రీకౌంటింగ్ పేరుతో తనను ఓడించారని ఆవేదన వ్యక్తం చేస్తూ బైఠాయించిన నెల్లూరు జిల్లా తమ్మినపట్నం వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి సుజాతమ్మ
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపులో కాలకేయులను మరిపించిన ‘పచ్చ’ నేతలు
వందలాది స్థానాల్లో ఫలితాలు తారుమారు.. అక్రమాలకు సహకరించిన పోలీసులు
పోలీసులే వైఎస్సార్‌సీపీ నేతలను తన్ని తరిమేసిన వైనం
కౌంటింగ్ పాసులున్న ఏజెంట్లకూ నో ఎంట్రీ.. పదే పదే రీ కౌంటింగ్ నిర్వహిస్తూ అరాచకం
తుదకు చెల్లని ఓట్లు.. లెక్కించిన ఓట్లే కలిపి విజేతలుగా ప్రకటించుకున్న దుస్థితి
కొన్నిచోట్ల గెలిచిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఓట్లూ టీడీపీకి మళ్లింపు
ప్రత్యర్థి పార్టీ గెలిచిన చోట డిక్లరేషన్ ఇవ్వకుండా వేధింపులు
ఫలితాల తారుమారుపై ఆందోళనకు దిగిన మాజీ మంత్రి రోజాను ఈడ్చేసిన పోలీసులు
కళ్యాణదుర్గంలో తాలిబన్లను మరిపించిన ఎమ్మెల్యే అమిలినేని గ్యాంగ్
కుందుర్పి మండలంలో 11 ఎంపీటీసీ స్థానాల అభ్యర్థులు కౌంటింగ్ బహిష్కరణ
మంగళగిరి, బాపట్ల నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ గెలిచిన స్థానాలను లాక్కున్న టీడీపీ
సాక్షి, అమరావతి / సాక్షి నెట్‌వర్క్: స్థానిక ఎన్నికల్లో వెన్నుపోటు పార్టీ అక్రమాలు, దౌర్జన్యాలు, బరితెగింపులు పరాకాష్టకు చేరాయి. నామినేషన్ల పర్వం మొదలు కౌంటింగ్ వరకు యథేచ్ఛగా పచ్చ గూండాలకు పోలీసులు యథాశక్తి సహకరించారు. కొన్ని చోట్ల పోలీసులే పచ్చ మూకలను మరిపించేలా దౌర్జన్యం చేస్తూ వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను తరిమేశారు. ఈ క్రమంలో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌లో అరాచకం రాజ్యమేలింది. తప్పులను, అక్రమాలను ప్రశ్నించే అవకాశం లేకుండా వైఎస్సార్‌సీపీ శ్రేణులపై ఖాకీ కట్టడి శృతిమించింది. ఓటర్లు ఇచ్చిన తీర్పును తారుమారు చేసి ఫలితాలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు పచ్చ పార్టీకి పోలీసులే రక్షణ కవచంగా మారారు.
పోలింగ్ రోజు గురువారం వైఎస్సార్‌సీపీ నేతలను హౌస్ అరెస్టులు చేయడం, అధికారిక పాసులు ఉన్న ఏజెంట్లను కౌంటింగ్ కేంద్రాల్లోకి వెళ్లనివ్వక పోవడం, బైండోవర్ కేసుల పేరుతో అడ్డుకోవడం, నిరసన తెలిపిన వారిపై తప్పుడు కేసులు నమోదు చేయడం తెలిసిందే. కౌంటింగ్ రోజు అయితే ఒకవైపు వైఎస్సార్‌సీపీ నేతలు, ఏజెంట్లపై కఠిన ఆంక్షలు విధిస్తూ.. మరోవైపు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు, పీఏలు, నేతలు స్వేచ్ఛగా తిరిగేలా పోలీసులు పచ్చ జెండా ఊపారు. ఫలితంగా ప్రశ్నించే గొంతులను ముందుగానే కట్టడి చేసి.. ఓట్ల లెక్కింపులో జరిగే తేడాలపై అభ్యంతరాలు వ్యక్తం కాకుండా చేయడమే లక్ష్యంగా పోలీసులు వ్యవహరించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆళ్లగడ్డలో టీడీపీ గూండాలు దహనం చేసిన కార్లు
నగరిలో మాజీ మంత్రి రోజాపై పోలీసుల దాష్టీకం
నోటా ఓట్లతో టీడీపీ గెలుపు
ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలానికి చెందిన గమళ్లపాలెం ఎంపీటీసీ స్థానం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తాతా నాగేంద్రమ్మ 11 ఓట్లతో గెలిచింది. రెండు సార్లు రీకౌంటింగ్ నిర్వహించినా ఆమే విజేతగా నిలిచారు. ఈ క్రమంలో కొత్తపట్నం తహశీల్దార్ డీ రామానాయుడు నోటా ఓట్ల లోంచి కొన్ని ఓట్లు బయటకు తీసి టీడీపీ ఖాతాలో వేశారు. తుదకు రెండు ఓట్లతో టీడీపీ గెలిచినట్టు ప్రకటించారు. బల్లికురవ మండలం మల్లాయపాలెం, వెలమవారిపాలెంలో వైఎస్సార్ సీపీ గెలుపు వాకిట ఉండగా.. మంత్రి గొట్టిపాటి పీఏ, ఎస్సై నాగరాజు అక్కడే తిష్టవేసి ఫలితాలను తారుమారు చేసి టీడీపీ విజయం సాధించినట్లు ప్రకటించారు. కొత్తపట్నం మండల వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి లంకపోతు అంజిరెడ్డి 790 మెజార్టీతో గెలిచినా డిక్లరేషన్ ఫారం ఇవ్వలేదు. బాధిత అభ్యర్థి, ఏజెంట్లు గేటు బయట ధర్నాకు దిగడంతో జేసీ కల్పనా కుమారి వచ్చి విచారించి.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి డిక్లరేషన్ ఫాం ఇచ్చారు.
అక్రమాలకు నిలువెత్తు నిదర్శనం
» కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో పోలీసుల దౌర్జన్యకాండ పరాకాష్టకు చేరింది. వైఎస్సార్ సీపీ ఏజెంట్లను లోపలికి పంపకుండా నిలువరించారు. ఆలూరు ఎస్‌ఐ మన్మథ విజయ్ పోలీసులతో కలిసి విచక్షణారహితంగా లాఠీలతో కొట్టారు. దీంతో ఆలూరు వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఏజెంట్లు మల్లికార్జున తలకు, జక్రయ్యా అనే వైఎస్సార్ సీపీ ఏజెంట్ చేతి వేళ్లకు రక్తగాయాలయ్యాయి. ఆస్పరి మాజీ జెడ్పీటీసీ దొరబాబును లోపలికి పంపించేది లేదు.. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ సీఐ శ్రీనివాస్ నాయక్ వార్నింగ్ ఇచ్చారు. పోలీసుల తీరుపై ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి కౌంటింగ్ హాలు వద్ద వైఎస్సార్‌సీపీ ఏజెంట్లతో కలిసి నిరసన చేపట్టారు.
» శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తమ్మినపట్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి బొమ్మి సుజాతమ్మ ఏడు ఓట్లతో గెలిచారని తొలుత ప్రకటించారు. అయితే టీడీపీ అభ్యర్థి ఒత్తిడితో రీకౌంటింగ్‌ను నిర్వహించి ఆ పార్టీ ఒక్క ఓటుతో గెలిచిందని అధికారులు ప్రకటించారు. అనంతసాగరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి అమరావతి గెలుపును అడ్డుకునేందుకు టీడీపీ నేతలు కౌంటింగ్‌ను నిలిపివేశారు. ఏఎస్‌పేట జెడ్పీటీసీ అభ్యర్థి పందిళ్లపల్లి రాజేశ్వరమ్మ కౌంటింగ్‌లో ముందంజలో ఉండగా, కౌంటింగ్ ప్రక్రియను కొంతసేపు నిలిపేశారు. కొన్ని బ్యాలెట్ పత్రాలకు ఇంకు మరకలున్నాయని, వాటిని లెక్కించరాదంటూ టీడీపీ ఏజెంట్లు అడ్డుకున్నారు.

నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తమ్మినపట్నంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని సుజాతమ్మపై పోలీసులజులుం
గూడూరు మండలం తిప్పవరప్పాడులో 60 ఓట్లతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విజయం సాధిస్తే పట్టబట్టి రీ కౌంటింగ్ చేయించారు. అయినా 12 ఓట్ల మెజార్టీ వచ్చింది. దీంతో టీడీపీ మూకలు కౌంటింగ్ హాల్లోకి దూరి అభ్యర్థి చేతిలోని డిక్లరేషన్‌ను చించివేసి మూడు ఓట్ల మెజార్టీతో టీడీపీ గెలిచిందని ప్రకటించుకున్నారు. వెందోడు సెగ్మెంట్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి 80 ఓట్లతో విజయం సాధిస్తే మళ్లీ రీకౌంటింగ్ పేరుతో టీడీపీ 200 ఓట్లతో విజయం సాధించినట్లు ప్రకటించుకున్నారు. కాగా, ఆత్మకూరులోని కౌంటింగ్ కేంద్రం వద్ద తమకు భోజనం, టిఫిన్, కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదని సిబ్బంది ఆందోళనకు దిగారు.
» విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంభీరం ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అయినాపురపు లక్ష్మణకుమార్ (బాబ్జీ)కు 63 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మేనల్లుడు చిక్కాల విజయబాబు జోక్యంతో మూడు సార్లు రీ కౌంటింగ్ నిర్వహించారు. తుదకు చెల్లని ఓట్లు కలిపి టీడీపీ అభ్యర్థి 4 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు ప్రకటించారు.
» మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలంలోని గణపవరం ఎంపీటీసీ సెగ్మెంట్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భవనం కుమారి 38 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. అయితే ఆమెకు డిక్లరేషన్ ఫారం ఇవ్వడంలో తీవ్రజాప్యం చేసి రీ కౌంటింగ్ పేరుతో టీడీపీ అభ్యర్థి 4 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు ప్రకటించారు. ఈ అన్యాయాన్ని ప్రశ్నించడానికి వచ్చిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ను మార్కాపురం డీవైఎస్పీ నిమ్మగడ్డ సత్యనారాయణ, సీఐ అల్తాఫ్ హుసేన్‌లు అడ్డుకున్నారు.
» కాకినాడు జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం ఎంపీటీసీగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గొణగాల గోపాలస్వామి 27 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయినా మూడు గంటలపాటు డిక్లరేషన్ ఫాం ఇవ్వలేదు. గోపాలస్వామి.. అధికారులు, సీఐ కాళ్లావేళ్లాపడి బతిమాలడం ప్రజాస్వామ్య దుర్గతికి అద్దం పట్టింది.
ఆళ్లగడ్డలో అర్ధరాత్రి మంటలు
కౌంటింగ్ వేళ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి షరీఫాబీకి చెందిన రెండు కార్లను అర్ధరాత్రి దుండగులు తగలబెట్టారు. ఏఎన్‌ఆర్ మహబూబ్ బాషా ఇంటి ఎదుట నిలిపి ఉంచిన వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. రెండు రోజుల క్రితమే షరీఫాబీ కుమారుడు సాదిక్‌పై కత్తులతో దాడి జరిగిన నేపథ్యంలో, తాజాగా వాహనాలను తగలబెట్టడం ఆందోళన కలిగిస్తోంది. వరుస ఘటనల వెనుక ఉన్నది ఎవరో తెలిసినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని వైఎస్సార్‌సీపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం లింగాలవలస ఎంపీటీసీ అభ్యర్థి దువ్వాడ హైందవి విజయం సాధించినప్పటికీ, రీ కౌంటింగ్ పేరుతో రభస సృష్టించారు. రీ కౌంటింగ్‌లోనూ ఆమే గెలిచింది. తీరా ధ్రువీకరణ పత్రం ఇచ్చేటప్పుడు టీడీపీ అభ్యర్థి కమలాకర్‌రావు విజయం సాధించినట్లు ప్రకటించారు.
ఖాకీల ఓవర్ యాక్షన్
నంద్యాల జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి, శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డిలను కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరులో పార్టీ కార్యాలయంలో సమన్వయకర్త శిల్పా భువనేశ్వర్‌రెడ్డిని పోలీసులు నిర్బంధించారు. నందికొట్కూరులో వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి వెళ్తున్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని అడ్డుకుని అరెస్టు చేశారు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో బైండోవర్ పేరుతో వైఎస్సార్‌సీపీ కౌంటింగ్ ఏజెంట్లను అడ్డుకున్నారు. అనంతపురం జిల్లాలో మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎంపీ తలారి రంగయ్యలను నిర్బంధించారు. మరోవైపు కూటమి ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించారు.

యర్రగొండపాలెంలో ఎమ్మెల్యే తాటిపర్తితో వాగ్వాదం చేస్తున్న డీవైఎస్పీ, సీఐ
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం, చెన్నేకొత్తపల్లి, గోరంట్ల ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను పోలీసులు బలవంతంగా బయటకు పంపేశారు. ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని సైతం కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించ లేదు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను కేసుల పేరుతో కౌంటింగ్ హాలుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ను కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు అడ్డుకోవడంపై వివాదం రేగింది. ప్రజల తీర్పుపై నమ్మకం ఉంటే ప్రతిపక్ష నేతలను ఎందుకు నిర్బంధించాల్సి వచ్చిందని, కౌంటింగ్ కేంద్రాల వద్ద తమను ఎందుకు అడ్డుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు పోలీసులను నిలదీశారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అరాచకం
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం కేవీబీ పురం వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి సుజాత 1,600 ఓట్ల మెజారిటీ సాధించారు. ఓటమిని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు రీకౌంటింగ్‌కు డిమాండ్ చేశారు. అలా ఐదు పర్యాయాలు రీ కౌంటింగ్ జరిపించారు. ప్రతిసారీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థే ఆధిక్యం చాటుకున్నారు. తుదకు అర్ధరాత్రి దాటాక అన్యాయంగా టీడీపీ అభ్యర్థి 248 ఓట్లతో గెలిచినట్లు ప్రకటించారు.
» తిరుపతి జిల్లా కేవీబీ పురం మండలంలోని ఆరు ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. పలుమార్లు రీకౌంటింగ్ చేసినా.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే డిక్లరేషన్ ఫారాలు ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారు.
» తిరుపతి రూరల్ వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి ప్రతి రౌండ్‌లో ఆధిక్యం ప్రదర్శిస్తుండడంతో స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని భార్య సుధారెడ్డి అధికారులపై ఒత్తిడి చేసి కౌంటింగ్ ఆపించారు. ఇదే నియోజకవర్గం పేరూరు–2 వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి 6 ఓట్లతో గెలుపొందారు. రీకౌంటింగ్‌లోనూ అదే 6 ఓట్లు ఆధిక్యం ఉన్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
అయినా డిక్లరేషన్ ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుపడ్డారు. యర్రావారిపాళెం వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి 604 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. అయితే డిక్లరేషన్ ఇవ్వకుండా అడ్డుకున్నారు. రేణిగుంట వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి మొదటి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు ఆధిక్యత చాటుకుంటూ వచ్చారు. కానీ చివరలో బీజేపీ అభ్యర్థి గెలుపొందినట్లు ప్రకటించారు. ఈ విషయంపై తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి కౌంటింగ్ ప్రక్రియ మొత్తం సీసీ పుటేజ్ కావాలని కలెక్టర్‌ని కోరారు.
» చిత్తూరు జిల్లా నగరి ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద జరిగిన విజయపురం మండలం ఇల్లత్తూరు ఎంపీటీసీ స్థానాన్ని 15 ఓట్ల మెజారిటీతో తొలుత వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దేవి గెలిచినట్లు ఆర్‌వో జయచంద్రారెడ్డి ప్రకటించారు. టీడీపీ అభ్యర్థి రీ కౌంటింగ్ కోరడంతో.. చెల్లని ఓట్లను టీడీపీ అభ్యర్థి ఖాతాలో చూపించి మూడు ఓట్ల వ్యత్యాసంతో అధికార పార్టీకి చెందిన ప్రభావతి గెలిచినట్లు ప్రకటించారు. మళ్లీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రీ–కౌంటింగ్ అడిగినా కూడా ఆర్‌వో ఏకపక్షంగా వ్యవహరించి.. టీడీపీ అభ్యర్థి గెలిచినట్లు ధృవీకరణపత్రం ఇచ్చేశారు. దీనిపై మాజీ మంత్రి ఆర్‌కె రోజా కౌంటింగ్ కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేయగా.. పోలీసులు ఆమెపై దురుసుగా ప్రవర్తించి, దౌర్జన్యానికి దిగారు. రోజాను పోలీసులు బలవంతంగా ఈడ్చి పారేసి అరెస్ట్ చేశారు.
» కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం రాళ్లబూదుగూరులో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి 17 ఓట్ల తేడాతో గెలిచినట్లు ప్రకటించిన అధికారులు డిక్లరేషన్ ఇవ్వకుండా.. టీడీపీ అభ్యర్థికి 3 సార్లు రీ–కౌంటింగ్ అవకాశం ఇచ్చారు. తీరా చెల్లని ఓట్లను టీడీపీ అభ్యర్థికి చెల్లుబాటు అయ్యేలా చేసి, మూడు ఓట్లతో గెలిచినట్లు డిక్లరేషన్ ఇచ్చారు. అదే మండలం 121–పెద్దూరులో 120 ఓట్ల ఆధిక్యంలో ఉన్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని బయటకు పంపించేసిన అధికారులు.. టీడీపీ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారు.
ముల్లూరు కృష్ణాపురంలో 110 ఓట్లతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉంటే, ఇక్కడ కూడా అభ్యర్థులను, ఏజెంట్లను బయటకు పంపించేసి.. టీడీపీ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారు. పూతలపట్టులోని ఐరాలలో 442 ఓట్లు పోలైనట్లు లెక్కిస్తే.. టీడీపీ అభ్యర్థికి 468 ఓట్లు వచ్చాయి. అంటే 26 ఓట్లు దొంగ ఓట్లుగా తేలిపోయింది. పలమనేరులోని మొరం ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించిన అధికారులు.. చెల్లని ఓట్లను చెల్లుబాటయ్యేలా చేసి, రీ–కౌంటింగ్‌లో టీడీపీ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారు. తొట్టంబేడు మండలం సింగమాలకు చెందిన టీడీపీ ఏజెంట్.. కట్టలు కట్టిన ఓట్లను బయటకు విసిరేశాడు.
ఏజెంట్‌కు పాస్ ఉన్నా.. లోపలికి నో ఎంట్రీ
పలు కౌంటింగ్ కేంద్రాల్లో అధికారికంగా ఏజెంట్ పాసులు జారీ అయినప్పటికీ నో ఎంట్రీ అంటూ పక్కా పథకం ప్రకారం వైఎస్సార్‌సీపీ ప్రతినిధులను పోలీసులు అడ్డుకున్నారు. పీలేరు నియోజకవర్గంలో ఆరు మండలాలకు చెందిన వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బైండోవర్ సాకుతో కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించలేదు. పాసులు ఉన్నప్పటికీ బయటే నిలిపివేసి, కొందరిని బలవంతంగా బయటకు పంపించారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో కేసులు ఉన్నాయంటూ వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను కౌంటింగ్ హాల్‌లోకి అనుమతించలేదు.

హిందూపురంలో వైఎస్సార్‌సీపీ నేత వేణురెడ్డి కాలర్ పట్టుకొని దాడి చేస్తున్న కానిస్టేబుల్ నరేష్
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ కౌంటింగ్ కేంద్రంలో హల్‌చల్ చేసినా పట్టించుకోలేదు. మీడియాకు ప్రవేశం నిరాకరించారు. నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య పీఏ కౌంటింగ్ కేంద్రంలో అధికారులు, ఏజెంట్లతో మాట్లాడుతూ ఆదేశాలు ఇచ్చినా పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరించారు. పుట్టపర్తి టీడీపీ నేత పల్లె రఘునాథరెడ్డి కౌంటింగ్ కేంద్రంలోనే తిష్ట వేసినా పోలీసులు పట్టించుకోలేదు. కొత్తపేటలో కూటమి ఎమ్మెల్యేను లోపలికి అనుమతించిన పోలీసులు.. వైఎస్సార్‌సీపీ నేతలను అడ్డుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు కౌంటింగ్ హాల్‌లో కరెంట్ ఆపేశారు. నందికొట్కూరు కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియా ప్రతినిధులను ప్రధాన గేటు వద్దే నిలిపి వేశారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో పచ్చ దాష్టీకం
» గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం చింతలపూడి వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కర్ర రమ్య 27 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రీ కౌంటింగ్‌లోనే ఈమే నెగ్గింది. అయినా మంత్రి లోకేశ్ ఒత్తిడితో ఆమెకు డిక్లరేషన్ ఫారమ్ ఇవ్వకుండా పోలీసులు నేరుగా జోక్యం చేసుకుని బెదిరించి కౌంటింగ్ కేంద్రంలో నుంచి బయటకు నెట్టేశారు. అనంతరం 23 ఓట్లతో టీడీపీ అభ్యర్థి గెలిచినట్లుగా ప్రకటించేశారు.
మోరంపూడి వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ అభ్యర్థి శృంగారపాటి అక్షయరాణి గెలుపు వాకిట ఉండగా.. పోలీసులు ఆమెను, ఆమె ఏజెంట్లను తీవ్రంగా బెదిరించారు. బయటకు వెళ్లకపోతే హత్యాయత్నం కేసు నమోదు చేస్తామంటూ భయబ్రాంతులకు గురిచేసి బయటకు నెట్టి వేశారు. ఆ తర్వాత 92 ఓట్లతో టీడీపీ అభ్యర్థి గెలిచినట్లుగా డిక్లర్ చేశారు. దుగ్గిరాల మండల రేవేంద్రపాడు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి జమ్ముగాని మంగమ్మ వంద ఓట్ల మెజార్టీతో విజయం సాధించగా, అధికార పార్టీ నేతలు, పోలీసులు అభ్యర్థితోపాటు, కౌంటింగ్ ఏజెంట్లను బయటకు నెట్టివేసి 71 ఓట్లతో టీడీపీ అభ్యర్థి గెలిచినట్లుగా ప్రకటించారు.
» బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం–1 వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా అట్ల వెంకటేశ్వరమ్మ (వైఎస్సార్ సీపీ ఎంపీపీ అభ్యర్థి) మూడు ఓట్లతో విజయం సాధించింది. అయితే రీకౌంటింగ్ పేరుతో టీడీపీ అభ్యర్థి పిట్టు పావని రెడ్డి విజయం సాధించినట్లు ప్రకటించారు. పిట్టలవానిపాలెం మండలం అల్లూరు వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ అభ్యర్థి ఉప్పు రాణి (ఎస్టీ మహిళ) ఒక్క ఓటు మెజార్టీతో విజయం సాధించింది. దీనిని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు రీకౌంటింగ్ పేరుతో గందరగోళం సృష్టించారు.
మూడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మరిచిపోయామని, అవి కలిపి రెండు ఓట్లు తేడాతో టీడీపీ అభ్యర్థి గున్నం సముద్రాలు గెలిచినట్లు ప్రకటించారు. బాపట్ల మండలం గుడిపూడి వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ అభ్యర్థి బోయిన వసంత నాలుగు ఓట్ల మెజార్టీతో విజయం సాధించగా మూడు సార్లు రీ కౌంటింగ్ పెట్టారు. తుదకు ఆమె వారి బెదిరింపులకు లొంగక పోవడంతో ఒక్క ఓటు మెజార్టీతో గెలిచినట్లు డిక్లర్ చేశారు. పోతురాజుపాలెం వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి మధుప్రోలు తిరుపతిరెడ్డి విషయంలోనూ ఇదే జరిగింది. తుదకు నాలుగు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
» గుంటూరు రూరల్ వెంగళాయపాలెం–1 ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఇందిర కళ్యాణి ఎన్నికల రోజు నుంచి అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు, పోలీసుల అరాచకాలు ఎదుర్కొంటూ ముందుకు సాగింది. గురువారం రాత్రి ఎన్నికలు ముగిశాక పోలింగ్ బాక్సులు తరలిస్తున్న తరుణంలో మార్గం మధ్యలో బ్యాలెట్ బాక్సులు మార్చేందుకు యత్నిస్తున్న అధికారులను పట్టుకుని నిలదీశారు. ఈ సందర్భంగా జరిగిన గొడవలు, అక్రమ కేసులు తెలిసిందే. ఈ క్రమంలో 40 ఓట్లతో ఆమె విజయం సాధించారు. అయితే డిక్లర్ చేయకుండా మూడు గంటల పాటు హైడ్రామా నడిపారు. టీడీపీ మూకల బెదిరింపులకు ఆమె లొంగక పోవడంతో ఎట్టకేలకు ఆమెను విజేతగా ప్రకటించక తప్పలేదు. ఇదే రీతిలో చల్లావారిపాలెం వై ఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి లక్కిరెడ్డి రేణుక ఐదు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
అమిలినేని గ్యాంగ్ బీభత్సం
అనంతపురం జిల్లా కుందుర్పి మండలం అపిలేపల్లిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చాకలి లక్ష్మి 31 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. టీడీపీ ఒత్తిడి మేరకు రీ కౌంటింగ్ చేపట్టారు. రీకౌంటింగ్‌లోనూ 21 ఓట్ల మెజార్టీ వచ్చింది. దీంతో ఎమ్మెల్యే అనుచరులు అభ్యర్థి, ఏజెంట్‌పై దాడికి దిగారు. అనంతరం బౌన్సర్లు లోపలికి వెళ్లి లెక్కించిన ఓట్లను మళ్లీ కలిపేశారు. శెట్టూరు మండలంలోని శెట్టూరు–1 ఎంపీటీసీ స్థానం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పాలబండ్ల భారతి వందకు పైగా ఓట్ల మెజార్టీతో, చెర్లోపల్లి స్థానం నుంచి వీరేష్ 150 ఓట్ల మెజార్టీతో గెలిచారు. వీరికి డిక్లరేషన్ ఇవ్వకుండా అధికారులను ఎమ్మెల్యే అమిలినేని అనుచరులు అడ్డుకున్నారు.

కళ్యాణదుర్గం కౌంటింగ్ కేంద్రం వద్ద గొడవ చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని అల్లుడు ధర్మతేజ (వృత్తంలో)
ఏకపక్షంగా సాగుతున్న కౌంటింగ్‌ను నిరసిస్తూ పది ఎంపీటీసీ స్థానాల అభ్యర్థులు, ఏజెంట్లు బ్యాలెట్ బాక్సులకు సీళ్లు కూడా తీయకుండానే ఓట్ల లెక్కింపును బహిష్కరించి కౌంటింగ్ కేంద్రాల నుంచి బయటకు వచ్చేశారు. కౌంటింగ్ కేంద్రం బయట ఆందోళనకు దిగారు. ‘సీఎం డౌన్ డౌన్.. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అక్రమాలను అడ్డుకోవాల్సిన పోలీసులు మాత్రం అధికార పార్టీకి కొమ్ము కాస్తూ నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపైనే లాఠీచార్జ్ చేశారు. ఏజెంట్లను లోపలకు అనుమతించక పోవడాన్ని ప్రశ్నించిన వారిపై కళ్యాణదుర్గం పట్టణ సీఐ హరినాథ్ ఆగ్రహంతో ఊగిపోయారు.
‘ఈ పాస్‌లతో ఏం పీకుతారు’ అంటూ మండిపడ్డారు. కంబదూరు మండల పరిధిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీకి స్పష్టమైన మెజార్టీ వస్తుండడంతో ఎమ్మెల్యే అమిలినేని అనుచరులు మరింతగా రెచ్చిపోయారు. అమిలినేని అల్లుళ్లు ధర్మతేజ, అవినాష్ సూచనలతో సుమారు 50 మంది గూండాలు రాడ్లు, కర్రలు, ఇతర వస్తువులతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, ఏజెంట్లపై మూకుమ్మడిగా దాడి చేసి గాయపరిచి..భయానక వాతావరణం సృష్టించారు. కంబదూరు మండలం గొల్లపల్లి ఎంపీటీసీ అభ్యర్థి కౌంటింగ్ ఏజెంట్ శివను రక్తం వచ్చేలా కొట్టారు. దీంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, ఏజెంట్లు ప్రాణభయంతో బయటకు పరుగెత్తుకొచ్చారు.


