పునేఠా పుఠాణి
ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పేరుకే సీసీ కెమెరాల ఏర్పాటు
1,982 సీసీ కెమెరాల్లో 1,217 పనిచేయనివే
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపులో తొలి రెండు గంటల పాటు చోటు చేసుకున్న వింత
సాంకేతిక కారణాల వల్ల ఆయా కెమెరాల ఫుటేజ్‌ని స్థానికంగా రికార్డు చేశామంటున్న అధికారులు
స్థానిక ఎన్నికల్లో ప్రతి దశలోనూ అక్రమాలకు ఆస్కారం ఇచ్చేలాగా సాగిన ఎన్నికల ప్రక్రియ
అదేమని ప్రశ్నిస్తే వాకబు చేస్తానంటూ ఎస్‌ఈసీ అనిల్‌చంద్ర పునేఠా సమాధానం దాటవేత
సాక్షి, అమరావతి: స్థానిక ఎన్నికల ప్రతి దశలోనూ రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) సహకారంతో దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడుతున్న అధికార టీడీపీ గూండాలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలోనూ తమ అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు దుష్టపన్నాగం పన్నారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ టీవీ కెమెరా కళ్లకు గంతలు కట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో తప్పక కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన ఎస్‌ఈసీ అవి పనిచేస్తున్నాయా అన్న విషయాన్ని పర్యవేక్షించలేదు. దీంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల్లో చాలా చోట్ల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు శనివారం ఉదయం కౌంటింగ్ ప్రారంభమైన రెండు గంటల పాటు పనిచేయలేదని అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఓట్ల లెక్కింపు జరుగుతున్న 365 కేంద్రాలో మొత్తం 1982 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయగా, అందులో 1,217 కెమెరాలు లైవ్ ఫుటేజీ ఉదయం పదిన్నర గంటల వరకు రాష్ట్ర స్థాయిలో అధికారుల పరిశీలనకు అందుబాటులో లేదని సమాచారం. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అక్రమాలు జరిగినా వెంటనే గుర్తించేందుకు కౌంటింగ్ కేంద్రాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని నిరంతరం పరిశీలించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ముందుగా ప్రకటించారు.
ఇందుకుగాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలోనూ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలోనూ సీసీటీవీ ఫుటేజీ పర్యవేక్షణకు ప్రత్యేక హాల్ పదుల సంఖ్యలో టీవీ స్కీన్‌లు ఏర్పాటు చేశారు. పది‡ గంటల వరకు 1217 సీసీ కెమెరాల ఫుటేజీ లైవ్ అధికారులకు అందుబాటులోకి రాలేదని సమాచారం. శనివారం ఉదయం అనిల్ చంద్రపునేఠ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో మీడియా ప్రతినిధి ఇదే ప్రస్తావించగా అది తన దృష్టికి రాలేదని, జిల్లాల అధికారులను వాకబు చేస్తానంటూ సమాధానం దాటవేయడం గమనార్హం.
ఆఫ్‌లైన్ ఫుటేజీలో మార్పులకు అవకాశం..
కాగా, సాంకేతిక కారణాలతో అక్కడక్కడ కొంత సేపు సీసీ కెమెరాల లైవ్ రాష్ట్ర స్థాయి అధికారులకు అందుబాటులో లేకపోయినా, ఆఫ్‌లైన్‌లో స్థానికంగా ఆ కెమెరాల్లో పుటేజీ ఎప్పటికప్పుడు రికార్డు అవుతూనే ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే, ఆయా సీసీ కెమెరాల పుటేజీ ఆన్‌లైన్‌లో నిరంతరం అందుబాటులో ఉంటే, దానిని మార్పులు చేయడానికి అవకాశం ఉండదని, ఆఫ్‌లైన్‌లో రికారి్డంగ్ అంటే ఆయా పుటేజీలను అవసరం మేరకు కట్ చేసి మార్పులు చేసే వీలుంటుందని రాజకీయ పక్షాలు ఆరోపిస్తున్నాయి. స్వేచ్ఛాయుతంగా, పూర్తి పారదర్శకంగా ఎన్నికలు జరగాల్సి ఉండగా, స్థానిక ఎన్నికల్లో ప్రతీ దశలోనూ అక్రమాలకు ఆస్కారం ఇచ్చే లాగానే ఎన్నికలు సాగాయని, పారదర్శకత మచ్చుకైనా కనిపించలేదని రాజకీయ వర్గాలు ఆరోపిస్తున్నాయి.


