింగ్ హాల్ మేడపై నుంచి దూకే ప్రయత్నం
నెల్లూరు జిల్లా కావలి కౌంటింగ్ కేంద్రంలో ఘటన
జలదంకి బిట్–2 ఎంపీటీసీగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పద్మావతి గెలుపు
డిక్లరేషన్ ఇవ్వకుండా అడ్డుకొని రూ. కోటికి బేరాలకు దిగిన టీడీపీ
ససేమిరా అన్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి
ఐదు గంటలకుపైగా టీడీపీ నేతలు, ఖాకీలు హంగామా..
తర్వాత రీకౌంటింగ్ పేరుతో ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయన్న అధికారులు
టాస్ వేయకుండా టీడీపీ అభ్యర్థికి మరో ఓటు కలిపేసి, గెలిచినట్లు ప్రకటన
అన్యాయాన్ని తట్టుకోలేక అత్మహత్యాయత్నం చేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి భర్త
కావలి: తన భార్య ఎంపీటీసీగా గెలిచినప్పటికీ, ఓడిపోయినట్లు ప్రకటించారంటూ వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి భర్త భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని జలదంకి మండల కేంద్రం బిట్–2 ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా సురే పద్మావతి పోటీ చేశారు. కావలిలోని పీబీఆర్ విశ్వోదయ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం ఓట్ల లెక్కింపు జరిగింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పద్మావతికి 1,138 ఓట్లు వచ్చాయి. టీడీపీ నుంచి ఎంపీపీ ప్రతిపాదిత అభ్యర్థి కొలకలపూడి భవానికి 1121 ఓట్లు వచ్చాయి. దీంతో పద్మావతి 17 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వెంటనే టీడీపీ నేతలు అధికారులపై ఒత్తిడి తేవడంతో డిక్లరేషన్ ఇవ్వకుండా నిలిపివేశారు.
టీడీపీ అభ్యర్థి గెలుపొందినట్లు డిక్లరేషన్ ఇచ్చేందుకు రూ.కోటి ఇస్తామంటూ బేరానికి దిగారు. దీనికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అంగీకరించలేదు. దీంతో ఐదు గంటలపాటు పోలీసులు, టీడీపీ నాయకులు కౌంటింగ్ కేంద్రంలో హంగామా సృష్టించారు. వారికి అధికారులు సహకరించారు. చివరకు రీకౌంటింగ్ పేరుతో ఇద్దరి ఓట్లను 1123 ఓట్లుగా సమం చేశారు. ఇద్దరి ఓట్లు సమానం అయినప్పుడు టాస్ వేసి విజయాన్ని ప్రకటించాలి. కానీ, టీడీపీ అభ్యర్థికి మరో ఓటు కలిపేసి, ఒక్క ఓటుతో గెలుపొందినట్లు ప్రకటించారు. ఈ అన్యాయాన్ని తట్టుకోలేకపోయిన వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ భర్త వెంకట శేషారెడ్డి కౌంటింగ్ కేంద్రంలోనే టీడీపీ నాయకులు, అధికారుల దాష్టీకాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మా శవాలపై గెలుపు పత్రాలు అందుకోండంటూ రెండంతస్తుల భవనంపై నుంచి కిందకు దూకే ప్రయత్నం చేశారు. పోలీసులు ఆయన్ని పట్టుకుని సముదాయించి పంపించారు.


