జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలపై వైఎస్ జగన్ విమర్శలు
నామినేషన్ నుంచి కౌంటింగ్ వరకు ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఖూనీ చేశారని ఆగ్రహం
అధికారులపై ఒత్తిడి తెచ్చి పలు జిల్లాల్లో ఫలితాలను తారుమారు చేశారని మండిపాటు
చంద్రబాబు గెలిచినా.. నైతికంగా ఓడిపోయారని వ్యాఖ్య
వైఎస్సార్‌సీపీ ఓడిపోయినా ప్రజల మనసులు గెలుచుకుందని వెల్లడి
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడిన పార్టీ శ్రేణులు.. ముఖ్యంగా మహిళలకు అభినందనలు
ప్రతి పౌరుడి హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టీకరణ
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో సీఎం చంద్రబాబునాయుడు అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆరోపించారు. నామినేషన్ల నుంచి పోలింగ్ వరకు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని, తాజాగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌లోనూ అదే విధంగా వ్యవహరించారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ తరహాలోనే అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పలు జిల్లాల్లో ఫలితాలను అడ్డగోలుగా తారుమారు చేశారని శనివారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
చంద్రబాబు నైతికంగా ఓడిపోయారు
అధికార బలంతో చంద్రబాబు ఎన్నికల్లో గెలిచి ఉండొచ్చని, కానీ నైతికంగా ఓడిపోయారని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. తమ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజల మనసులను గెలుచుకుందని పేర్కొన్నారు. అధికార బలంతో ఎన్నికలను గెలవొచ్చని, కానీ ప్రజల విశ్వాసాన్ని గెలవలేరని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అణచివేయొచ్చేమో కానీ ప్రజల ఆకాంక్షలను అణచివేయలేరని స్పష్టం చేశారు.
మెరుగైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం పోరాటం కొనసాగిస్తాం
ఎన్ని అడ్డంకులు ఎదురైనా, దాడులు జరిగినా, నిర్బంధాలు విధించినా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వెనుకడుగు వేయకుండా పోరాడిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలకు వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో తమ పోరాటాలను మరింత దృఢంగా కొనసాగిస్తామని ప్రకటించారు. రైతులు, మహిళలు, యువత, కార్మికులు, ఉద్యోగులు.. ప్రతి పౌరుడి హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. మెరుగైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజల ఆశీస్సులతో దృఢమైన నమ్మకం, అచంచల విశ్వాసంతో ఈ ప్రయాణం ముందుకు సాగుతుందని వైఎస్ జగన్ తన పోస్టులో పేర్కొన్నారు.


