తల్లిపాలే దివ్య ఔషధం | Breastfeeding protects babies from jaundice | Sakshi
Sakshi News home page

తల్లిపాలే దివ్య ఔషధం

Nov 8 2026 3:29 AM | Updated on Nov 8 2026 3:29 AM

Breastfeeding protects babies from jaundice

కామెర్ల నుంచి పసికందులకు రక్షణ 

సంజీవనిలా పనిచేస్తున్న తల్లి పాలల్లోని ‘3ఎస్‌ఎల్‌’ చక్కెర

యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోరి్నయా శాన్‌ డియాగో శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి

సాక్షి, అమరావతి: పుట్టిన బిడ్డ సంపూర్ణ ఆరో­గ్యానికి, శారీరక, మానసిక ఎదుగుదలకు అవసరమయ్యే పోషకాలు, విటమిన్లు, యాంటీబాడీలు తల్లిపాలల్లో ఉంటాయి. ఇన్‌ఫెక్షన్‌లు, శ్వాసకోశ ఇతర సమస్యలు రాకుండా కాపాడటంలోనూ తల్లిపాలు ఔషధంగా పనిచేస్తాయి. ఈ విషయాన్ని వైద్యులు నిత్యం చెబుతూ ఉంటారు. అలాగే పసికందుల పేగులను బలో­పేతం చేయడంతో పాటు ప్రాణాంతక కామెర్లు నుంచి రక్షణ కల్పించడంలో సైతం తల్లిపాలు దివ్య ఔషధంలా పనిచేస్తాయని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా శాన్‌ డియాగో వైద్యుల పరిశోధనలో తేలింది. 

ముఖ్యంగా తల్లి పాలల్లో ఉండే 3–సియాలిల్లాక్టోస్‌(3ఎస్‌ఎల్‌) అనే సహజ చక్కెర పసిబిడ్డల జీర్ణవ్యవస్థ ఎదుగుదలలో, రక్తంలో వ్యర్థాలు పేరుకుపోకుండా నివా­రించడంలో సంజీవనిలా పనిచేస్తుందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధన వివరాలు ‘సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్‌ హెపటాలజీ’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. 

3ఎస్‌ఎల్‌ లోపిస్తే తీవ్రమైన కామెర్లు..
యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా శాన్‌ డియాగోకు సంబంధించిన హ్యూమన్‌ మిల్క్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో కీలక అంశాలు గుర్తించారు. పరిశోధనలో భాగంగా తల్లి పాలలో ఉండే 3ఎస్‌ఎల్‌ ప్రభా­వంపై దృష్టి సారించారు. 3ఎస్‌ఎల్‌ చక్కెర లోపించిన పాలను తాగిన పిల్ల ఎలుకల్లో ఎదుగుదల లోపించడంతో పాటు పేగుల పరిమా­ణం తగ్గింది. కామెర్ల సమస్య తీవ్రమైంది. 

శరీ­రంలోని ‘బిలిరుబిన్‌’ వ్యర్థాలను బయటకు పంపే ‘యూజీటీ1ఏ1’ అనే కీలక ఎంజైమ్‌ ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. అంతేకాకుండా పి­ల్ల ఎలుకలు పెద్దయ్యాక రోగాల ముప్పు, పేగు సంబంధిత వ్యాధులు, ఇన్‌ఫెక్షన్‌కు గురై త్వరగా ప్రాణాలు కోల్పోతున్నట్టు పరిశోధకులు పసిగట్టారు. అదే సమయంలో 3ఎస్‌ఎల్‌ చక్కెర లోపం లేని పాలను తాగిన పిల్ల ఎలుకలు ఆరోగ్యంగా ఉన్నాయని.. పేగుల వృద్ధి బాగుందని, బిలిరుబిన్‌ వ్యర్థాలు మలం ద్వారా సక్రమంగా బయటకు వస్తున్నాయని గుర్తించారు. 

‘బిలిరుబిన్‌’ స్థాయి ఎక్కువైతే అనర్థమే!
సాధారణంగా నవజాత శిశువుల్లో ఎర్ర రక్తకణాలు విచ్ఛిన్నమైనప్పుడు ఏర్పడే వ్యర్థ పదార్థమే ‘బిలిరుబిన్‌’. కాలేయం, పేగులు దీనిని బయటకు పంపడంలో ఆలస్యమైతే రక్తంలో బిలిరుబిన్‌ స్థాయి పెరిగి కళ్లు, చర్మం పసుపు రంగులోకి మారి కామెర్లు వస్తాయి. నెలలు పూర్తిగా నిండి పుట్టిన పిల్లల్లో 60 శాతం, నెలలు నిండని పిల్లల్లో 80 శాతం కామెర్ల బారినపడే అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో ఇది దానంతట అదే తగ్గినప్పటికీ.. బిలిరుబిన్‌ మోతాదు మరీ ఎక్కువైతే మెదడుపై ప్రభావం చూపి, తీవ్ర నాడీ సంబంధిత లోపాలకు దారితీసే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement