సహకార ఎన్నికలకు కసరత్తు షురూ | Preparations for cooperative elections begin | Sakshi
Sakshi News home page

సహకార ఎన్నికలకు కసరత్తు షురూ

Nov 8 2026 2:33 AM | Updated on Nov 8 2026 2:33 AM

Preparations for cooperative elections begin

పంచాయతీ పోరు తర్వాత నిర్వహణకు షెడ్యూల్‌  

ముందుగా ఏర్పాట్లు పూర్తిచేయాలంటూ ఉత్తర్వులు 

రాష్ట్ర సహకార కమిషనర్‌ ఆదేశాలు 

పాత జిల్లాల ప్రకారమే నిర్వహించాలని సర్కారు ఎత్తులు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసా­య సహకార సంఘాల (పీఏసీఎస్‌), జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీల (డీసీఎంఎస్‌)తో పాటు ఏపీ స్టేట్‌ కో–ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ పాలక వర్గాల ఎన్నికలకు కసరత్తు మొదలైంది. ప్రస్తుతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ ముగిశాక మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. ఆ తర్వాత సహకార ఎన్నికలు కూడా నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి జరగనున్న ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి సాధ్యమైనంత త్వరగా ప్రాథమిక ఏర్పాట్లు పూర్తిచేయాలంటూ సహకార సంఘాల రిజిస్ట్రార్  (ఆర్‌సీఎస్‌) అహ్మద్‌ బాబు జిల్లా సహకార అధికారులను ఆదేశిస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేశారు.

ఏర్పాట్లపై పది రోజుల్లో నివేదికలు.. 
ప్రాథమిక ఏర్పాట్లపై పది రోజుల్లోనే జిల్లా స్థాయిలో తీసుకున్న చర్యల నివేదికను సమర్పించాలని అహ్మద్‌ బాబు తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వాటి ప్రకారం.. తొలుత ఏపీ సహకార సంఘాల చట్టం–1964 ఆధారంగా సభ్యత్వ నమోదు, ఓటర్ల జాబితాలు, ఓటర్ల అర్హతలు–అనర్హతలను నిర్దేశిస్తారు. పీఏసీఎస్‌ల వారీగా సభ్యత్వ వివరాలను ధృవీకరించి, సరిపోల్చి అర్హులైన ఓటర్ల తాజా డేటాబేస్‌ సిద్ధంచేయాలి. అవసరమైన చోట కేవైసీ/ఈ–కేవైసీ, వాటా మూలధనం, లావాదేవీలు, సేవా ప్రమాణాలు, సభ్యత్వ కాలపరిమితి, రుణాల డిఫాల్ట్‌ స్థితిని పరిశీలించాలి. కేవైసీ వివరాలు సమర్పించని లేదా అసంపూర్తి వివరాలున్న సభ్యుల కోసం ప్రత్యేక ఈ–కేవైసీ డ్రైవ్‌ నిర్వహించాలి. రైతుసేవా కేంద్రాల (ఆర్‌ఎస్‌కే) మ్యాపులు, సంబంధిత డేటా ఆధారంగా ప్రాదేశిక నియోజకవర్గాలను గుర్తించి సరిహద్దులు నిర్ణయించాలి. 

పోలింగ్‌ కేంద్రాలు.. సామగ్రిపై కసరత్తు.. 
భౌగోళిక పరిస్థితులు, సున్నిత ప్రాంతాలు, సిబ్బంది లభ్యతను పరిగణనలోకి తీసుకుని పోలింగ్‌ కేంద్రాలను గుర్తించాలి. ఒకే దశలో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ప్రింటింగ్‌ ప్రెస్‌లు, బ్యాలెట్‌ పెట్టెలు, చెరగ­ని సిరా, స్వస్తిక్‌ గుర్తులు తదితర ఎన్నికల సా­మగ్రి లభ్యతను అంచనా వేయాలి. స్ట్రాంగ్‌ రూమ్‌లను కూడా గుర్తించాలి. ఎన్నికల నిర్వ­హణలో అనుభవం ఉన్న సిబ్బందిని శిక్షకులు­గా గుర్తించి శిక్షణ కోసం ప్రణాళిక సిద్ధంచేయా­లి. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కలెక్టర్లు, రెవెన్యూ, పోలీసు, ఫంక్షనల్‌ రిజిస్ట్రా­ర్లు ఇతర శాఖలతో నిరంతర సమన్వయం కొనసాగించాలని ఆర్‌సీఎస్‌ ఆదేశించారు.

కొత్త జిల్లాల ప్రాతిపదికన విభజన తర్వాతే..
రాష్ట్రంలో ఆప్కాబ్‌కు అనుబంధంగా 13 డీసీసీబీలు, 13 డీసీఎంఎస్‌లు, 2051 పీఏసీఎస్‌లున్నాయి. పీఏసీఎస్‌ల్లో తొమ్మిది సొసైటీలు (పోలవరం ముంపు ప్రాంతాలు) మనుగడలో లేవు. వీటికి 2013లో ఎన్నికలు జరగ్గా, వాటి కాల పరిమితి 2018 ఫిబ్రవరితో ముగిసింది. అప్పటి నుంచి నాన్‌ అఫీషియల్‌ పర్సన్‌ ఇన్‌చార్జ్‌ (పీఐసీ), అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. వాస్తవానికి.. రిజర్వ్‌ బ్యాంక్‌ నిబంధనల ప్రకారం ఈ 13 డీసీసీబీ, 13 డీసీఎంఎ‹స్‌లను కొత్త జిల్లాల ప్రాతిపదికన 28 జిల్లాల వారీగా విభజించాల్సి ఉంది. 

రిజర్వ్‌ బ్యాంక్‌ నిబంధనల ప్రకారం రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లకు డీసీసీబీలు, డీసీఎంఎస్‌లను విభజించాల్సి ఉంది. ఆ తర్వాత ఆయా జిల్లాల పరిధిలో పీఏసీఎస్‌లను విభజించాలి. ఆ లెక్కన చూసినా ఈపాటికే వీటిని విభజించాల్సి ఉంది. ప్రస్తుతం పీఏసీఎస్‌ల పరిధిలో 65,75,167 మంది సభ్యులుండగా, 31,37,903 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన సొసైటీల విభజన, అవసరమైన మేరకు కొత్త సొసైటీలు ఏర్పాటు జరిగితే ఆ మేరకు సభ్యుల సంఖ్య కూడా పెరిగే అవకాశముంది. 

ఆ మేరకు కొత్త ఓటర్ల నమోదుకు కూడా అవకాశం కల్పించాలి. కానీ, ప్రభుత్వం పాత జిల్లాల ప్రాతిపదికగానే ఎన్నికలు జరపాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే. పీఏసీఎస్‌ల ఎన్నికలకు కనీసం రెండు నెలల సమయం అవసరమని అంచనా వేశారు. ఆ తర్వాత డీసీసీబీ, డీసీఎంఎస్‌ పాలక వర్గాల ఎన్నికలకు 15 రోజులు, ఆప్కాబ్‌కు 10 రోజుల కాలపరిమితి పడుతుందని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement