చంద్రబాబు కూటమి సర్కారుపై వైఎస్ జగన్ మండిపాటు
నేరుగా నాగార్జున వర్శిటీకి చేరాల్సిన బ్యాలెట్ బాక్సులను మధ్యలో ఎందుకు దింపారు?
ఎవరి ఆదేశాల మేరకు దింపారు? బ్యాలెట్ బాక్సులకు ఉండాల్సిన భద్రత ఏమైంది?
రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని, శాంతియుతంగా ఆందోళన చేస్తే లాఠీచార్జి చేస్తారా?
తప్పులు మీరుచేసి, మా వాళ్లపై అక్రమ కేసులా?
చివరకు ఒక ఎమ్మెల్సీపై డెకాయిటీ, దొంగతనం కేసులు పెడతారా?
ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది?
మీ అప్రజాస్వామిక పద్ధతులను దేశమంతా చూస్తూనే ఉంది
ఈ దుర్మార్గాలపై ప్రజలు మీకు తగిన బుద్ధి చెబుతారు
సాక్షి, అమరావతి : వైఎస్సార్‌సీపీ శాసన మండలి సభ్యుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి అక్రమ అరెస్టును, నిర్బంధాన్ని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఎన్నికల అక్రమాలను ప్రశ్నిస్తూ పార్టీ అభ్యర్థులతో, ప్రజలతో కలిసి శాంతియుతంగా ఆందోళన చేస్తే, దానిపై తప్పుడు కేసులు పెట్టి, అడ్డగోలుగా అరెస్టు చేసి, నిర్బంధానికి గురిచేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఎమర్జెన్సీని తలపించే ఈ పాలన అత్యంత హేయమంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు.
‘గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెంలో గురువారం పరిషత్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత, నేరుగా నాగార్జున వర్శిటీకి చేరాల్సిన బ్యాలెట్ బాక్సులను మధ్యలో నల్లపాడు వద్ద ఎందుకు దింపారు? ఎవరి ఆదేశాల మేరకు ఆ బ్యాలెట్ బాక్సులను దింపారు? అసలు బ్యాలెట్ బాక్సులకు ఉండాల్సిన భద్రత ఏమైంది? స్ట్రాంగ్ రూంకు చేరాల్సిన బ్యాలెట్ బాక్సులు నడి రోడ్డు మీద కనిపిస్తే, కళ్లెదుటే వాటిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మా పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు, ప్రజల మీద లాఠీఛార్జి చేస్తారా? తప్పులు మీరు చేసి, ఏకంగా బ్యాలెట్ బాక్సులు మార్చే ప్రయత్నం చేసి, మళ్లీ మా వాళ్లపై అక్రమ కేసులా? చివరకు ఒక ఎమ్మెల్సీ మీద డెకాయిటీ, దొంగతనం కేసులు కూడా పెడతారా? ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది?’ అని ప్రశ్నించారు.
ఎన్నికల అక్రమాలు దాచిపెట్టలేరు..
‘స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు రిగ్గింగ్, నామినేషన్ల స్క్రూట్నీ రిగ్గింగ్, పోలింగ్ బూత్‌లలో రిగ్గింగ్, సైక్లింగ్, పోలింగ్ పర్సంటేజీల రిగ్గింగ్, చివరకు పోలింగ్ ముగిశాక ఇలా బ్యాలెట్ బాక్సులు కూడా రిగ్గింగ్.. చంద్రబాబూ.. ఈ స్థానిక ఎన్నికల్లో మీరు ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ఈ తప్పుల్ని ఎవరైనా ప్రశ్నిస్తే, వారిని అరెస్టు చేసి జైలుకు పంపుతారా? మీ అధికార, పోలీసు బలాన్ని ప్రయోగించి కట్టడి చేయాలని అనుకున్నంత మాత్రాన, మీరు చేసిన ఎన్నికల అక్రమాలు దాచిపెట్టలేరు. మీ అప్రజాస్వామిక పద్ధతులను దేశమంతా చూస్తూనే ఉంది. ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఇలాంటి దుర్మార్గాలను సహించరు. మీకు తగిన బుద్ధిచెబుతారు’ అని వైఎస్ జగన్ హెచ్చరించారు.


