గోకుల్‌ పార్క్‌ బీచ్‌లో విషాదం | Tragedy at Gokul Park Beach | Sakshi
Sakshi News home page

గోకుల్‌ పార్క్‌ బీచ్‌లో విషాదం

Nov 8 2026 2:39 AM | Updated on Nov 8 2026 2:39 AM

Tragedy at Gokul Park Beach

సముద్ర స్నానానికి వెళ్లిన నలుగురు.. ఒక్కసారిగా ఎగసిపడిన అలలు 

ముగ్గురిని కాపాడిన లైఫ్‌గార్డులు.. బాలిక గల్లంతు 

వారిని రక్షించేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన 35 ఏళ్ల వ్యక్తి 

అల్లిపురం(విశాఖ) : సరదాగా గడిపేందుకు బీచ్‌కు వెళ్లిన వారిని సముద్ర అలలు మృత్యువు అంచుల వరకు తీసుకెళ్లాయి. సముద్ర స్నానానికి దిగిన నలుగురు ఒక్కసారిగా ఎగసిపడిన అలల ధాటికి కొట్టుకుపోగా.. వారిని రక్షించేందుకు వెళ్లిన మరో వ్యక్తి  ప్రాణాలు కోల్పోయాడు. లైఫ్‌గార్డులు సకాలంలో స్పందించడంతో ముగ్గురు ప్రాణాలతో బయటపడగా బాలిక గల్లంతయింది. ఈ విషాద ఘటన విశాఖ బీచ్‌రోడ్డులోని గోకుల్‌ పార్క్‌ బీచ్‌లో శనివారం జరిగింది. పరవాడ ప్రాంతానికి చెందిన ముగ్గురు బాలికలు కరణం వెంకటి, లక్ష్మి, చిట్టి, బాలుడు రుషి శనివారం గోకుల్‌ పార్క్‌ బీచ్‌కు వచ్చారు. 

సరదాగా సముద్ర స్నానానికి దిగిన నలుగురు ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగసిపడిన అలల ధాటికి సముద్రంలోకి కొట్టుకుపోయారు. అక్కడే ఉన్న సుమారు 35 ఏళ్ల వ్యక్తి వారిని గమనించి కాపాడేందుకు యత్నించి తనూ గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న లైఫ్‌గార్డులు వెంటనే రంగంలోకి దిగి ముగ్గురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. బాలిక కరణం వెంకటి, 35ఏళ్ల వ్యక్తి గల్లంతయ్యారు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో 35ఏళ్ల వ్యక్తి మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. మరోవైపు గల్లంతైన బాలిక కోసం గజ ఈతగాళ్లు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

మృతుడి ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వండి 
బాలలను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన 35 ఏళ్ల వ్యక్తి వివరాలు తెలియరాలేదని సీఐ గోవిందరావు తెలిపారు. మృతుడు సుమారు 5.5 అడుగుల ఎత్తు, చామనఛాయ రంగు కలిగి ఉన్నాడని, నీలం రంగు షర్టు, నలుపు రంగు ప్యాంటు ధరించి, చేతికి పసుపు రంగు బ్యాండ్‌ వేసుకున్నాడని వివరించారు. అతడిని గుర్తించినవారు 9440796010, 0891–2746866 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement