కొత్తగా వితంతువులు, ఒంటరి మహిళలకు 3 లక్షల దాకా
దివ్యాంగులు లక్ష దాక... గీత, చేనేత, ఫైలేరియా ఇతరులకు యాభైవేలు
దీపావళి కానుకగా నేడు కొడంగల్‌లో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
మొత్తం పింఛన్లు 45,98,071కు చేరిక
సాక్షి, హైదరాబాద్: కొత్తగా నాలుగున్నర లక్షల మేర చేయూత పింఛన్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు అధికారవర్గాల సమాచారం. ఆదివారం దీపావళి కానుకగా సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఆయన చేతుల మీదుగా లాంఛనంగా కొత్త పింఛన్ల పంపిణీ జరగనుంది. అలాగే, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అర్హులైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేయనున్నారు.
ప్రస్తుతం వివిధ కేటగిరీల వారు కలిపి 41,48,071 మందికి పెన్షన్లు ఇస్తుండగా, కొత్తగా మంజూరు చేయనున్న 4.5 లక్షలు కూడా కలిపితే మొత్తం పింఛన్ల సంఖ్య 45,98,071కు చేరుకోనుంది. కొత్త చేయూత పింఛన్లలో అత్యధికంగా వితంతువులు, ఒంటరి మహిళలకు 3 లక్షల దాకా, దివ్యాంగులకు లక్ష దాకా, గీత, చేనేత, ఫైలేరియా ఇతర కేటగిరీలు కలిపి యాభైవేలకు పైగా ఇవ్వొచ్చని తెలుస్తోంది.
మొత్తం దరఖాస్తులు 5.98 లక్షలు
ఇటీవల కొత్త పింఛన్ల కోసం ఆన్‌లైన్‌లో మొత్తం 5,98,193 దరఖాస్తులు అందాయి. వాటిలో వితంతు పింఛన్ల కోసం 3,31,236, దివ్యాంగులు 1,48,882, ఒంటరి మహిళలు 62,689, గీత కార్మీకులు 37,381, చేనేత కార్మీకులవి 18,005 దరఖాస్తులున్నాయి. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో దివ్యాంగుల పింఛను రూ.6 వేలకు (ప్రస్తుతం ఇస్తున్న రూ.4 వేల నుంచి), వృద్ధులు, వితంతువులు, ఇతర కేటగిరీల పింఛను రూ.4 వేలకు (ప్రస్తుతం ఇస్తున్న రూ.2 వేల నుంచి) పెంచుతామని హామీ ఇచి్చంది.
2026–27 బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు.. కొత్తగా వివిధ కేటగిరీలకు చెందిన 2 లక్షల మంది అర్హులకు చేయూత పింఛన్లు (ఎలాంటి పెంపుదల లేకుండా) మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వివిధ కేటగిరీల దరఖాస్తులైతే తీసుకుంటున్నారు కానీ వాటి పరిశీలన పూర్తి చేసి పంపిణీ చేయడం లేదు. మేనిఫెస్టోలో హామీ మేరకు పింఛను మొత్తాన్ని పెంచకపోయినా కనీసం పాత పింఛన్ మొత్తాన్నే కొత్త లబ్ధిదారులకు అందిస్తే కొంతైనా ఆసరాగా ఉంటుందని భావించి, కొత్తగా నాలుగున్నర లక్షల పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.


